విపక్షాల మీటింగ్‌కు ఆతిథ్యమిస్తున్న నితీష్, లాలూలపై జేపీ నడ్డా ఫైర్

బీహార్‌ రాజధాని పాట్నాలో విపక్ష పార్టీల మీటింగ్‌కు ఆతిథ్యమిస్తున్న జేడీయూ చీఫ్ నితీష్ కుమార్, ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్‌

Update: 2023-06-23 12:04 GMT

భవానీపట్న (ఒడిశా): బీహార్‌ రాజధాని పాట్నాలో విపక్ష పార్టీల మీటింగ్‌కు ఆతిథ్యమిస్తున్న జేడీయూ చీఫ్ నితీష్ కుమార్, ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్‌లపై బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా విరుచుకుపడ్డారు. "రాజకీయాల్లో ఇప్పుడు విచిత్ర ఘటనలు జరుగుతున్నాయి. మాజీ ప్రధాని ఇందిరాగాంధీ దేశంలో ఎమర్జెన్సీ విధించిన సమయంలో జైలుకు వెళ్లిన నేతలే ఇప్పుడు ఆమె మనవడు రాహుల్‌ గాంధీకి ఆహ్వానం పలుకుతున్నారు" అని విమర్శించారు. ఒడిశాలోని కలహండి జిల్లా భవానీపట్నలో జరిగిన బహిరంగ సభలో నడ్డా మాట్లాడారు. ఎమర్జెన్సీ సమయంలో విద్యార్థి నేతలుగా ఉన్న లాలూ, నితీశ్‌.. జయప్రకాశ్ నారాయణ్‌ సారథ్యంలో ఇందిరాగాంధీకి వ్యతిరేకంగా జరిగిన ఉద్యమంలో పాల్గొని అరెస్టయ్యారని ఆయన గుర్తు చేశారు.

అప్పట్లో లాలూ 22 నెలలు, నితీశ్‌ 20 నెలలు జైలుశిక్ష అనుభవించారని చెప్పారు. ‘‘విపక్షాల భేటీలో పాల్గొనేందుకు ఉద్ధవ్‌ థాక్రే పాట్నాకు రావడం చూశా. ఆయన తండ్రి బాలాసాహెబ్‌ థాక్రే కాంగ్రెస్‌ను ఎప్పుడూ వ్యతిరేకించేవారు కాంగ్రెస్‌లో చేరడం కంటే పార్టీని మూసివేయడం మంచిదని ఓసారి బాలాసాహెబ్‌ అన్నారు. ఇప్పుడు ఆయన తనయుడు ఉద్ధవ్‌ ఠాక్రే దుకాణ్‌‌ను మూసివేస్తున్నారు’’ అని నడ్డా విమర్శించారు. వారసత్వ రాజకీయాలను వ్యతిరేకించిన ప్రధాని మోడీ .. అభివృద్ధి రాజకీయాలను దేశానికి పరిచయం చేశారన్నారు.


Similar News