Cji chandrachud: భారత్, భూటాన్‌లకు సంప్రదాయ విలువలే పునాది.. సీజేఐ చంద్రచూడ్

భారత్, భూటాన్ వంటి దేశాలకు సంప్రదాయ విలువలే ప్రధానమని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి చంద్రచూడ్ నొక్కి చెప్పారు.

Update: 2024-10-09 11:37 GMT

దిశ, నేషనల్ బ్యూరో: భారత్, భూటాన్ వంటి దేశాలకు సంప్రదాయ విలువలే ప్రధానమని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి చంద్రచూడ్ నొక్కి చెప్పారు. ఇరుదేశాల్లో సంప్రదాయ కమ్యునిటీ వివాద పరిష్కార విధానాలు ఆధునిక రాజ్యాంగ ఆలోచనలతో కలపాలని సూచించారు. భూటాన్‌లోని జిగ్మే సింగ్వే వాంగ్ చుక్ లా స్కూల్ స్నాతకోత్సవంలో ఆయన ప్రసంగించారు. చట్టం కేవలం వివాదాలకే పరిమితం కావొద్దని, సామాజిక మార్పునకు సైతం సమర్థవంతమైన సాధనంగా ఉపయోగపడాలన్నారు. యువతలోని అభిరుచి, ఆదర్శవాదాన్ని వారి శిక్షణ, నైపుణ్యంతో కలపాలని అభిప్రాయపడ్డారు. ఈ వేడుకకు భూటాన్ యువరాణి సోనమ్ డెచెన్ వాంగ్ చుక్, తదితరులు హాజరయ్యారు.

రెండేళ్ల పదవీకాలం సంతృప్తినిచ్చింది

వచ్చే నెలలో పదవీ విరమణ చేయనున్న చంద్రచూడ్ తన భవిష్యత్, గతం గురించి ఆందోళన వ్యక్తం చేశారు. న్యాయవ్యవస్థలో తాను చేయాలనుకున్న వన్నీ చేశానా లేదా అని తరచూ ఆలోచిస్తుంటానని చెప్పారు. భవిష్యత్ తరాల న్యాయమూర్తులు, న్యాయ నిపుణుల కోసం నేను ఏ వారసత్వాన్ని వదిలివేస్తానని ప్రశ్నించుకుంటానని తెలిపారు. అయితే ఈ ప్రశ్నలకు సమాదానాలు తన నియంత్రణలో లేవన్నారు. తన రెండేళ్ల పదవీకాలం సంతృప్తినిచ్చిందని, ఫలితాలు ఎలా ఉన్న విధులను మాత్రం పూర్తి అంకిత భావంతో నిర్వర్తించానని తెలిపారు. రిజల్ట్ గురించి ఆలోచించకుండా పనిచేస్తే ఫలితం దానంతట అదే వస్తుందని చెప్పారు. కాగా, చంద్రచూడ్ నవంబర్ 8న పదవీ విరమణ చేయనున్నారు.

Similar News