EPFO : ఈపీఎఫ్ఓ ఆడిట్ ఆఫీసర్‌ అరెస్ట్.. లంచం పుచ్చుకుంటుండగా పట్టుకున్న సీబీఐ

దిశ, నేషనల్ బ్యూరో : ఉద్యోగుల పెన్షన్ డబ్బులు అనగానే మనకు గుర్తుకొచ్చేది ‘ఈపీఎఫ్‌ఓ’.

Update: 2024-10-09 19:35 GMT

దిశ, నేషనల్ బ్యూరో : ఉద్యోగుల పెన్షన్ డబ్బులు అనగానే మనకు గుర్తుకొచ్చేది ‘ఈపీఎఫ్‌ఓ’. మహారాష్ట్రలోని జల్గావ్‌లో ఉన్న ఈపీఎఫ్‌ఓ ఆఫీసు రీజియల్ హెడ్ నుంచి ఒక కంపెనీకి 2024 జులై 31న ఒక ఈమెయిల్ అందింది. ‘‘మీరు 2023 మార్చిలో ఉద్యోగులకు చెల్లించాల్సిన దాదాపు రూ.2 లక్షల పీఎఫ్ అమౌంటును పే చేయకుండా డీఫాల్డ్ అయ్యారు. ఈ అంశంపై దర్యాప్తునకు ఆడిట్ ఆఫీసర్‌ను నియమిస్తాం. ఆయనే తదుపరి విచారణ నిర్వహిస్తారు’’ అని ఈమెయిల్‌లో ప్రస్తావించారు. చివరకు ఆడిట్ ఆఫీసర్ సదరు కంపెనీ వద్దకు చేరుకొని దర్యాప్తు మొదలుపెట్టాడు.

విచారణ ప్రక్రియ ముగిసిన అనంతరం ఆడిట్ ఆఫీసర్ నేరుగా కంపెనీ నిర్వాహకుల్లో ఒకరికి కాల్ చేసి రూ.50వేల లంచం అడిగాడు. లంచం డబ్బులిస్తే లెక్కలన్నీ చెప్పిన ప్రకారం సవరిస్తానని హామీ ఇచ్చాడు. అయితే కంపెనీ నిర్వాహకుడు బేరమాడాడు. చివరకు రూ.25వేల డబ్బును పుచ్చుకొని కంపెనీ ట్రాక్ రికార్డులో సవరణలు చేసేందుకు ఆడిట్ ఆఫీసర్ ఒప్పుకున్నాడు. ఎక్కడ.. ఏ టైంలో రూ.25వేలు ఇవ్వబోతున్నారనే దానిపై సదరు వ్యక్తులు సీబీఐకి సమాచారాన్ని అందించారు. అనంతరం లంచం పుచ్చుకుంటున్న ఆడిట్ ఆఫీసరును సీబీఐ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఆ వెంటనే ఆడిట్ ఆఫీసర్‌కు సంబంధించిన ఆఫీసు అడ్రస్ (జల్గావ్), ఇంటి అడ్రస్ (నాసిక్)లను సీబీఐ బుధవారం జల్లెడ పట్టింది. కొన్ని కీలక డాక్యుమెంట్లను అక్కడ స్వాధీనం చేసుకుంది.


Similar News