కాళ్ళు లేకున్నా తాను...
నేల నేలంతా కలియతిరుగుతుంటే
రాజ్యం కలవరపడింది
తనను బంధించి
మము భయపెట్టాలని చూస్తే
తాను ధైర్యంగా నిలబడి
ప్రభుత్వాన్ని గేలి చేశాడు
బహుజన ప్రజావైపు నిజాయితీగా నిలబడటమెట్లానో
చూపు ఆచరణ శిఖరాన్ని మిగిల్చి వెళ్ళాడు
రాజ్యం ఆయుధాన్ని ఆయుధంతో ఎదుర్కోగలదు
పై చెయ్యీ సాధించగలదు కానీ
ఆలోచనను ఎదుర్కోలేదు అందుకే..
తనను బంధించి ఊపిరి పీల్చుకుందామనుకుంటే
తన ఆలోచనల స్వేచ్ఛా విహంగం
నీలాకాశం మీద విముక్తి గురుతులు గీస్తుంది
ఆలోచనల విహంగాన్ని బంధించే సాంకేతికత లేక
ప్రభుత్వం ఉక్కిరిబిక్కిరవుతుంది
రాజ్యం నేరమైతే మోపగలిగింది కానీ
నిరూపించలేక చతికిలపడింది
కుటిల నీతి న్యాయస్థానం
ఎన్ని ఊతకర్రలిచ్చిన తాను నిలబడలేకపోయింది
ఉట్టి నిందితున్ని, నిర్దోషిని అనుమానం పేర
కఠిన కారాగారవాసం చేసిన
న్యాయస్థానమా.... సిగ్గుపడు
నీ ఆత్మ ఏ రంగు చొక్కాల
జేబుల వెనుకనుండి పలుకుతుందో
మేము ఎరుగుదుము
మిత్రులారా...
నాలుగు చక్రాల ఆ ఖాళీ కుర్చీనీ
పార్లమెంటు భవనం ముందు ప్రతిష్టించండి
దానిమీద తన పేరు రాయండి
పార్లమెంటు లోపట కూసున్నవారి ఆలోచనల్లో
అగులుబుగులు కాకుంటే
వారి ముఖాలల్లో
కంగారు కనపడకుంటే చెప్పండి
నా శ్రామిక తల్లుల మీద ఒట్టేసి చెబుతున్న
(జి. ఎన్.సాయిబాబా స్మృతిలో....)
దిలీప్.వి
మానవ హక్కుల కార్యకర్త
84640 30808