Ranya Rao: రన్యారావుపై బీజేపీ ఎమ్మెల్యే వివాదాస్పద వ్యాఖ్యలు
ఈ కేసులో ఏయే మంత్రుల ప్రమేయం ఉందో తనకు తెలుసునని అన్నారు.

దిశ, నేషనల్ బ్యూరో: ఇటీవల బంగారం స్మగ్లింగ్ చేస్తూ పట్టుబడ్డ కన్నడ నటి రన్యారావు వ్యవహారం దేశవ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే. ఈ కేసుకు సంబంధించి డీఆర్ఐ అధికారుల దర్యాప్తు కొనసాగుతోంది. ఈ వ్యవహారం రాజకీయ అంశంగా మారిన నేపథ్యంలో కర్ణాటకలో అధికార కాంగ్రెస్, బీజేపీ మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. తాజాగా దీనికి సంబంధించి బీజాపూర్ నియోజకవర్గ బీజేపీ ఎమ్మెల్యే బసన్‌గౌడ పాటిల్ యత్నాల్ వివాదాస్పద వ్యాఖ్యలతో కొత్త వివాదానికి తెర లేపారు. ఈ కేసులో ఏయే మంత్రుల ప్రమేయం ఉందో తనకు తెలుసునని అన్నారు. అంతేకాకుండా రన్యారావు తన శరీరమంతా బంగారంతో కప్పుకుందని, ఆమె శరీరంలోని అన్ని భాగాల్లో బంగారం దాచుకుందని, ప్రైవేట్ పార్టుల్లో, రంధ్రాలున్న చోటల్లా ఉంచిందనే విషయం తనకు తెలుసునని చెప్పారు. వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో అందరి బంగారం బయట పెడతానని తెలిపారు. రన్యారావు తండ్రి రామచంద్రరావు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి అయ్యుండి స్మగ్లింగ్‌కి ఎలా సహకరిస్తారు. ఈ కేసులో ఎయిర్‌పోర్ట్ కస్టమ్స్ అధికారుల లోపాలు కూడా కనిపిస్తున్నాయి. వారిపై కూడా చర్యలు తీసుకోవాలని బసన్‌గౌడ డిమాండ్ చేస్తున్నట్టు విలేకరులతో చెప్పారు. ఈ వ్యాఖ్యలకు సంబంధించి వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. రన్యారావుపై ఆయన చేసిన వ్యాఖ్యలు అభ్యంతరకరంగా ఉండటంతో బసన్‌గౌడ మరోసారి వివాదంలో చిక్కుకున్నారు.