సత్యధారలు ..!

Poem

Update: 2024-12-29 21:45 GMT

తన మనసు అశాంతి వలయంలో

ఆత్మాభిమాన అబద్ధపు సంకెళ్ళలో

సత్యం పురుడు పోసుకోలేదని

నిత్యం ఆడే చదరంగపు ఆటలో

పావుల మనుగడకై పాపపు ఎత్తులెన్నో...

మబ్బు తెరల్లో ఉషోదయ వెలుగులు

సహృదయులు మరెక్కడని వెతకగా

బరువుతో రోదిస్తున్న మేఘపు ధారలు

అశ్రుధారలై ఎడతెరిపిగా కురుస్తుంటే

వరుణుడే కొత్త దారి వెతకాలనుకున్నాడు.

ఓసారొస్తానని వచ్చే ఇంద్రధనస్సు

ఆ ధారల చిరు స్పర్శతో తనకు తానే

నిజం తెలియక అసంపూర్ణ వెలుగులో

ముఖం చాటేసిన తన ఏడు రంగులు

తనను వదిలి గమ్యాన్ని శోధిస్తుంటే

సత్యమే దీనంగా మేఘాన్ని వేడుకొంది..

చికురాకుల కొమ్మల్లో పూచిన పువ్వులు

మరెవరిని వరించాలని మాలగా చూస్తూ

తడి లేని మనిషి గుండెలను ప్రశ్నిస్తుంటే

నేలపై విత్తు నీటిని తాకి బరువైందన్నది.

వేరులైన విత్తు మూలాలే అర్థిస్తుండగా...

-డా. చిటికెన కిరణ్ కుమార్

94908 41284

Tags:    

Similar News

మంత్రాంగం

భయం