రాజకీయ నేతలకు పెద్ద బాల‌శిక్ష‌

ప్ర‌తి పురుషుని విజ‌యం వెనుక ఒక మ‌హిళ ఉంటుంద‌నేది నానుడి.... కానీ ఆ మ‌హిళ విజ‌యాల వెనుక మాత్రం ఇద్ద‌రు పురుషులున్నారు..

Update: 2025-01-06 00:45 GMT

ప్ర‌తి పురుషుని విజ‌యం వెనుక ఒక మ‌హిళ ఉంటుంద‌నేది నానుడి.... కానీ ఆ మ‌హిళ విజ‌యాల వెనుక మాత్రం ఇద్ద‌రు పురుషులున్నారు.. ఒక‌రు ఆమెను వేలు ప‌ట్టి న‌డిపించిన నాన్న‌యితే.. మ‌రొక‌రు ఆమెకు అన్ని వేళ‌లా వెన్నుద‌న్నుగా నిలిచిన ఆమె భ‌ర్త‌.... ఆ ఇద్ద‌రు తోడ్పాటును మించి ఆమెలోని ప‌ట్టుద‌ల‌.. మొండిత‌నం... తెగువ... నిర్భితీ ఆమెనో విజ‌య‌వంత‌మైన మహిళ‌గా నిలిపాయి... స్వాతంత్య్ర స‌మ‌ర‌యోధుల క‌డుపున పుట్టిన ఆమె అటు సొంత పార్టీలో.. ఇటు ప్ర‌త్య‌ర్థి పార్టీతో నిరంతరం పోరు స‌ల్పుతూనే నాలుగు ద‌శాబ్ధాలకు పైగా రాజ‌కీయాల్లో నెగ్గుకొచ్చారు.. ఏడాదిన్న‌ర వ‌య‌స్సులోనే త‌ల్లిని కోల్పోవ‌డంతో ఆమె జీవితంపై క‌మ్మిన మ‌బ్బులు.. ఆమె రాజ‌కీయ ప్ర‌స్థానాన్ని అడుగ‌డుగునా అంతం చేసేందుకు పెద్ద మ‌నుషులు.. కుల ద్వేషాల రూపంలో మ‌రింత ద‌ట్టంగా అలుముకున్నా వాటిన్నింటిని చీల్చుకుంటూ ప్ర‌కాశించిన అరుణ‌ కిర‌ణం ఆమె. 

గ‌ల్లా అరుణ కుమారి.. ఉమ్మడి ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ప‌రిచ‌యం అక్క‌ర‌లేని పేరు.. మాజీ ఎంపీ పాటూరి రాజ‌గోపాల్ నాయుడు కుమార్తెగా... అమ‌ర‌రాజా సంస్థ‌ల వ్య‌వ‌స్థాప‌కుడు గ‌ల్లా రామ‌చంద్ర నాయుడు స‌తీమ‌ణిగా ఆమె జీవితం పూల బాట‌గానే ఉంటుంద‌నే భావ‌న ప్ర‌తి ఒక్క‌రిలో ఉంటుంది. కానీ ఆమెదేమీ పూల బాట కాదు.. త‌ల్లి లేని ప‌సి గుడ్డులో పేరుకుపోయే ఆవేద‌న‌...ఎదుర్కొనే మానసిక సంక్షోభం... వివాహమై విదేశాల‌కు వెళ్లిన త‌ర్వాత అక్క‌డ నిల‌దొక్కుకోవ‌డానికి ఓ చిన్న కంపెనీలో దుస్తులు క‌త్తిరించే ప‌నిలో చేర‌డం.. నానా క‌ష్టాలు ప‌డి మ‌రో పెద్ద కంపెనీలో చేరి స‌హోద్యోగులంద‌రికీ త‌ల‌లో నాలుక‌లా మార‌డం.. స్వ‌దేశం నుంచి వ‌చ్చే వారికి ఆతిథ్యం క‌ల్పించ‌డం... పుట్టి పెరిగిన ప్రాంతంలో ప్ర‌జ‌ల‌కు ఉపాధి క‌ల్పించ‌డ‌మే ల‌క్ష్యంగా తిరిగి స్వ‌దేశానికి మ‌ళ్ల‌డం.. తండ్రి ఎన్నిక‌ల ప్ర‌చారంలో అండ‌గా నిల‌వాల‌నే ఉద్దేశంతో కంపెనీ నుంచి వ‌చ్చే ప్రోత్సాహాకాల‌ను వ‌దులుకొని రావ‌డం.. ఊహించ‌ని విధంగా ద‌శాబ్దాలుగా సేవ‌లందించిన పార్టీనే ఆయ‌న‌కు టిక్కెట్ నిరాక‌రించ‌డం.. అక్క‌డి నుంచి ఎదుర‌య్యే ప్ర‌తి ఆటంకాన్ని ఆమె అధిగ‌మించిన తీరు ప‌రికిస్తే ఆమెది పూల బాట కాదు.. రాళ్ల బాట‌... ఆ రాళ్ల బాట‌ను ఆమె ర‌హ‌దారిగా మార్చుకున్న తీరుకు ద‌ర్ప‌ణం ఆమె స్వీయ చ‌రిత్ర‌..

ఉమ్మడి ఏపీ రాజకీయ చరిత్ర దర్పణం

అరుణ కుమారి త‌న ర‌చ‌న‌తో 58 ఏళ్ల ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాజ‌కీయ చ‌రిత్ర‌ను, 77 ఏళ్ల ఆమె జీవితాన్ని... ఉమ్మ‌డి చిత్తూరు జిల్లా రాజకీయ‌, సామాజిక‌, ఆర్థిక ప‌రిస్థితుల‌ను క‌ళ్ల‌కు క‌ట్టారు.. త‌ల్లి లేని బిడ్డ‌గా నాయ‌న‌మ్మ.. మేన‌త్త‌ల ప్రేమ‌తో అపురూపంగా పెరుగుతున్నా పసి బిడ్డ‌గా అమ్మ కోసం అల‌మ‌టించిన క్ష‌ణాలు... అమ్మ కావాలంటూ నాన్న‌ను అడిగిన‌ప్పుడు ఆయ‌న త‌న త‌ల్లిపై చూపిన ప్రేమ‌ను ఆమె ఇప్ప‌టి వ‌ర‌కు మ‌దినిండా నింపుకున్నారు.. స‌మాజం.. ప్ర‌జ‌ల సేవే ల‌క్ష్యంగా నిరంతరం ప‌ని చేస్తూ.. ఎంత‌టి ప్ర‌తికూల ప‌రిస్థితుల్లోనూ నిరాశ‌ను, ప్ర‌తికూల భావ‌న‌ల‌ను ద‌రిచేర‌నీయ‌ని మ‌హా మ‌నిషిగా.. సాహిత్య పిపాసిగా.. అంద‌రి వాడిగా నిలిచిన త‌న తండ్రి పాటూరి రాజ‌గోపాల్ నాయుడు బాట‌లోనే ఆమె జీవ‌న ప్ర‌స్థానం కొన‌సాగించారు.. అదే స‌మ‌యంలో ఆయ‌న‌కు ఉన్న మొహ‌మాటాన్ని వ‌దిలేసి...స‌ర్దుకుపోయే త‌త్వానికి బ‌దులు స‌వాల్ చేసి ఎదురు నిలిచి ప‌రిష్కారాన్ని క‌నుగొనే త‌న‌దైన బాట‌ను ఎంచుకున్నారు... అమెరికా నుంచి తిరిగి వ‌చ్చి ఇక్క‌డ రాజ‌కీయాల్లో ప్ర‌వేశించాకే అస‌లు జీవితం ఏమిటో.. రాజ‌కీయాలు ఏమిటో ఆమెకు అర్ధం అవ‌డ‌మే కాదు.. మ‌న‌కు తెలిసి వ‌చ్చేలా ఆమె ర‌చ‌న కొన‌సాగింది.

కార్యకర్తలను మరవని నాయకురాలు

రాజ‌కీయ ప‌ర‌మ‌ప‌ద సోపాన ప‌టంలో పెద్ద మ‌నుషుల చిన్న బుద్దులు పాముల్లా అరుణ కుమారిని, ఆమె కుటుంబ రాజ‌కీయ ప్ర‌స్థానాన్ని కాటు వేస్తే... ఆమె తండ్రి సేవ‌లు అందుకున్న సామాన్యులు పెద్ద మ‌న‌స్సుతో ఆమెకు అండ‌గా నిలిచి నిచ్చెన‌ల‌పై నిలిపిన తీరును ఆమె నిర్మొహ‌మాటంగా రాసుకొచ్చారు.. త‌న రాజ‌కీయ జీవితంలో అండ‌గా నిలిచిన ప్ర‌తి సామాన్య కార్య‌క‌ర్త పేరును త‌న పుస్త‌కంలో ప్ర‌స్తావించ‌డం అబ్బుప‌రుస్తుంది. పెళ్ల‌యిన నాలుగేళ్ల‌లోపే భార్య చ‌నిపోతే జీవితాంతం ఆమె జ్ఞాప‌కాల‌తో.. ఆమె వ‌దిలివెళ్లిన బిడ్డ‌ను కంటికి రెప్ప‌లా కాపాడుకుంటూనే.. జ‌నం స‌మ‌స్య‌ల పోరాటానికే ఆమె తండ్రి రాజ‌గోపాల నాయుడు కృషి చేశారు... స్వాతంత్య్ర స‌మ‌ర‌యోధునిగా... సంఘ సేవ‌కునిగా.. ర‌చ‌యిత‌గా... రెండు సార్లు ఎమ్మెల్యేగా, ఎమ్మెల్సీగా, రెండు సార్లు ఎంపీగా సేవ‌లందించిన పాటూరి రాజ‌గోపాల్ నాయుడు త‌న యావ‌జ్జీవితం న‌మ్మిన సిద్దాంతానికి క‌ట్టుబ‌డి ప‌ని చేశారు.. రైతు నేత ఎన్జీ రంగా అడుగుజాడ‌ల్లో న‌డిచారు..

కేటీఆర్‌ను తరిమికొట్టిన వేళ

రాజ‌శేఖ‌ర్ రెడ్డి మృత‌దేహం రాక‌ముందే జ‌గ‌న్‌మోహ‌న్ రెడ్డికి అనుకూలంగా సంత‌కాల సేక‌ర‌ణ‌.. దానిని ఆమె వ్య‌తిరేకించ‌డం...పాల‌నా ద‌క్షునిగా మిగులుతాడునుకున్న రోశ‌య్య ప‌ద‌విని స‌మ‌ర్థంగా నిర్వ‌హించ‌లేక‌పోవ‌డం.. ముఖ్య‌మంత్రి ప‌దవి కోసం ఢిల్లీలో త‌న త‌ర‌ఫున పెద్ద‌ల‌ను క‌ల‌వాల‌ని కోరిన కిర‌ణ్ కుమార్ రెడ్డి.. అది ద‌క్కిన త‌ర్వాత ప‌ట్ట‌న‌ట్లు వ్య‌వ‌హ‌రించ‌డం.. వివిధ విష‌యాల్లో నాటి మంత్రులు ర‌ఘువీరారెడ్డి, క‌న్నా ల‌క్ష్మీనారాయ‌ణ వైఖ‌రిల‌ను ఆమె ఎండ‌గ‌ట్టారు. త‌న‌కు అండ‌గా నిలిచిన రాజీవ్ గాంధీ, మ‌ల్లు అనంత‌రాములు, చంద్రేశ్ కుమారిల‌తో పాటు ప్ర‌తి ఒక్క‌రిని గుర్తుంచుకోవ‌డం.. ఒక్క‌టేమిటి... చెప్పుకుంటూ పోతే ఎంతో ఎంతెంతో రాజ‌కీయం... రాష్ట్ర విభజన స‌మ‌యంలో అసెంబ్లీలో తన వైపు దూసుకొచ్చిన కేటీఆర్‌ను జుట్టు పట్టుకొని వంచి వీపు మీద బలంగా నాలుగు దెబ్బలు వేయడం… ఆయన వదిలించుకొని వెనక్కి పరిగెత్తినటువంటి ర‌స‌వ‌త్త‌ర ఘ‌ట్టాల‌ను ఆమె లిఖించారు.. 2014లో రాష్ట్ర విభ‌జ‌న‌తో స్వీయ చ‌రిత్ర ముగిసింది.. కానీ ఆ త‌ర్వాతా ఆమె చురుగ్గానే ఉన్నారు.. పుస్త‌కం పూర్త‌య్యాక ఈ ప‌దేళ్ల ఏపీ ప్ర‌స్థానాన్ని ఆమె రాస్తే బాగుంటుంది అనిపించింది... ఒక్క మాటలో చెప్పాలంటే గ‌ల్లా అరుణ కుమారి స్వీయ చ‌రిత్ర‌... రాజ‌కీయాల్లో ఎద‌గాల‌నుకునే వారికి ఓ పెద్ద బాల‌శిక్ష‌.

పుస్తకం : గల్లా అరుణ కుమారి స్వీయ చరిత్ర

ప్రచురణ: ఎమెస్కో బుక్స్

పేజీలు 935

వెల: రూ. 1000

ప్రతులకు: ఎమెస్కో బుక్స్


సమీక్షకులు

సాగర్ బాబు

91000 04402

Tags:    

Similar News

మంత్రాంగం

భయం