మైమరపించే మాటలతో
మాయలో పడేసే కాలమొచ్చింది
కనివిని ఎరుగని సందేశాలతో
బురిడీ కొట్టించే తీరు తిష్ట వేసింది
ముసుగుతన్ని మేలుకుంటే తప్ప
ఎత్తుగడలతో మత్తు గొలిపి
కాసులు కాజేసే ఇంద్రజాలం నుంచి
తప్పించుకోలేము తప్పుకోలేము
జర భద్రం సుమీ
లింకులన్నీ గొలుసు లెక్కన
ఆర్థిక మెడకు చుట్టుకుంటాయి
తెరిచి చూసిన తక్షణమే
జేబును గుల్ల చేస్తాయి
ఖాతాను ఖాళీ చేసి తప్పుకుంటాయి
సైబర్ నేరాల వలలో ఇరుక్కున్నాక
సాగిలపడి సర్దుకోవాల్సిందే
తల వంచి ఊకొట్టి ఉండాల్సిందే
తీపి మాటల పొంగులతో
రంగుల్ని వెదజల్లుతాయి
ఆశ కలిగించే ఊసరవేళ్ళి చేష్టలు
ముగ్గులోకి దింపి ముంచేస్తాయి
కొత్త కొత్త అంకెలతో ఫోను కలిపి
లేనిపోనివి కలియబెడుతాయి
నిలువునా తల ఊపిన తక్షణమే
లటుక్కున కరెన్సీ లాగేస్తాయి
జర భద్రం సుమండీ
ఓటీపీ లను ఒక్క ఉదుటున రాబట్టి
సొమ్మంతా కొల్లగొట్టేస్తాయి
హంగులు అద్దిన బొమ్మను చూపి
చాప కింద నీరులా చేరిపోయి
సమస్తొన్ని దోచేసి దొబ్బేస్తాయి
లింకుల కొక్కెంకు తగులుకున్నాక
విడిపించుకోవడం సులభం కాదు సుమీ
ఏది పడితే అది నొక్కి
సైబర్ కన్నుల్లో పడిపోకండి
మెదడుకు పదును పెట్టుకుంటూనే
ఫోను కదలికలను గమనించండి
జర భద్రంగా వుండండ్రీ
- నరెద్దుల రాజారెడ్డి
96660 16636