నేనూ నా దేశం

Poem

Update: 2024-09-08 18:45 GMT

నీ పాదముద్రల నిండా అప్రమత్తతే

ప్రతి అడుగులో తప్పులకు తావు లేని

ఆచి తూచి వ్యవహారమే

అంతా క్రమశిక్షణ నిజాయితీ నిబద్ధతే

నీతి నియమాలు దాటని కట్టుబాటు పాపభీతే

నిన్ను నువ్వు ఇంతగా ప్రేమించే సగటు పౌరుడా!

దేశాన్నెందుకు అలా గాలికొదిలేశావ్?

ఉద్యోగాల కోసం తిరిగే ఓపిక, ఓ గంట పోలింగ్

లైన్లో నించోనంటోందా... అదీ ఐదేళ్ళకోసారి!

పెళ్లిళ్ళకు మంచీ చెడు విచారించే జాగ్రత్త

ఓటేసే ప్రజాసేవకుల గుణగణాలను వాకబు

చెయ్యనంటోందా!

గంటల తరబడి సినిమాలపై చర్చించే ఆసక్తి

దేశ సమస్యలపై పెదవి విప్పనంటోందా!

ముక్కూమొహం తెలీకపోయినా తోటి పౌరుల్ని

సహోదర భావంతో చూసే పరిపక్వత

నీలో ఇంకా రాలేదంటోందా!

ఇంతకాలం నేనూ నా జీవితమేననుకొని, దేశాన్ని

పట్టించుకోని నీ అంతరాత్మకు చెప్పు!

దేశమంటూ బావుంటేనే నువ్వుంటావని,

బావుంటావని...నీ దేశాన్ని నువ్వు కాక

మరెవరు పట్టించుకుంటారో చెప్పు!!

- భీమవరపు పురుషోత్తమ్

99498 00253

Tags:    

Similar News

మంత్రాంగం

భయం