Meerut: ఉత్తరప్రదేశ్ లో దారుణం.. చిన్నారులపై లైంగిక వేధింపులు

ఉత్తరప్రదేశ్‌లోని మీరఠ్ లో దారుణం జరిగింది. ఓ వ్యక్తి తన దుకాణానికి వచ్చే పలువురు చిన్నారులు, యువకులపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు.

Update: 2024-08-27 06:13 GMT

దిశ, నేషనల్ బ్యూరో: ఉత్తరప్రదేశ్‌లోని మీరఠ్ లో దారుణం జరిగింది. ఓ వ్యక్తి తన దుకాణానికి వచ్చే పలువురు చిన్నారులు, యువకులపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. అంతటితో ఆగకుండా ఆ దారుణాన్ని వీడియో తీసి డబ్బులు తీసుకురావాలంటూ బెదిరించాడు. కొన్నేళ్లుగా జరుగుతున్న ఈ విషయాలు ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ కావడంతో బయటపడింది. దీంతో పోలీసులు కేసు నమోదు చేశారు. గ్రామంలో కిరాణా దుకాణం నడుపుతున్న 37 ఏళ్ల వ్యక్తిపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. మొత్తం ఆరుగురు బాధితులు ఉండగా.. వారిలో నలుగురు మైనర్లు ఉన్నారు. బాధితుల్లో బాలురు కూడా ఉండటం గమనార్హం. తన దుకాణానికి వస్తువులు కొనుగోలు చేసేందుకు వచ్చిన వారిని నిందితుడు టార్గెట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. ‘దుకాణానికి వచ్చిన వారికి మత్తు పదార్థాలు కలిపిన డ్రింక్స్ అందించి.. వారిని లైంగికంగా వేధించి.. దాన్ని వీడియో తీసేవాడు. ఆ వీడియోలను ఉపయోగించి పిల్లలను బ్లాక్ మెయిల్ చేసి, ఆ వీడియోలను పబ్లిక్ చేస్తానని బెదిరించి వారి నుంచి డబ్బులు వసూలు చేశాడు.’ అని పోలీసులు వెల్లడించారు. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. అయితే నిందితుడు ప్రస్తుతం పరారీలో ఉండటంతో అతడి కోసం గాలింపు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.

బాధితులు ఏమన్నారంటే?

నిందితుడి చర్యలకు సంబంధించిన ఓ వీడియో బయటకు రావడంతో అనేక మంది చిన్నారులు తమపై జరిగిన దారుణం గురించి తల్లిదండ్రులకు తెలియజేశారు. ఒక రోజు తాను నిందితుడి దుకాణానికి వెళ్తే అతడు తనకు కూల్‌డ్రింక్‌ ఇచ్చాడని తాగిన తర్వాత ఏమయ్యిందో గుర్తులేదని ఓ చిన్నారి స్థానిక మీడియాకు తెలిపింది. మళ్లీ వెళ్లినప్పుడు తన వీడియో చూపించి డబ్బులు తీసుకురావాలని డిమాండ్‌ చేశాడని, లేదంటే ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్‌ చేస్తానని బెదిరించాడని పేర్కొంది. లైంగిక వేధింపులకు గురైన ఓ బాలుడి తల్లి మాట్లాడుతూ.. తమ కుమారుడు కొద్ది రోజులగా ఎవరితోనూ మాట్లాడకుండా ముభావంగా ఉంటున్నాడని, ఏమి అడిగినా చెప్పట్లేదని ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసులు తమ ఇంటికి వచ్చాకే అసలు ఏమి జరుగుతుందో తెలిసిందని, తమ కుమారుడు కొద్ది రోజులుగా కారణం చెప్పకుండా ఇంట్లో నుంచి రూ.3,000 తీసుకున్నాడని, అలా ఎందుకు చేశాడో ఇప్పుడు అర్థమవుతోందని మరో బాలుడి తల్లి పేర్కొన్నారు.


Similar News