కావ్యం కవిత్వం పద్యం
అనుభూతుల ఆలింగనం
రొమాంటిసిజమ్
కుళ్ళిన రొయ్యల వాసనల్లో
అతుకుల బతుకుల జాడ
కంకర రోడ్లెంట
చెమటల వాసనల ధార
మట్టి వెట్టి ఆయాసంల
అనుభవించని రోజుకు
అర్థం పర్థం లేదు
ఆకలిగొన్న గొడ్డుకు
అడ్డూ అదుపూ కరువు
అరుస్తున్న సమాజం వైపు..
చెయ్యి చాచిన ఒక స్టాచ్యూ
ఎండకు వానకు
చలికి బలికి
అన్నీ చూస్తున్న
నిఖార్సైన మూగ సాక్షి
లెక్కచేయని ప్రజా రాజ్య భోజ్య శ్రీ శ్రీ శ్రీ...
డబ్బాల్లో మన జీవితాల లెక్కింపు
వినిమయ సంస్కృతి..
చేతిలో మన దారాలు
ఎగురుతున్నాం
ఎక్కడెక్కడో తప్పిపోయి
ఎవరి దిశ ఎటో
ఎవరి ఆధారం ఎక్కడో...
మన బతుకులు
తెగిన గాలిపటాలు
'సా...హా...' అని అరుస్తూ
పరిగెత్తే మన అస్తిత్వాలు!
- రఘు వగ్గు
96032 45215