ఎటు చూసినా శవాల దిబ్బలు.. కుప్ప కూలిన ఇళ్లలోంచి సాయానికై చేతులు చాస్తున్న సగం కాలిన దేహాలు.. శిథిలాల కింద తమ వారి జాడ కోసం వెతుక్కుంటున్న కన్నీటి ప్రవాహాలు’ అంటూ ప్రస్తుత పాలస్తీనా ముఖచిత్రాన్ని నిర్మల రాణి తోట చూపిస్తుంటే, ‘నేల రాలిన లేత నవ్వులను వెతుక్కుంటూ తల్లులు.. చెప్పకుండా మాయమైన ఆ తల్లులను వెతుక్కుంటూ పిల్లలు’ అంటూ అక్కడి నిస్సహాయతను జ్వలిత రాస్తుంటే హృదయం జ్వలించకుండా ఎలా ఉంటుంది!?
‘పాలస్తీనా-యుద్ధ వ్యతిరేక కవితలు’లో ఆ జాతి దైన్యం కళ్ల ముందు కదలాడుతుంది. ఒకటా రెండా... తెలుగు కవియిత్రులు రాసిన డెబ్భై నాలుగు కవితల్లో దేన్ని తాకినా కళ్లు చెమరుస్తాయి. అమెరికా, బ్రిటన్ పశ్చిమ దేశాల అండచూసుకుని తెంపరి తనంతో ఇజ్రాయిల్ పాలస్తీనా జాతిని సమూలంగా తుడిచిపెట్టాలని సాగిస్తున్న మారణహోమం. ఇజ్రాయిల్ ఆయుధాలకు అమ్ముడుపోయిన మన గోముఖ వ్యాఘ్రాల దుర్మార్గం వల్ల ఈ సంకలనంలోని చరణాలు కళ్లను నీటి పొరలతో కప్పేస్తాయ్. ఏడాది పైగా జరుగుతున్న ఈ మారణ హోమంలో ‘పాలస్తీనా ఇప్పుడో అమ్మానాన్నా లేని అనాథ! పిల్లలే లేని విషాద ఒంటరి వృద్ధ! ముఖాన్ని కోల్పోయిన దేహం! దేహాన్ని కోల్పోయిన ఆత్మ!’ అంటున్న గీతాంజలి సంపాదకత్వంలో ఈ కవితా సంకలనం వెలువడింది.
కవితలకు అనుబంధంగా బాలగోపాల్ రాసిన వ్యాసంలో ఇజ్రాయిల్ చరిత్రను అర్థం చేసుకోవచ్చు. యూదుల్లో మార్క్స్, ఐన్ స్టీన్ వంటి మహోన్నతులూ ఉన్నారు. క్రీస్తును శిలువ వేశారని ఒక అపవాదునూ యూదులు మోశారు. జర్మనీలో నాజీలు, ఇటలీలో ఫాసిస్టులు యూదులను ఊచకోత కోశారు. చావగా మిగిలిన వారిలో చాలా మంది బతుకు జీవుడా అంటూ పాలస్తీనా చేరుకున్నారు. యూదుల్లో పాత తరం వారు బాధితులు, మేధావులు, కష్ట జీవులు. వీరిలో కొత్త తరం బ్రిటన్‌కు అమ్ముడుపోయిన నమ్మిన బంట్లు. పాలస్తీనాలోనే కొంత భాగాన్ని ఆక్రమించి ఇజ్రాయిల్‌గా ప్రకటించుకున్నారు. యూదులను వారి మాతృ భూమి నుంచి తరిమివేయడం మొదలు పెట్టారు. యూదులకు ఆశ్రయం ఇచ్చి అక్కున చేర్చుకున్న పాపానికి పాలస్తీనాను ప్రపంచ చిత్రపటం నుంచి తుడిచేయాలని ఇజ్రాయిల్ యుద్దోన్మాదంతో ఊగిపోతోంది. ఈ నేపథ్యంలో ఈ కవితా సంకలనం వచ్చింది.
‘కలల్ని కాలాన్ని మింగేసిన యుద్ధమా ఆగిపో’ అని సి.హెచ్ ఉషారాణి శాసిస్తే, ‘పాలస్తీనా.. ఓటమిలోనైనా విజయాన్నే చూస్తున్నావు’ అని ఆత్మవిశ్వాసాన్ని కల్పిస్తారు కాంతి నల్లూరి. ‘నాకు ఆకలేసిందా, నన్ను దోచుకున్న వాడి మాంసం తింటా. జాగ్రత్త.. జాగ్రత్తరా..!’ అంటూ హెచ్చరిస్తారు కాత్యాయని. ‘హంతకులతో లెక్క తేల్చుకొనడానికి కవిత్వమే నాకున్న ఏకైక అవకాశం’ అంటారు కాత్యాయని విద్మహె. ‘ఇంటింటా ఒక అమరజీవి ఈ విధ్వంసానికి ప్రతిఘటనా స్ఫూర్తి’ అంటూ డాక్టర్ చెంగల్వ రామలక్ష్మి భరోసా ఇస్తారు. ‘మరెప్పటికీ మరలి రాని పిల్లల్ని పేరుపేరున బిగ్గరగా పిలుస్తూ, తెగిపడిన అవయవాలని గుండెలకు హత్తుకుని, అరుపుల్లాంటి ఏడుపులతో శవాల దిబ్బలో తిరుగాడుతుంటారు తల్లులు’ అంటూ అమ్మల హృదయ వేదనను ప్రతిమ వి ఆవిష్కరిస్తారు. ‘ఓ ప్రియమైన గాజా పిల్లల్లారా! దయచేసి ఆశను కోల్పోవద్దు. తుపాకీ కాల్పులు లేని రోజు వస్తుంది’ అన్న భరోసా ఇస్తారు మనోజ్ఞ ఎండ్లూరి. ‘నేనూ నా పిల్లలూ ఈ ఇంట్లోనే బతికి చచ్చిపోతాం పాలస్తీనా కోసం’ అంటూ గాజాలో హంజా గొంతు ఎలా మార్మొగిందో మమతా కొడిదెల వినిపిస్తారు.
‘యుద్ధం ఎంత నీచం! భుజబలాల తగువులాటల్లో ఊచకోతలు, దహనాలు మానవతా ఖననాలు హీనం’ అంటూ అనిశెట్టి రజిత ధర్మాగ్రహం వ్యక్తం చేస్తారు. ‘రక్తపు ముద్దకు ప్రాణం పోసి ఈ లోకంలోకి తెస్తారు అమ్మలు.. క్షణాల్లో ప్రాణం లేని రక్తపు ముద్దల్ని చేస్తాయి యుద్ధాలు’ అంటూ యుద్ధ వినాశనాన్ని నెల్లుట్ల రమాదేవి వివరిస్తారు. ‘అమ్మరొమ్ము అందించినా పాలు లేవుట. కొద్దిగా రొట్టెలు పంపించండి అమ్మ తింటే చెల్లి పాలు తాగుతుంది’ అని అక్కడ పాలందని పిల్లల, తిండిలేక పాలివ్వలేని తల్లుల దైన్యాన్ని రేణుక అయోల చూపిస్తారు. ‘గాజాలో పసిపాపల ఆక్రందనలకు శిలలు సముద్రాలవుతున్నాయ్. మరి కన్నీటికి విలువెంత?’ వసంత నెలుట్ల ప్రశ్న. ‘జీవించే హక్కును దోచేయడమే యుద్ధమా?’ ఇది డాక్టర్ సమ్మెట విజయ సంధించిన ప్రశ్న. ‘పాలస్తీనా ఆరని గాయాల నెత్తుటి నదిలా ప్రవహిస్తోందిప్పుడు’ అంటూ విమల చేసిన దృశ్య మానం. ఆ మారణ కాండ ‘రక్తపు మడుగులో హంతకుల ప్రతిబింబాల’ ను ఆవేదనతో చూపిస్తారు యు. హెచ్. వేదన.
‘ఆ అంధులకెవరైనా చెప్పండి కళ్లువిప్పి ప్రపంచాన్ని చూడమని. కత్తులు నాటిన నేలలో ప్రేమ మొక్కలు నాటమని’ ఇది సునీత గంగవరపు సూచన. ఈ బదిరులకు ఎక్కడ వినిపిస్తోంది? ‘గట్టిగా హత్తుకునేందుకు యుద్ధమేమీ ప్రియురాలి ఆలింగనం కాదు’ అంటూ వైష్ణవశ్రీ వ్యంగ్యోక్తి. ‘ముక్కలు ముక్కలైన మాంసపు ముద్దల్లో తన పేగు ముక్కలు కనిపిస్తాయేమోనని ఆ తల్లి వెతుకులాట’ ను చూపిస్తారు వి.శాంతి ప్రబోధ. ‘ఏ శాపం భుజాన వేసుకుని ఈ లోకానికి వచ్చాను. వస్తూనే పేలిన ఒక విస్పోటనం, చుట్టూ చుట్టేసిన ఓర్చుకోలేని బాధ’ ‘కాళ్లున్నా నడవలేని నేను, కాళ్లు తెగి నడవలేని నువ్వు’ తల్లితో అప్పుడే పుట్టిన శిశువు భావనలను స్వాతి శ్రీపాద వినిస్తారు.
పాలస్తీనాలో ఇప్పుడు ఇళ్లు ఎలా ఉన్నాయి? అని గీతాంజలి ప్రశ్న వేసి, ఆ భీబత్స దృశ్యాన్ని ఇలా చూపిస్తారు. ‘ఇల్లంటే మృత శిశువుకి ఎగిరొచ్చిన అమ్మ బురఖానో..చున్నీనో కఫన్ గా మారడం.’ ‘ఇల్లంటే రొట్టె ముక్క కోసం గుంపులో కలబడి చనిపోవడం.. ఇళ్లంటే వాళ్లకి తెగిపోయిన కాళ్లు చేతులు..కళ్లలో రక్త స్రావమవుతూ ఒళ్లంతా సూదులు గుచ్చబడే ఆసుపత్రులు.. ఇల్లంటే అమ్మానాన్నలు వాళ్ల పిల్లల శవాలు మోసుకునే జాగా’. ‘ఈ భూమ్మీద పుట్టిన పిండం కదా ప్రతిఘటించడానికి పుట్టింది’ ‘పడి లేవడం మా జీవన సారం’ అంటూ పాలస్తీనా ప్రజల పోరాటాన్ని తాత్వీకరిస్తారు పి. వరలక్ష్మి. ఇది యుద్ధం కాదు జాతి హత్యా కాండ.
పుస్తకం: పాలస్తీనా-యుద్ధ వ్యతిరేక కవితలు
సంపాదకురాలు : గీతాంజలి
పేజీలు: 270, వెల రూ.150
ప్రచురణ : వెన్నెల-గీత సాహిత్య సామాజిక అధ్యయన వేదిక
ప్రతులకు : డాక్టర్ భారతి (గీతాంజలి), 8897791964
పరిచయస్తులు
రాఘవ
94932 26180