వ్యయ ప్రయాసలతో కూడుకున్నా
పెట్టుబడికి ఋణాలు అందకున్నా
సరిపోయే దిగుబడులు లేకున్నా!
రైతు కృషి చేయని రోజు లేదు
ఖుషీగా ఉన్న రోజు రాలేదు
రణంలా మారిన వ్యవసాయం
ఎన్నో రైతు మరణాలు!
ఆదుకోవాల్సిన ప్రభుత్వాలు
ఆకర్షణకు గురిచేసే పథకాలు!
ఆ క్షణికమైన ఆనందాలు
తక్షణమే కరిగిపోయే క్షణాలు!
ఋణాలు మాఫీ అనే హామీతో
ఎక్కిన అధికారపు పీటలు!
ఎక్కాక మొక్కవోని దీక్షతో
చేయాల్సిన పనులు
మొక్కుబడిగా నిర్వహిస్తే!
అందరికీ అందాల్సిన ఋణమాఫీ
కొందరికే అందితే
ఆగ్రహానికి లోనైన రైతులు
ఆందోళనకు దిగరా?
ఆలోచించాల్సిన ప్రభుత్వం
అణచివేతకు పాటుపడితే
రెక్కలు విరిగిన విహంగాలుగా
తల్లడిల్లుతున్న రైతాంగం!
రగిలిన ఆ రైతు రవ్వలు
నిలదీసే నిప్పు కణికలైతే
దహనం ఎవరి వంతు
రేపటికి ముగియదా నీవంతు!
జగ్గయ్య.జి
9849525802