ఈ ఫలితాలు ఊహించలేదు..: రాహుల్ గాంధీ ఫస్ట్ రియాక్షన్
హర్యానా అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు, ఎంపీ రాహుల్ గాంధీ తొలిసారిగా రియాక్ట్ అయ్యారు. హర్యానాలో తాము ఊహించినదానికి ఫలితాలు భిన్నంగా వచ్చాయని, ఆ ఫలితాలను విశ్లేషిస్తున్నామని వివరించారు.
దిశ, నేషనల్ బ్యూరో: హర్యానా అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు, ఎంపీ రాహుల్ గాంధీ తొలిసారిగా రియాక్ట్ అయ్యారు. హర్యానాలో తాము ఊహించినదానికి ఫలితాలు భిన్నంగా వచ్చాయని, ఆ ఫలితాలను విశ్లేషిస్తున్నామని వివరించారు. అనేక అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి తమకు వచ్చిన ఫిర్యాదులను ఎన్నికల సంఘానికి అందిస్తామని తెలిపారు. ఫలితాలపై రాహుల్ గాంధీ ట్విట్టర్ వేదికగా తొలి స్పందన తెలియజేశారు.
‘జమ్ము కశ్మీర్ ప్రజలకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇక్కడ ఇండియా కూటమి సాధించిన విజయం.. రాజ్యాంగం, ప్రజాస్వామ్య ఆత్మగౌరవానికి దక్కిన విజయం’ అని రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు. హర్యానా అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు తమ అంచనాలకు భిన్నంగా ఉన్నాయని, ఆ ఫలితాలను తాము విశ్లేషించుకుంటున్నామని వివరించారు. పలు అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి వస్తున్న ఫిర్యాదుల గురించి ఈసీకి తెలియజేస్తామన్నారు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, హర్యానా ఓటర్లకు ధన్యవాదాలు తెలిపారు. హర్యానా ప్రజల హక్కులు, సామాజిక, ఆర్థిక న్యాయం కోసం జరిగే పోరాటం ఇకపైనా కొనసాగుతూనే ఉంటుందని, హర్యానా ప్రజల గొంతుకగా ఇకపైనా కాంగ్రెస్ ఉంటుందని వివరించారు.
హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి మెజార్టీ సీట్లు దక్కుతాయని అందరూ అనుకున్నారు. ఎగ్జిట్ పోల్స్ కూడా ఇలాంటి అంచనాలనే వెల్లడించాయి. కానీ, వాస్తవ ఫలితాలు మాత్రం ఇందుకు భిన్నంగా కాంగ్రెస్ పార్టీ మెజార్టీ సీట్లకు ఆమడదూరంలోనే నిలిచింది. బీజేపీ 48 సీట్లు గెలుచుకుంటే కాంగ్రెస్ 37 సీట్లు గెలుచుకుని ప్రతిపక్షానికి పరిమితం కానుంది. ఈ ఫలితాల నేపథ్యంలోనే కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయనున్నట్టు పేర్కొంది. ఈ ఫలితాలను తాము అంగీకరించబోమని, క్షేత్రస్థాయిలో పరిస్థితులకు భిన్నమైన ఫలితాలు వచ్చాయని కాంగ్రెస్ జనరల్ సెక్రెటరీ ,జైరాం రమేశ్ పేర్కొన్నారు.