తుంబురు తీర్థం.. ట్రెక్ అనుభవాలు -2
తిరుమల తుంబురు తీర్థం ట్రెక్కింగ్ విశేషాల ప్రత్యేక వ్యాసం
దిశ, వెబ్ డెస్క్ : ట్రెక్కింగులో సాహస బాలుడు
ఈ గుహ 2,3 కిలోమీటర్లు ఉంటుందట. దారి తిరుమల ఆలయానికి వెళుతుందట. వెంగమాంబ ఈ దారిలోనే వెళ్లి వెంకటేశ్వర స్వామిని కలిసేదనే కథ ఒకటి ప్రచారంలో ఉంది. అక్కడ ఒక స్వామి ఫోటో ఉంది. ఆ స్వామి అక్కడే ఉండేవాడట. 300 రూపాయల కొరకు కొందరు దుండగులు అతనిని హత్య చేసారని తెలిసి బాధ పడ్డాను. పక్కనే మరో గుహ ఉంది. మా బృందంలోని కొందరు మిత్రులు రాత్రి ఆ గుహలోనే పడుతున్నారట. అది ఒక మనిషి నిలబడి వెళ్ళగలిగే ఎత్తులో ఉంది. వాళ్ళు కొంత దూరం వెళ్ళి గబ్బిలాల కంపు భరించలేక తిరిగి వచ్చామని చెప్పడం వల్ల నేనూ లోపలికి పోలేదు. టెంట్స్ పక్కనే టిఫిన్ తయారు చేస్తున్నారు. లంచ్ బాక్సులు ఎవరిది వాళ్ళకు ప్యాక్ చేసుకొని అల్పాహారం ముగించాము. గుహలలోనుంచి బయటకు వచ్చేసరికి ఏడేళ్ళ బాబు ఉత్సాహంగా నన్ను చూసి "మీరు లోపలికి వెళ్లారా" అని అడిగాడు. ఇంతలో వాళ్ళ నాన్న GTK సభ్యుడు పుల్లారావు గారు అక్కడికి వచ్చి "మా బాబు మేడం. పేరు హర్ష" అని చెప్పాడు. వాడికి ఏడేళ్ళు. రెండో తరగతి చదువుతున్నాడు. పిల్లలకు చిన్నప్పటి నుంచే ట్రిక్స్ అలవాటు చేయడం మంచి పరిణామం. మా బృందంలో ఏడేళ్ల( ఏడేళ్ళ హర్ష నుంచి డెబ్బై యేళ్ళ రాఘవశర్మ గారు) వయసు నుంచి డెబ్బై యేళ్ళ వయసు వాళ్ళు పాల్గొన్నారన్నమాట.
కొండల జలధారలే మినరల్ వాటర్
మేమున్న స్థలానికి తుంబుర తీర్థం అరకిలోమీటరు దూరం. మాలో కొందరు వెళ్ళి లోపలికి వీళ్ళేలేక తిరిగి వచ్చారు. ప్రవాహం ఉద్ధృతంగా ఉండడం వల్ల లోపలికి వెళ్ళే దారికి అడ్డంగా మెష్ వేసారట. గజ ఈతగాళ్లు కూడా లోపలికి వెళ్ళలేని పరిస్థితి. వచ్చిన దారిన వెళితే తిరుగు ప్రయాణానికి రిజర్వేషన్ ఉన్నవాళ్ళకు ఆలస్యం అవుతుందనే ఉద్దేశ్యంతో అటవీ అధికారుల అనుమతితో కపిలతీర్థం దారిలో వెళ్ళే ఏర్పాటు చేశారు. అలా 28 మంది బృందం 11 గంటలకు తిరుమలకు తిరుగు ప్రయాణం అయ్యాము. రెండు వేర్వేరు దారులలో ట్రిక్ చేయడం నాకు ఉత్సాహంగా ఉంది. ఆ దారిలో మధ్యలో నీళ్ళు ఎక్కడా దొరకవంటే కొండలపైనుంచి వస్తున్న జలధారలతో మా బాటిల్స్ నింపుకొని నడక మొదలు పెట్టాము. ఐదు కిలోమీటర్ల నడక. కొండ ఎక్కవలసి ఉంటుంది. నాకు వర్టిగో సమస్య ఉన్నందువల్ల వర్టిన్ టాబ్లెట్ చేసుకుందామని చూసేసరికి అది ముందురోజు నీళ్ళలో తడిసి పనికిరాకుండా పోయింది. చేసేదేమీ లేక మనోధైర్యంతో ముందుకు సాగాను. చిన్నపాటి రెండు ప్రవాహాలు దాటి కొండ ఎక్కడం మొదలు పెట్టాము. కొంత దూరం వెళ్ళేసరికి ఒక వైపు లోయ, చిన్న దారిలో కొండ అంచున నడుస్తున్నాము. నాకు కొంచం ఇబ్బంది అనిపించి ఒక క్షణం ఆగాను. వెంటనే తోటి ట్రెక్కర్లు పరామర్శించారు. నాకున్న ఇబ్బందిని చెప్పాను. అంతే గుంటూరు నుంచి వచ్చిన హేమంత్ అనే అబ్బాయి నా బ్యాగు తీసుకొని నాకు తోడుగా నడిచాడు. మధ్యలో ORS లాంటి పాకెట్, ఖర్జూరాలు ఇచ్చారు. కొంత దూరం వెళ్ళాక నాకు కుదుట పడింది.
సాహస వృద్ధుడు... తీర్థాల పరిచయం
ముందురోజు ప్రవాహాలు దాటే ఒత్తిడిలో ఎవరూ సరిగా కబుర్లు చెప్పుకోలేదు. కానీ మరుసటి రోజు కబుర్లు చెప్పుకుంటూ, జోక్స్ వేసుకుంటూ, కొండ కోనలను పరిశీలిస్తూ, ప్రకృతి అందాలను తిలకిస్తూ ట్రెక్ సాగింది. మధ్య మధ్యలో రాఘవశర్మ గారు ఏదారి ఏ తీర్థానికి వెళుతుందో వివరించారు. శేషాచలం కొండకోనలు ఆయనకు కొట్టిన పిండి. డెబ్బైయేళ్ళ వయసులో ఆయనకు ఉన్న ఉత్సాహం మాకు స్ఫూర్తినిచ్చింది. దాదాపు దారంతా సహజ ఎరుపురంగు గ్రానైట్ రాళ్ళతో ఉంది. ఆ దారిలో కూడా ఏనుగుల ఆనవాళ్ళు కనిపించాయి. శేషాచలం అడవులు ఎర్రచందనం చెట్లకు ప్రసిద్ధి. కానీ మూడొంతులు మాయమయ్యాయి. ఒక వంతు మాత్రమే అక్కడక్కడ మిగిలిన ఎర్రచందనం చెట్లను చూసి బాధ పడ్డాను. అటవీ సంపదను కొల్లగొట్టడంపై మా చర్చ సాగింది. మధ్యలో ఒక చోట ఆగి వెంట తెచ్చుకున్న ఆహారంతో భోజనాలు ముగించాము. తరువాత చలువరాళ్ళ బండలు దాటి కపిల తీర్థం డ్యాం చేరుకున్నాము. యాత్రికులకు దాని మీదకు ప్రవేశం నిషిద్ధం. కానీ మాకు దాని మీద నడిచే అవకాశం దొరికింది. తిరుమలకు ఎన్నిసార్లు వెళ్ళినా ఆ అందాలను చూడలేదు. ఫాల్గుణ పౌర్ణమికి తుంబుర తీర్థానికి వెళ్ళే భక్తులకు ఒకప్పుడు చలువ రాతి బండల దగ్గరే అన్న పానాదులు ఏర్పా టు చేసేవారట. ప్రస్తుతం అటవీ సంరక్షణ బాధ్యతలో భాగంగా తిరుమలలోనే ఆ ఏర్పాట్లు చేస్తున్నారట.
ట్రెక్కింగ్ రంగంలోకి మహిళలు
తుంబుర తీర్థంలోకి వెళ్ళలేక పోయానన్న చిన్న నిరాశ తప్పించి ఆ ట్రెక్ నాకు అద్భుతమైన అనుభూతులను మిగిల్చింది. పది పన్నెండు గంటలపాటు ప్రవాహాలు దాటుతూ చీకటిలో, అడవిలో, చలిలో నడవడం ఆ సమయానికి కొంచం భయమనిపించినా తరువాత తలచుకుంటే ఉద్విగ్న పూరితమైన అనుభూతిని జీవితమంతా మిగిల్చింది. ఈ ట్రెక్‌లో చాలా మంది మహిళలు పాల్గొంటున్నారని తెలిసి వాళ్లందరినీ ఇంటర్వ్యూ చేసి మహిళా కోణంలో ఈ వ్యాసం రాయాలనుకున్నాను. కానీ ముందురోజు ట్రెక్ ఊహించని విధంగా సాగింది. మరుసటి రోజు కొద్దిమంది స్త్రీలు మాత్రమే మాతోపాటు వచ్చారు. అందుకని మహిళా కోణంలో ట్రెక్కింగ్ వ్యాసం రాయలేకపోతున్నాను. ఏది ఏమైనా ట్రెక్కింగ్ రంగంలోకి మహిళలు ఇప్పటికైనా రావడం ఆహ్వానించదగ్గ పరిణామం. అది చాలా ఆరోగ్యం, ఆనందదాయకం. అందులో మహిళలు ఎదుర్కొనే ఒత్తిడి నివారణకు ట్రెక్కింగ్ ప్రకృతి సహజమైన మందు.
(తుంబురు తీర్థం యాత్రా విశేషాలు ముగింపు వ్యాసం)
గిరిజ పైడిమర్రి
ట్రెక్కర్
99494 43414