నడిరాత్రి దాటినా నిద్ర పట్టదు
ఆవలింత అటకెక్కి వెక్కిరిస్తోంది
మూసే కన్నులకు మోయలేని కనురెప్పల భారం
తెరిచిన కన్నుల్లో మొలిచిన ఎడారి పూలు
దృశ్యమానమవుతున్న పగటి పరిహాసాలు
మనసు నిండా తెలిసిన వెలితే
తొలగింప శక్యం కాదు.
గదిని బిగించుకుని
శీతల గాలుల్లో బంధించుకున్నాను
చమటలు రాని దేహానికి
స్పర్శ సుగంధం పూయాలని బయలుదేరిన
మలయమారుతమొక్కటి
మూసిన కిటికీ వద్ద ఆగిపోయింది.
ఆ ఉక్కిరిబిక్కిరిలోనే
మగతలో కలతల కల
కాట కలిసిన మేకపిల్లపై
తోడేళ్లు దాడిచేసినట్లు
అడవి నెత్తురోడుతున్నట్లు
అందులో మనుషులు మునిగిపోతున్నట్లు
ఊపిరాగిపోతున్నట్లు...
దిగ్గున కండ్లు తెర్చుకుంటాయి
పగటి వేషానికి సిద్ధమైపోతాను
-హెచ్. రవీందర్,
9912233533