అమెరికా ప్రెసిడెంట్‌గా ఉండుంటే.. దానిపై మోడీని ప్రశ్నించేవాడిని : Barack Obama

అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా భారత్‌లో ముస్లిం మైనార్టీల హక్కులపై స్పందించారు.

Update: 2023-06-23 10:18 GMT

వాషింగ్టన్: అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా భారత్‌లో ముస్లిం మైనార్టీల హక్కులపై స్పందించారు. ఒకవేళ తాను అమెరికా అధ్యక్షుడు బైడెన్ స్థానంలో ఉండి ఉంటే.. కచ్చితంగా భారత ప్రధాని నరేంద్ర మోడీని దీనిపై ప్రశ్నించి ఉండేవాడినని చెప్పారు. భారత్‌లో ముస్లిం మైనార్టీల కు లభిస్తున్న రక్షణ అంశాన్ని మోడీ ఎదుట ప్రస్తావించి ఉండేవాడినన్నారు. ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో బరాక్ ఒబామా ఈ వ్యాఖ్యలు చేశారు. మైనారిటీల హక్కులను పరిరక్షించకపోతే.. భారతదేశం ఏదో ఒక సమయంలో ముక్కలవడానికి బలమైన అవకాశం ఉంటుందని ఆయన కామెంట్ చేశారు.

“భారత్‌లో భారీ స్థాయిలో అంతర్గత వైరుధ్యాలు పెరిగిపోతే ఏం జరుగుతుందో గతంలో మనం చూశాం” అని పేర్కొన్నారు. “హిందువులు మెజారిటీ గా ఉన్న భారతదేశంలో ముస్లిం మైనారిటీల రక్షణ అనేది మోడీ ఎదుట బైడెన్ కచ్చితంగా ప్రస్తావించాల్సిన విషయం” అని ఒబామా అభిప్రాయపడ్డారు. బరాక్ ఒబామా ఇంటర్వ్యూ క్లిప్‌ను కాంగ్రెస్ నాయకురాలు సుప్రియా శ్రినతే ట్విట్టర్‌లో షేర్ చేశారు. మరోవైపు వాషింగ్టన్‌లోని వైట్‌హౌస్‌లో విలేకరుల సమావేశంలో ప్రధాని నరేంద్ర మోడీ మాట్లాడుతూ.. భారతదేశంలో వివక్షకు స్థానం లేదన్నారు. భారత్ నరనరాన ప్రజాస్వామ్య రక్తం ప్రవహిస్తోందని చెప్పారు.


Similar News