తుంబురు తీర్థం.. ట్రెక్ అనుభవాలు-1
తిరుమల తుంబురు తీర్థం ట్రెక్కింగ్ విశేషాల ప్రత్యేక వ్యాసం
దిశ, వెబ్ డెస్క్ : ప్రయాణం ... కదలిక.... ఇవి ఉంటేనే జీవితం.... లేదంటే జీవచ్చవం. జీవితమే ఒక ప్రయాణం. టూరిస్ట్, ట్రావెలర్, ట్రైక్కర్ ఈమూడు పదాలు స్థూలంగా ప్రయాణాన్నే సూచిస్తాయి. ట్రెక్కింగ్. ఒక రకంగా చెప్పాలంటే ఇది సాహసయాత్ర. కొండలు ఎక్కడం, దిగడం, వాగూ వంకలను దాటడం, అడవుల్లో సంచరించడం, ప్రకృతిలో సేదదీరడం. ఇది చాలా వరకు అత్యంత ఆసక్తి కలిగిన వాళ్ళు (యువకులు) ఎంచుకునే ప్రయాణంగా చెప్పుకోవాలి. ట్రెక్కింగ్ అంటే రాఘవగారి మాటలలో చెప్పాలంటే... "పరుగులెత్తడం కాదు, అడవి తల్లిని హత్తుకోవడం. జంతు జాలాన్ని ప్రేమించడం. జీవ వైవిధ్యాన్ని కాపాడడం. సమిష్టి తత్వాన్ని, సామాజిక బాధ్యతను అలవర్చుకోవడం. క్రీడా స్ఫూర్తి లాగానే ట్రెక్కింగ్ స్ఫూర్తిని అలవర్చుకోవాలి. "
ట్రెక్కింగ్.. అడవిని, జంతుజాలాన్ని ప్రేమించడం
ప్రయాణంలోని స్థాయి భేదాలను నిర్వచించడానికి ఈ పదాల మధ్య ఉన్న అంతతరాన్ని చెప్పుకుందాం. టూరిస్ట్ అనే పదానికి యాత్రికుడు అని అర్ధం చెప్పుకుంటే.... తీర్థయాత్రలకు వెళ్ళడం అనాదిగా మన సంస్కృతిలో ఉన్నదే... మన దేశంలో ఆధ్యాత్మిక ప్రదేశాలు చాలా వరకు ప్రకృతిలో భాగంగానే ఉన్నాయి. చార్ ధాం, ముక్తినాథ్ లాంటి ప్రదేశాలను ఉదాహరణలుగా చెప్పుకోవచ్చు. ఇలాంటి ప్రదేశాలకు వెళ్ళినప్పుడు ముందుగానే అన్ని ఏర్పాట్లు చేసుకుని వెళ్ళడం పరిపాటి. రెండోది ట్రావెలర్ ... వివిధ ప్రదేశాలలోని చారిత్రాత్మక ప్రదేశాలు, ఇతరత్రా పేరెన్నికగన్న ప్రదేశాలకు వెళ్ళడం. ముందుగానే ఆయా ప్రదేశాల గురించి తెలుసుకొని, అన్ని ఏర్పాట్లు చేసుకొని ప్రయాణించడం అని చెప్పుకోవచ్చు. మూడోది ట్రెక్కింగ్. ఒక రకంగా చెప్పాలంటే ఇది సాహసయాత్ర. కొండలు ఎక్కడం, దిగడం, వాగూ వంకలను దాటడం, అడవుల్లో సంచరించడం, ప్రకృతిలో సేదదీరడం. ఇది చాలా వరకు అత్యంత ఆసక్తి కలిగిన వాళ్ళు ( యువకులు ) ఎంచుకునే ప్రయాణంగా చెప్పుకోవాలి. ట్రెక్కింగ్ అంటే రాఘవగారి మాటలలో చెప్పాలంటే... "పరుగులెత్తడం కాదు, అడవి తల్లిని హత్తుకోవడం. జంతు జాలాన్ని ప్రేమించడం. జీవ వైవిధ్యాన్ని కాపాడడం. సమిష్టి తత్వాన్ని, సామాజిక బాధ్యతను అలవర్చుకోవడం. క్రీడా స్ఫూర్తి లాగానే ట్రెక్కింగ్ స్ఫూర్తిని అలవర్చుకోవాలి. "
వృద్ధులు, మహిళలు ట్రెక్కింగ్ చేయకూడదా?
ఉద్యోగ బాధ్యతలు, కుటుంబ బాధ్యతలు తీరిపోయాక అంటే అరవై యేళ్ళు దాటాక, అప్పటి ఆరోగ్య స్థితిని బట్టి, ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా అన్నిఏర్పాట్లతో అప్పుడప్పుడు ఆసక్తిని బట్టి ప్రయాణాలు చేయాలి. అంతేగాని వృద్ధులు, మహిళలు ట్రెక్కింగ్ లాంటి సాహస ప్రయాణాలు చేయకూడదు అనేది మన సమాజంలో ఉన్న ఒక నమ్మకం. అందులోనూ వయసు పైబడిన మహిళలు అసలే చేయకూడదు. ఈ వయసులో ఇలాంటి సాహసాలు అవసరమా? అనే అభిప్రాయం ప్రత్యేకించి మన సమాజంలో ఉన్నది. అసలు ట్రెక్కింగ్ రంగంలో ఉన్న మహిళలే తక్కువ. అందులోను అరవై ఏళ్ళ మహిళలు మరీ తక్కువ. ఈ ట్రెక్ లో కూడా అరవై ఏళ్ళు పై పడిన వాళ్ళం ఇద్దరమే ఉన్నాము. నేను, కాంతి. యాభై యేళ్ళ వాళ్ళు ముగ్గురు ఉన్నారు. 30 ఏళ్ళ లోపు యువతులు సుమారు పది మంది ఉంటారు.ఈ రంగంలో మహిళలు తక్కువగా ఉండడానికి అనేక కారణాలు ఉన్నాయి. వాటిని నేను ఇక్కడ ప్రస్తావించ దలచుకోలేదు.
అండమాన్ నుంచి తుంబుర తీర్థం దాకా
అనుకోకుండా వచ్చిన అవకాశం తుంబుర తీర్థం ట్రెక్కింగ్. ముందుగా గుంటూరు ట్రెక్కింగ్ కింగ్స్ ఇచ్చిన సమాచారం మేరకు వెళ్ళలేనని కొంత ఆలోచనలో పడ్డాను. కారణం అప్పటికే నాకు అండమాన్ ప్రయాణానికి ఏర్పాట్లు జరిగిపోయాయి. మధ్యలో రెండు రోజులే ఉంది. కానీ తిరుపతి ట్రెక్కింగ్ క్లబ్ నుంచి మరో సమాచారం వచ్చింది. తుంబుర తీర్థం ట్రెక్ ఉంది. వస్తారా? అంటూ... అంతే శేషాచలం అడవులను అణువణువూ అన్వేషించాలని అంతర్లీనంగా నాలో ఉన్న కోరిక ఉవ్వెత్తున ఎగిసి పడింది. కానీ అండమాన్ నుంచి హైదరాబాద్ వచ్చి, వెంటనే మళ్ళీ తిరుపతి వెళ్ళడం కష్టం. ట్రెక్కింగ్ పట్ల నాకున్న ఆసక్తి హైదరాబాద్ టికెట్ కేన్సిల్ చేసుకొని చెన్నైకి తిరుగు ప్రయాణపు టికెట్ బుక్ చేసుకునేలా చేసింది. అండమాన్ నుంచి చెన్నై, అక్కడి నుంచి తిరుపతి చేరాను.
బీభత్సమైన వర్షం వెలిశాక...
తుఫాన్ వల్ల గత నాలుగైదు రోజులుగా చెన్నైలో, తిరుపతిలో బీభత్సమైన వర్షాలు కురుస్తున్నాయి. కానీ నెమ్మదిగా వర్షాలు తగ్గుముఖం పట్టి మేము వెళ్ళేరోజుకు పూర్తిగా తగ్గిపోయాయి. ఈ సందర్భంలో సాహితీ మిత్రులు రాఘవ శర్మ గారు ఇచ్చిన ఆతిథ్యం మరువలేనిది. ముందురోజు రాత్రే మరో సాహితీ మిత్రురాలు కాంతి ఒంగోలు నుంచి తిరుపతికి వచ్చింది. రాఘవశర్మ గారి సోదరి గాయత్రి గారు ముందురోజు రాత్రే మా ట్రెక్ కు కావలిసిన ఆహార పదార్థాలు అన్నీ సిద్ధం చేసారు. బస్ స్టాండ్‌కు వెళ్ళడానికి ఆటోను కూడా ఏర్పాటు చేసారు. ఆమె మా పట్ల చూపిన శ్రద్ధ కూడా మరువలేనిది.
ఆరంభం నుంచి నీళ్లలోనే ట్రెక్కింగ్
ఉదయం నాలుగు గంటలకే లేచి రెడీ అయి బయలు దేరాము. మామండూరు కుక్కల దొడ్డి మధ్యలో TTC సభ్యులు కొందరు మా కొరకు ఎదురు చూస్తున్నారు. ముందుగా వేసుకున్న ప్రణాళిక ప్రకారం మేము నలుగురైదుగురు బండి ఇరుసు దాకా జీపులో వెళ్ళాలి. కానీ రైల్వే ట్రాక్ కింద ఉన్న నీళ్ల లోతును TTC సభ్యులు కర్రసాయంతో అంచనా వేసారు. అక్కడి వరకు వాహనాలు వెళ్ళే పరిస్థితి లేదు. అందుకని ఎవరి ఆహార పొట్లాలను వాళ్ళకు అప్పజెప్పారు. మేము ముందుగా కొందరం రైల్వే ట్రాక్ ఎక్కి అటువైపు దిగాము. అక్కడి నుంచి కొంత దూరం వరకు అలా నీళ్ళలోనే ట్రెక్ మొదలైంది. అన్నమయ్య బాట వరకూ వెళ్ళి విశ్రాంతి కొరకు కాసేపు ఆగాము. ఎవరికి వాళ్ళు వచ్చినట్లుగా ట్రెక్‌లో జాయిన్ అయ్యారు.
పలకరించిన పక్షులు, తాబేళ్లు
పచ్చని చెట్లు, మంచుతెరలు విడిపోతున్న తొలి పొద్దు వేళ, నులివెచ్చని సూర్యకాంతిలో చలి కాచుకోవడానికి మెల్లిగా తమ నెలవుల్లోనుంచి కొన్ని జీవరాశులు బయటకు వస్తున్నాయి. అందులో భాగంగా బుజ్జి తాబేలు ఒకటి మా దారిలో కనిపించింది. దానిని కెమెరాలో బంధించి ముందుకు సాగాము. ఇంతలో సీతాకోకచిలుకల గుంపు ఒకటి మాకు హాయ్ చెపుతూ స్వేచ్చగా ఎగిరి పోయింది. ఏనుగులు మేమున్నామంటూ ఆనవాళ్ళుగా విడిచిన పెంటను గమనిస్తూ ముందుకు పోయాము. ఇంతలో నేను ఉన్నానంటూ వాగు ఒకటి దారికి అడ్డంగా వచ్చింది. ఉత్సాహంగా ఒకరి చేతులు ఒకరు పట్టుకొని వాగు దాటి ముందుకు వెళ్ళాము. ఎవరి ఆకలిని బట్టి వాళ్ళు లంచ్ చేస్తూ పోయారు. గులక రాళ్ళలో కాసేపు, మట్టి దారిలో మరికొంత సేపు నడుస్తుండగానే మళ్ళీ ప్రవాహం. తిన్నని దారి లేకపోవడం వల్ల ఒకే ప్రవాహాన్ని పలు మార్లు దాటవలసి వచ్చింది. ఒకే ప్రవాహంలో ఒకచోట మోకాళ్ళ లోతు నీళ్ళుంటే మరోచోట నడుం లోతు నీళ్ళున్నాయి. రెండు మూడు చోట్ల ప్రవాహం కొట్టుక పోయేంత ఉద్ధృతంగా ఉంది.
అసలే అడవి.. అందులో శీతాకాలం
విరిగిపడిన పొడుగాటి చెట్టుకాండాన్ని ప్రవాహానికి అడ్డుగా పెట్టి కొందరు యువకులు నిలుచుని ఉంటే మేము దానిని పట్టు కొని అవతలి ఒడ్డుకు చేరు కున్నాము. నీళ్ళంటే ఎంతో మక్కువ ఉన్న నాకూ భయం వేసింది. అలా సుమారు ఇరవై ముప్పై సార్లు ప్రవాహాన్ని దాటవలసి వచ్చింది. బ్యాగులు తడిసి మరింత బరువెక్కాయి. మా బరువులు మేమే మోయలేక పోతున్నాము. అలాంటిది ఒక కర్రను కావడిలా కట్టి అందరి కొరకు వంట సామాను తీసుకొస్తున్నారు ఆర్య లాంటి యువకులు. గణేశ్ లాంటి మరికొందరు నలువైపులా నాలుగు బ్యాగులు తగిలించుకుని నడుస్తున్నారు. ఇంకొందరు మరికొందరికి ప్రవాహాలు దాటించడానికి ఊతమిస్తున్నారు. మొదలే అడవి. అందులోనూ శీతాకాలం. నాలుగున్నరకే చీకటి పడుతోంది. దారి కనిపించడం లేదు. నాకు నీళ్ళలో తడిసిన బూట్ల వలన కాళ్ళు స్పర్శ కోల్పోతున్నాయి. ప్రవాహాలు దాటివలసిన అవసరం లేదు అన్నారు. కానీ ఫర్లాంగ్ రెండు ఫర్లాంగులకు ఒకసారి దాటవలసే వచ్చింది. కాళ్ళకు ఏవేవో తీగలు అడ్డుపడుతున్నాయి. ఒక యువకుడు తన సెల్ఫోన్ టార్చ్ లైట్ వెలుగుతో నాకు తోడుగా నడిచాడు. GTK బృందంలోని అఖిల్ ఆత్మవిశ్వాసం కోల్పోకుండా ఉత్సాహపరిచాడు.
ఎంత ఆనందమో అంత భయం
ప్రకృతి ఎంత ఆనందాన్ని ఇస్తుందో అంతగా భయపెడుతుందనే విషయం మొదటిసారిగా అనుభవంలోకి వచ్చింది. అన్నట్టు ప్రకృతిని తప్పు పట్టవలసిన పని లేదు. అంతకు ముందు కురిసిన వర్షాలకు ఆ ప్రవాహాన్ని అంచనా వేసి ఉంటే బాగుండేది. ఎనిమిది కిలోమీటర్ల ట్రెక్ పదహారు కిలోమీటర్లుగా నమోదైంది. ఉదయం ఏడు గంటలకు మొదలైన ట్రెక్ సాయంత్రం ఆరున్నర గంటలకు ముగిసింది. అంటే దాదాపు పది గంటలు సాగింది. హమ్మయ్య! గమ్యస్థానం చేరుకున్నాం. కొందరు ముందరే వచ్చి వెంగమాంబ గుహ దగ్గర గుడారాలు వేసారు. మరో వైపు వంటకు ఏర్పాట్లు చేసారు. మహిళలను మాత్రం టెంట్లలోకి వెళ్లిపొమ్మని చెప్పారు. అంతే టెంట్లోకి దూరి పోయాను. కాంతి ఏమీ తినకుండానే నిద్రపోయింది. "అమ్మా! ఒళ్ళు నొప్పులున్నాయా? కాళ్ళతిమ్మిరి తగ్గిందా? ఏమైనా హెల్ప్ కావాలా?" గణేశ్ అడిగాడు. అంతసేపు నీళ్ళలో తడిసి ఉండడం వల్ల కాబోలు చాలా నీరసంగా ఉంది. ఒక అబ్బాయి వేడి అన్నంలో సాంబారు వేసి నాకు టెంట్ లోకి తెచ్చి ఇచ్చాడు. తినేసి ముసుగు తన్నాను. " జ్వరం, ఒళ్ళు నొప్పులు, దగ్గు, జలుబు, మోషన్స్ కు టాబ్లెట్స్ ఉన్నాయి. ఎవరికైనా కావాలంటే తీసుకోండి."గట్టిగా చెపుతున్నాడు TTC సభ్యుడు అనుకుంటా..." మరొకరు కార్తీక్ రాలేదు. తప్పి పోయాడా? " అని విచారిస్తున్నారు. "నా కెమెరా బ్యాగ్ కనిపించడం లేదు ఎవరైనా చూశారా?" " క్యాంప్ ఫైర్ చేద్దామా?" అంటున్నారు ఇంకెవరో..." నా చెప్పులు ప్రవాహంలో కొట్టుకు పోయాయి." ఒక మహిళ గొంతు.
కురిసింది వర్షం కాదు.. మంచు
అన్నీ వింటూ నిద్రలోకి జారిపోయాను. మధ్య రాత్రి .... మెలుకువ వచ్చింది...ఏవో చప్పుళ్ళు వినిపిస్తున్నాయి. వర్షమా? మంచుబిందువుల సవ్వడా? పక్కనే ఉన్న సిలయేటి గలగలలా? ఏమో! మగత నిద్రలో ఏదీ స్పష్టంగా తెలియడం లేదు. ఎప్పటిలాగే ఉదయం ఆరుగంటలకే మెలకువ వచ్చింది. ఇంకా చీకటిగా ఉంది. గణేశ్ హెడ్ లైట్ పెట్టుకొని చూసాను. టెంట్ పైన ఉన్న మంచును చూస్తే తెలిసింది. రాత్రి కురిసింది వర్షం కాదు, మంచు అని. పక్కనే సవ్వడి చేస్తున్న సెలయేటి దగ్గరకు వెళ్ళాను. ప్రశాంత మైన వాతావరణం, ఎటు చూసినా పచ్చని చెట్లు, కొండలు, గుహలు, కోతులు, పక్షుల కిల కిలారావాలు. రాత్రి భయం మచ్చుకైనా లేదు. పైపెచ్చు రెట్టింపు ఉత్సాహం. అప్పటికే కొందరు మిత్రులు అక్కడ ఫోటోలు తీసుకున్నారు. కొందరు "దగ్గరలో ఉన్న జలపాతం దగ్గరకు వెళుతున్నాం వస్తారా?" అని అడిగారు. గోవా మాన్సూన్ ట్రెక్ లో రోజుకు నాలుగైదు జలపాతాలలో ఆడుకున్న అనుభవం గుర్తుకు పచ్చి రానని చెప్పాను. కాంతి వాళ్ళతో వెళ్ళింది. పక్కనే గుహ దగ్గరికి వెళ్ళాను. అక్కడే ఉన్న బాలాజీ గారు టార్చ్ నాకిస్తూ "ఎక్కువ దూరం వెళ్ళకండి" అని హెచ్చరించాడు. దగ్గరగా వెళ్ళి లైటు వేసి చూసాను. కూర్చొని గాని, వంగి గాని వెళ్ళాల్సినంత ఎత్తులో ఉంది. నేను ఒక్కదాన్నే లోపలికి వెళ్ళే సాహసం చేయలేక పోయాను. ఒకరిద్దరిని అడిగాను కానీ వాళ్ళు ఆసక్తి చూపించలేదు.
(రెండో భాగం తదుపరి పోస్టింగులో)
గిరిజ పైడిమర్రి
ట్రెక్కర్
99494 43414