విస్తారా విమానంలో హైజాక్ కలకలం..

ముంబై నుంచి ఢిల్లీకి బయలుదేరిన విస్తారా విమానంలో కలకలం రేగింది.

Update: 2023-06-23 11:36 GMT

ముంబై : ముంబై నుంచి ఢిల్లీకి బయలుదేరిన విస్తారా విమానంలో కలకలం రేగింది. ఇంకొన్ని నిమిషాల్లో ముంబై సిటీ విమానాశ్రయం నుంచి విమానం టేకాఫ్ అవుతుందనగా.. విమానంలో కూర్చున్న ఒక ప్యాసింజర్(23) తన ఫోన్‌ తీసి ఎవరికో కాల్ చేశాడు. ‘అహ్మదాబాద్ కా ఫ్లైట్ బోర్డ్ కర్నే వాలా హై. కోయి భీ దిక్కత్ హో తో ముఝే కాల్ కర్నా’ (అహ్మదాబాద్‌కి వెళ్లే విమానం ఎక్కుతాను. మీకు ఏదైనా ఇబ్బంది ఎదురైతే నాకు కాల్ చేయండి) అని ఫోన్‌లో చెప్పాడు. ‘హైజాక్ కా సారా ప్లానింగ్ హై. ఉస్కా సారా యాక్సెస్ హై చింతా మత్ కర్నా’ (హైజాకింగ్‌కు సంబంధించిన అన్ని ప్రణాళికలు ఉన్నాయి. అన్నింటికీ యాక్సెస్ ఉన్నందున చింతించకండి) అని అన్నాడు.. ఆ వ్యక్తి ఫోన్ సంభాషణను క్యాబిన్ సిబ్బంది, ఇతర ప్రయాణికులు విన్నారు. అది విన్నాక వారు భయపడ్డారు.

ప్రయాణికుల్లో చాలామంది లేచి నిలబడ్డారు. వెంటనే క్యాబిన్ సిబ్బంది విమానంలోని భద్రతా సిబ్బందిని పిలిపించి.. ఆ ఫోన్ సంభాషణ చేసిన ప్రయాణికుడిని సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్‌కి అప్పగించారు. గురువారం సాయంత్రం 6.30 గంటలకు ముంబైలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఈ ఘటన జరిగింది. ఆ ప్రయాణికుడి పేరు రితేష్ జునేజా అని గుర్తించారు. క్యాబిన్ క్రూ సిబ్బంది ఫిర్యాదు మేరకు అతడిని ముంబైలోని సహర్ పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లి.. ఐపీసీలోని 336, 505 (2) సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. నిందితుడి మానసిక స్థితి సరిగ్గా లేదని.. 2021 నుంచి వైద్య చికిత్స పొందుతున్నట్లు వెలుగులోకి వచ్చిందని పోలీసులు తెలిపారు. ఈ వివరాలను విస్తారా ఎయిర్‌లైన్ ప్రతినిధి ధృవీకరించారు.


Similar News