CBI : వైద్యురాలిపై హత్యాచారం కేసు.. సీబీఐ సేకరించిన 11 సాక్ష్యాలివీ

దిశ, నేషనల్ బ్యూరో : కోల్‌కతాలోని ఆర్జీ కర్ మెడికల్ కాలేజీలో ఆగస్టు 9న తెల్లవారుజామున జూనియర్ వైద్యురాలిపై హత్యాచారం జరిపింది సెక్యూరిటీ గార్డ్ (సివిక్ వాలంటీర్) సంజయ్ రాయే అని సీబీఐ వెల్లడించింది.

Update: 2024-10-09 13:24 GMT

దిశ, నేషనల్ బ్యూరో : కోల్‌కతాలోని ఆర్జీ కర్ మెడికల్ కాలేజీలో ఆగస్టు 9న తెల్లవారుజామున జూనియర్ వైద్యురాలిపై హత్యాచారం జరిపింది సెక్యూరిటీ గార్డ్ (సివిక్ వాలంటీర్) సంజయ్ రాయే అని సీబీఐ వెల్లడించింది. ఈ ఘోర ఉదంతానికి సంబంధించిన 11 సాక్ష్యాల సమాచారాన్ని తాజాగా కోర్టుకు సమర్పించిన ఛార్జిషీట్‌లో సవివరంగా ప్రస్తావించింది. కాలేజీలోని సెమినార్ హాలులో జూనియర్ వైద్యురాలు గాఢనిద్రలో ఉండగా సంజయ్ రాయ్ అత్యాచారం చేసి, హత్య చేశాడని సీబీఐ పేర్కొంది. గ్యాంగ్ రేప్ జరిగినట్లుగా ఎలాంటి ఆధారాలు లభించలేదని స్పష్టం చేసింది. జూనియర్ వైద్యురాలి డెడ్‌బాడీకి నిర్వహించిన పోస్టుమార్టంలో కీలక సాక్ష్యాలను సేకరించినట్లు సీబీఐ తెలిపింది. ఆమె డెడ్‌బాడీపై నుంచి సేకరించి లాలాజలం, వీర్యం శాంపిల్స్ సంజయ్ రాయ్‌వే అని తేలిందని వెల్లడించింది. హత్యాచారం జరిగిన ప్రదేశంలో లభ్యమైన చిన్నసైజు వెంట్రుకలు కూడా అతడివేనని గుర్తించామని సీబీఐ పేర్కొంది. జూనియర్ వైద్యురాలి డెడ్‌బాడీ‌ నుంచి సేకరించిన వీర్యంలోని డీఎన్ఏ నమూనా, సంజయ్ రాయ్‌ డీఎన్ఏ నమూనా ఒక్కటేనని సాంకేతిక విశ్లేషణలో బహిర్గతమైందని చెప్పింది.

బ్లూటూత్ ఇయర్ ఫోన్ నెక్ బ్యాండ్..

ఆగస్టు 9న సంజయ్ రాయ్ హత్యాచారానికి పాల్పడిన టైంలో ధరించిన జీన్స్, ఫుట్ వేర్‌‌లను.. ఆగస్టు 12న పోలీసులు సీజ్ చేశారు. వాటిని సీబీఐ అధికారులు టెస్ట్ చేయించగా.. జీన్స్, ఫుట్‌వేర్‌‌లపై ఉన్న రక్తపు మరకలు జూనియర్ వైద్యురాలివేనని తేలింది. అత్యాచారం జరిగే క్రమంలో వైద్యురాలు తీవ్రంగా ప్రతిఘటించిందని.. ఈక్రమంలో సంజయ్ రాయ్ శరీరంపై కొన్ని గాయాలయ్యాయని గుర్తించినట్లు సీబీఐ పేర్కొంది. అత్యాచారం జరిపిన అనంతరం గొంతు నులిమి ఆమెను నిందితుడు హత్య చేశాడని వెల్లడించింది. సెమినార్ హాలులోకి వెళ్లే టైంలో సంజయ్ మెడకు బ్లూటూత్ ఇయర్ ఫోన్ నెక్ బ్యాండ్ ఉందని.. హత్యాచారం జరిపిన తర్వాత బయటికి వెళ్లిపోయేటప్పుడు అతడి మెడకు అది లేదని సీబీఐ గుర్తించింది. సంఘటనా స్థలంలో ఆ బ్లూటూత్ ఇయర్ ఫోన్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్న విషయాన్ని సీబీఐ అధికారులు గుర్తు చేశారు. హత్యాచార ఘటన జరిగిన సమయంలో మెడికల్ కాలేజీ సెమినార్ హాలులోనే సంజయ్ ఉన్నట్లు కాల్ డేటా రికార్డ్ (సీడీఆర్), ఫోన్ లొకేషన్ సమాచారం ఆధారంగా ధ్రువీకరించామన్నారు.


Similar News