పిల్లలంటే!

Poem

Update: 2024-11-25 00:00 GMT

ఒక స్త్రీ తన బిడ్డను గుండెలకు

హత్తుకుంటూ అందిలా.

“ మాకు పిల్లల గురించి చెప్పు. ‘’

నీ పిల్లలు నీ పిల్లలు కారు

జీవిత వాంఛలే కొడుకులు, కూతుళ్లు!

వాళ్ళు నీ ద్వారా వచ్చారు కాని నీ నుండి కాదు

వాళ్ళు నీతో ఉన్నా నీ వాళ్ళు కారు

నీ ప్రేమను వాళ్లకు పంచవచ్చు కాని....

నీ ఆలోచనలను కాదు

వాళ్ళవి వాళ్లకుంటాయి కదా!

వాళ్ళ శరీరాలకు నువ్వు రక్షణ కావచ్చు

కానీ వాళ్ళ మనసులకు కాదు!

ఎందుకంటే వాళ్ళ మనసులు

రేపటి ఆవాసాలలో ఉంటాయి కాబట్టి!

వాటిని నువ్వు కలలో కూడా చూడలేవు

వాళ్ళలాగా ఉండటానికి నువ్వు ప్రయత్నించవచ్చు,

కానీ నీలాగా వాళ్లను తయారుచేయాలని చూడకు!

జీవితం వెనుదిరగదు

నిన్నటితో ఆగిపోదు

విల్లు లాంటి నీనుండి సంధించిన

సజీవ శరాలు వారు!

విలుకాడు అనంతమైన మార్గంలోని

ఒక లక్ష్యాన్ని ఏర్పరచుకుని,

తన శక్తి నంతా పెట్టి బాణాలు వేగంగా,

దూరంగా వెళ్ళేట్లు నిన్ను వంచుతాడు

విలుకాని చేతిలో నీ 'వంపు 'ని సంతోషించు,

ఎందుకంటే అతడు కూడా

శరం దూరంగా ఎగరటం ఇష్టపడతాడు కాబట్టి!

అలాగే స్థిరంగా ఉండే ఆ ధనుస్సుని కూడా!

మూలం : ఖలీల్ జిబ్రాన్ (On Children )

అనువాదం

డాక్టర్ చెంగల్వ రామలక్ష్మి

63027 38678

Tags:    

Similar News

మంత్రాంగం

భయం