బెట్టింగ్ యాప్‌లతో జాగ్రత్త

ఐపీఎల్‌కు సంబంధించి ఫాంటసీ లీగ్ పేరుతో డ్రీమ్11, మై11సర్కిల్ వంటి యాప్స్ ఒక రకమైన బెట్టింగ్‌ను ప్రోత్సహిస్తోంది.

Update: 2025-03-22 18:15 GMT
బెట్టింగ్ యాప్‌లతో జాగ్రత్త
  • whatsapp icon

- ఐపీఎల్ సమయంలో వందలాది బెట్టింగ్ యాప్స్, సైట్స్

- 100 శాతం గ్యారెంటీ రిటర్స్ పేరుతో ఆశ

- యాప్‌ల బారిన పడి మోసపోతున్న యువత

- ఈ రెండు నెలల్లోనే రూ.వేల కోట్ల వ్యాపారం

దిశ, నేషనల్ బ్యూరో: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) అత్యంత వైభవంగా ప్రారంభమయ్యింది. ఇండియాలో క్రికెట్‌కు ఉన్న క్రేజ్‌ను క్యాష్ చేసుకోవడానికి అప్పుడే బెట్టింగ్ మాఫియా బరిలోకి దిగింది. ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ పద్దతుల్లో బెట్టింగ్‌ను ప్రోత్సహిస్తూ రూ.వేలాది కోట్లు ఈ రెండు నెలల్లో తమ ఖాతాల్లో వేసుకుంటాయి. ముఖ్యంగా క్రికెట్ పిచ్చి ఉన్న యువతను ఈ బెట్టింగ్ యాప్‌లు ఆఫర్ల పేరుతో ఆకర్షించి.. అప్పుల్లో మునిగి పోయేలా చేస్తున్నారు. బెట్టింగ్ యాప్‌లపై తెలంగాణ పోలీసులు ఇప్పటికే కేసులు నమోదు చేస్తున్నారు. బెట్టింగ్ యాప్స్‌ కోసం ప్రచారం చేస్తున్న సినీ నటులు, సోషల్ మీడియా ఇన్‌ఫ్ల్లుయెన్సర్లపై కేసులు కూడా నమోదు చేశారు. కాగా, ఐపీఎల్ సమయంలో వందలాది బెట్టింగ్ యాస్స్, సైట్స్ పుట్టుకొని వస్తాయని.. వాటి పట్ల అప్రమత్తంగా ఉండాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు.

యాప్ స్టోర్లలో లేకపోయినా..

ఐపీఎల్‌కు సంబంధించి ఫాంటసీ లీగ్ పేరుతో డ్రీమ్11, మై11సర్కిల్ వంటి యాప్స్ ఒక రకమైన బెట్టింగ్‌ను ప్రోత్సహిస్తోంది. తెలంగాణ, ఏపీ, అస్సాం, సిక్కిం, నాగాలాండ్ రాష్ట్రాల్లో తప్ప మిగిలిన రాష్ట్రాల్లో ఈ యాప్స్ ద్వారా ఐపీఎల్ ఫాంటసీ లీగ్‌ను ఆడే అవకాశం ఉంది. అయితే పరిమ్యాచ్, బెట్‌వే, 1ఎక్స్‌బెట్, బెట్‌ఫెయిర్, క్రికెక్స్, ఫెయిర్‌ప్లే, లోటస్365 వంటి ఇల్లీగల్ యాప్స్ నేరుగా బెట్టింగ్‌ను నిర్వహిస్తున్నాయి. యాప్ స్టోర్, ప్లే స్టోర్‌లలో వీటిని డౌన్‌లోడ్ చేసుకునే అవకాశం ఉండదు. కానీ apk ఫైల్స్‌ ద్వారా ఫోన్‌లలోకి ఇన్‌స్టాల్ చేసుకోవచ్చు. ఇల్లీగల్ బెట్టింగ్ నిర్వహిస్తున్న ఇలాంటి యాప్స్‌పై చర్యలు తీసుకోవాలని ఈ-గేమింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా(ఈజీఎఫ్) గతంలోనే ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. అయితే ఈ యాప్స్‌ను వేరే దేశాల్లోని సర్వర్ల నుంచి నిర్వహిస్తుండటంతో వాటిని అరికట్టడం కష్టంగా మారింది. 2023లో ఈ ఇల్లీగల్ బెట్టింగ్ యాప్స్ దాదాపు రూ.80 వేల కోట్ల డిపాజిట్లను సేకరించినట్లు తేలింది. ఇక ఈ ఏడాది కూడా ఐపీఎల్ సమయంలో ఈ ఇల్లీగల్ బెట్టింగ్ యాప్స్ అప్పుడే తమ దందాను మొదలు పెట్టాయి.

ఇలా దోచుకుంటారు..

పేరుకు క్రికెట్ బెట్టింగ్ యాప్సే అయినా.. ఇవి యూజర్ల పర్సనల్ డేటాను దొంగిలిస్తున్నాయి. దీని ద్వారా యూజర్ల ఫైనాన్షియల్ విషయాలను గమనించి.. సైబర్ ఫ్రాడ్‌కు పాల్పడిన సంఘటనలు కూడా ఉన్నాయి. మరోవైపు ఆఫర్లు, డిస్కౌంట్ల పేరుతో కొత్త యూజర్లను ఆకర్షిస్తాయి. ముందగానే రూ.100 నుంచి రూ.2000 వరకు క్యాష్ లోడ్ చేసి.. వాటిని వాడి బెట్టింగ్ చేయాలని ప్రోత్సహిస్తాయి. ఆ తర్వాత నెమ్మయదిగా యూజర్లతో డిపాజిట్ చేయించడం మొదలు పెడతాయి. మొదట్లో డబ్బులు వచ్చినట్లు కనపడినా.. ఆ తర్వాత యూజర్‌ను పూర్తిగా ముంచేస్తాయి. ఇలా రూ.లక్షల్లో నష్టపోతున్న వాళ్లు చాలా మంది ఉన్నారు. దేశవ్యాప్తంగా ఇల్లీగల్ బెట్టింగ్స్ నిర్వహిస్తూ రూ.వేలకోట్లను కొల్లగొడుతున్నాయి. డబ్బులు నష్టపోయిన వారు పోలీసులకు ఫిర్యాదు చేయడానికి భయపడుతున్నారు. బెట్టింగ్‌లో నష్టపోయామని తెలిస్తే పరువు పోతుందని చాలా మంది సైలెంట్‌గా ఉండిపోతున్నారు. ఇదే ఆ ఇల్లీగల్ బెట్టింగ్ నిర్వాహకులకు కలిసి వస్తుందని పోలీసులు అంటున్నారు. ఒక వేళ పోలీసులకు కంప్లైంట్ ఇచ్చినా.. ఇతర దేశాల్లో ఉండే ఈ ముఠా సభ్యులను పట్టుకోవడం కష్టంగా మారుతుంది.

ఆఫ్‌లైన్‌లో..

ఆన్‌లైన్ యాప్స్ ద్వారానే కాకుండా.. ఆఫ్‌లైన్‌లో కూడా ఎక్కడికక్కడ బెట్టింగ్ ముఠాలు ఐపీఎల్ సమయంలో అభిమానులను దోచుకుంటున్నాయి. ప్రతీ ప్రాంతంలో పంటర్లను ఏర్పాటు చేసుకొని.. మిడిల్ మ్యాన్, బుకీలు ఈ భారీ బెట్టింగ్‌ను నిర్వహిస్తున్నారు. కేవలం ఫోన్ల ద్వారానే నడిచే ఈ బెట్టింగ్ వ్యాపారంలో డబ్బులు సంపాదించేది కేవలం ఒకరిద్దరు మాత్రమే. బాల్ టూ బాల్, ఓవర్ టూ ఓవర్ బెట్టింగ్స్ వేస్తూ.. చాలా మంది డబ్బులు పోగొట్టుకుంటున్నారు. ముందుగా డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేకపోవడంతో టీనేజీ యువత ఈ బెట్టింగ్ మాయలో పడి తీవ్రంగా నష్టపోతున్నారు. బెట్టింగ్ ఉచ్చులో చిచ్చుకొని ఆత్మహత్యలు చేసుకున్న సంఘటనలు గతంలో చాలా జరిగాయి. ఈ బెట్టింగ్స్ ఎక్కువగా బార్లు, పబ్‌ల వేదికగా జరుగుతుంటాయి. కాబట్టి ఈ సీజన్‌లో పోలీసులు కూడా ఇలాంటి ప్రదేశాల్లో నిఘా పెంచుతుంటారు. అయినా సరే నిర్వహాకులు మాత్రం ఏదో ఒక విధంగా తమ దందాను కొనసాగిస్తున్నారు. ఆన్‌లైన్ యాప్స్ ద్వారా కంటే ఇలాంటి అసంఘటిత బెట్టింగ్ ముఠాల ద్వారా రూ.లక్షల కోట్ల వ్యాపారం జరుగుతుందని అంచనా ఉంది. ఐదేళ్ల క్రితం రూ.1లక్ష కోట్ల వరకు ఈ వ్యాపారం జరిగేది. ఇప్పుడు రూ.లక్షన్నర కోట్లు దాటి పోయి ఉంటుందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

బెట్టింగ్ అనేది పూర్తిగా అక్రమం. అందుకే భారత ప్రభుత్వం ఈ బెట్టింగ్ యాప్స్‌ను పూర్తిగా నిషేధించింది. అయినా సరే యువత ఈ బెట్టింగ్ ఉచ్చులో చిక్కుకొని తీవ్రంగా నష్టపోతున్నారు. కాబట్టి వీటికి సాధ్యమైనంత దూరంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు. ఆటను చూసి ఎంజాయ్ చేయడం తప్పు లేదు. కానీ దానిపై బెట్టింగ్ వేయడమే తప్పని పోలీసులు హెచ్చరిస్తున్నారు.

Tags:    

Similar News