దాచిన ఆయుధాల సంగతి
ధర్మరాజుకి తెలీదు..
జమ్మి చెట్టు ఎక్కడుందో
పాండవులకి యాది లేదు
కానీ, చెడుపై మంచి విజయం
సాధించిందని మీసం మెలేస్తారు.
మరి, నువ్వేంటిలా?
పుక్కిట పురాణమేదీ చెప్పకుండానే
పిడికిలి సడలించావ్?
పారడాక్స్ ఏమిటంటే,
సరిగ్గా ఇవాళ్లికి, వాళ్లకి యాభై ఏళ్లట,
మరి, నీకెందుకిలా నూరేళ్లు?
యాభైలు నూర్లైనా
మిగిలేవి శూన్యాలేనా?
అయినా, అంతిమ యాత్రలో
మాస్ హిస్టీరియా మహోద్రేకం కలిగించింది
గడ్డకట్టుకున్న పిరికితనం
మాబ్ కల్చర్‌లో ముసుగు తొలగించుకుంది
నేనొక్కడినీ కడుపు చించుకుని
పేగులను ఎవరి మెళ్లో వేయగలను?
నమ్మకంలేదుగానీ, మళ్లీ జన్మంటూ వుంటే
నువ్వు పది కాళ్లతో రా
చక్రాల కుర్చీ తోసే వానరసైన్యం తోడుగా.
అప్పటికి, కౌరవులు పాలపిట్టలై వస్తారని,
వసంతం ఒక్కటే రుతువవుతుందని
మంజీర తీరంలోని విత్తులన్నీ
దశకంఠులై మొలకలేస్తాయని
వాగ్దానం చేద్దాం, ఇప్పటికి.
-దేశరాజు
99486 80009