Karnataka: కర్ణాటక అసెంబ్లీలో హనీట్రాప్ వ్యవహారంపై రచ్చ

కర్ణాటక రాజకీయాల్లో హనీ ట్రాప్‌(Honey Trap) వ్యవహారం కలకలం రేపుతోంది. కాగా.. శుక్రవారం హనీ ట్రాప్ వ్యవహారంపై అసెంబ్లీలో రచ్చ జరిగింది.

Update: 2025-03-21 13:05 GMT
Karnataka: కర్ణాటక అసెంబ్లీలో హనీట్రాప్ వ్యవహారంపై రచ్చ
  • whatsapp icon

దిశ, నేషనల్ బ్యూరో: కర్ణాటక రాజకీయాల్లో హనీ ట్రాప్‌(Honey Trap) వ్యవహారం కలకలం రేపుతోంది. కాగా.. శుక్రవారం హనీ ట్రాప్ వ్యవహారంపై అసెంబ్లీలో రచ్చ జరిగింది. ఈ అంశంపై చర్చ జరపాలని బీజేపీ పట్టుబట్టింది. అయితే, ఆ నిరసనలను పట్టించుకోకుండా ముస్లిం కోటా బిల్లును స్పీకర్‌ పాస్‌ చేస్తున్నట్లు స్పీకర్ ప్రకటించారు. దీంతో సభ ఒక్కసారిగా గందరగోళంగా మారింది. బీజేపీ ఎమ్మెల్యేలు ఆగ్రహంతో స్పీకర్ వెల్ లోకి దూసుకెళ్లారు. బీజేపీ సభ్యులు తమ చేతుల్లోని ముస్లిం కోటా బిల్లు(Muslim Quota Bill) ప్రతులను చించి స్పీకర్‌ పైకి విసిరేశారు. దీంతో, ఆందోళన ముఖంపైకి విసిరి కొట్టారు. దీంతో, కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు రెచ్చిపోయారు. బుక్‌లు, పేపర్లను ప్రతిపక్ష సభ్యులపైకి విసిరారు. ఈ గందరగోళం మధ్య సభను స్పీకర్‌ కాసేపు వాయిదా వేశారు. ఇకపోతే, పబ్లిక్‌ కాంట్రాక్ట్‌లలో ముస్లింలకు 4 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ కాంగ్రెస్‌ ప్రభుత్వం చట్టం తెచ్చింది. అయితే, ఇది రాజ్యాంగ విరుద్ధమని బీజేపీ విమర్శిస్తోంది. సిద్ధరామయ్య సర్కారు నిర్ణయంపై కోర్టుకు వెళ్తామని చెబుతోంది. మరోవైపు, ఈ ఘటనపై బీజేపీ ఎమ్మెల్యే భరత్ శెట్టి స్పందించారు. ‘‘హనీ ట్రాప్‌ వ్యవహారంపై చర్చించకుండా.. ముస్లిం కోటా బిల్లును ప్రవేశపెట్టడంపైన సీఎం సిద్ధరామయ్య దృష్టి పెట్టారు. అందుకే మేం నిరసన తెలిపాం. అంతేగానీ మేం ఎవరికీ హాని తలపెట్టలేదు’’ అని చెప్పుకొచ్చారు. ఇకపోతే, ముస్లిం కోటా నిర్ణయంపై వెనక్కి తగ్గేది లేదని కాంగ్రెస్‌ ప్రభుత్వం వెల్లడించింది. సామాజిక న్యాయం, మైనారిటీలకు ఆర్థిక సాధికారకత కోసం రిజర్వేషన్లు తీసుకొచ్చామని కర్ణాటక సర్కారు చెబుతోంది. అయితే, అసెంబ్లీలోని గందరగోళ పరిస్థితుల మధ్య స్పీకర్ కార్యాలయం ప్రకటన విడుదల చేసింది. అసెంబ్లీలో ముస్లింలకు రిజర్వేషన్ బిల్లు పాస్ కాలేదని.. అది ఆర్థిక బిల్లు అని స్పీకర్ కార్యాలయం వెల్లడించింది.

హనీట్రాప్ వ్యవహారంపై సీఎం స్పందన

ఇక, హనీట్రాప్‌ వ్యవహారంపై సీఎం సిద్ధరామయ్య(CM Siddaramaiah) స్పందించారు. ఇందులో ఎవరి ప్రమేయం ఉన్నట్లు తేలినా చర్యలు తీసుకుంటామన్నారు. ఇందులో నుంచి ఎవరినీ రక్షించే ఉద్దేశం తమ ప్రభుత్వానికి లేదని చెప్పుకొచ్చారు. ఉన్నత స్థాయి కమిటీతో విచారణ చేస్తామని హోంమంత్రి జి పరమేశ్వర హామీ ఇచ్చినప్పటికీ బీజేపీ అనవసర రాద్ధాంతం సృష్టిస్తోందని మండిపడ్డారు. ఇదిలా ఉంటే.. మంత్రులు, ఎమ్మెల్యేలతో సహా 48 మంది రాజకీయ నేతలు హనీట్రాప్‌ బాధితులుగా ఉన్నారంటూ కర్ణాటక మంత్రి రాజన్న అసెంబ్లీలో ప్రకటించారు. ఇది తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఆ 48 మంది రాజకీయ నాయకుల్లో అధికార, విపక్ష సభ్యులతో పాటు జాతీయ స్థాయి నాయకులు ఉన్నారని షాక్ ఇచ్చారు. అయితే, ఈ వ్యవహారంపై ఉన్నత స్థాయి దర్యాప్తు జరిపిస్తామని కాంగ్రెస్‌ ప్రభుత్వం అంటుంటే.. బీజేపీ మాత్రం విమర్శలు గుప్పిస్తోంది. ఈ వలపు వల వెనుక కాంగ్రెస్‌ ప్రభుత్వ హస్తమే ఉందని.. దీనిపై సీబీఐతో దర్యాప్తు చేయించాలని డిమాండ్‌ చేస్తోంది.

Tags:    

Similar News