పెళ్లయిన పుష్కర కాలానికి పుస్తకం పట్టిన మహిళ.. ఎగురుకుంటూ వచ్చిన ఉద్యోగం, డాక్టరేట్
వివాహం విద్యా నాశనం.. అంటారు పెద్దలు. కానీ ఆమె మాత్రం పెళ్లయి, ఇద్దరు పిల్లలు పుట్టాక చదువుకోవడం మొదలుపెట్టింది.

దిశ ప్రతినిధి, నిజామాబాద్ : వివాహం విద్యా నాశనం.. అంటారు పెద్దలు. కానీ ఆమె మాత్రం పెళ్లయి, ఇద్దరు పిల్లలు పుట్టాక చదువుకోవడం మొదలుపెట్టింది. చదువుకోవాలనే ఆమె బలమైన ఆకాంక్షకు భర్త సహకారం కూడా తోడైంది. పెళ్లయిన పన్నెండేండ్లకు ఆమె మళ్లీ పుస్తకాలతో కుస్తీ పట్టింది. ఇద్దరు చిన్న పిల్లలు, కుటుంబం చూసుకుంటూనే.. కాలంతో పోటీ పడి ఖాళీ సమయాన్ని సద్వినియోగం చేసుకుని డాక్టర్ జ్యోతిగా ఎదిగింది.
7వ తరగతికే బడి బంద్
నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలంలోని గడ్కోల్ కు చెందిన అన్నందాస్ జ్యోతి 7వ తరగతికే చదువు మానేసింది. సిరికొండకు వెళితేనే ఉన్నత విద్యాభ్యాసం అవకాశం ఉండడంతో ఇంటి దగ్గరే టైలరింగ్ నేర్చుకుంది. పెళ్లీడు రాగానే యేటకొండూరు గ్రామానికి చెందిన దండు శివకుమార్ తో జ్యోతి పెళ్లి జరిగింది. వారికి ఒక కొడుకు, ఒక కూతురు ఉన్నారు.
12 ఏండ్ల తరువాత..
పెళ్లయి ఇద్దరు సంతానం కలిగిన తరువాత 12 ఏళ్లకు ఆమెకు మళ్లీ చదువుకోవాలనిపించింది. ఈ మాటే భర్త శివకుమార్ అడిగితే సరే అన్నాడు. అలా అంబేడ్కర్ ఓపెన్ యూనిర్శిటీలో అడ్మిషన్ తీసుకుంది. ఓ వైపు టైలరింగ్.. మరోవైపు చదువు కొనసాగిస్తూనే బీఏ డిగ్రీ పూర్తి చేసింది. పిల్లలు పెరిగే వయసులో.. చదువు అవసరమా ? అని ఎన్నో అవమానాలను ఎదుర్కొన్నది. అవన్నీ పట్టించుకోకుండా బీఎడ్ ఎంట్రెన్స్ రాసినా .. ఆర్థిక పరిస్థితులు అడ్డు చెప్పాయి. అదే సమయంలో పెద్ద వాల్గోట్ లో కస్తూర్బా పాఠశాలలో టీచర్ గా అవకాశం వచ్చింది. స్కూల్ ప్రిన్సిపాల్ కిషన్ సలహా మేరకు బీఎడ్ లో చేరింది. భర్త సహకారంతో నిజామాబాద్ లో ఉండి పిల్లలిద్దరినీ స్కూలుకు పంపి తను బీఎడ్ కాలేజీకి వెళ్లేది. సాయంత్రం పిల్లలతో కలిసి చదువుకుని బీఎడ్ పూర్తి చేసింది.
సర్కారు కొలువు..
బీఎడ్ తరువాత హైదరాబాద్‌లో డీఎస్సీ కోచింగ్ తీసుకుంది. 2008 డీఎస్సీలో ఓపెన్ మహిళా కోటాలో తెలుగు పండిట్ గ్రేడ్ 2 ఉద్యోగం సాధించారు జ్యోతి. ప్రభుత్వ ఉద్యోగం చేస్తూనే 2010 లో ఎంఏ పూర్తి చేసింది. 2014లో నేషనల్ ఎలిజిబులిటీ టెస్ట్‌లో మంచి ర్యాంకును సాధించి అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా అర్హత సాధించారు. అదే సమయంలో ‘బీఎస్ రాములు కథలు, తెలంగాణ జన జీవన చిత్రణ’ అనే అంశంపై పరిశోధన చేసి తెలంగాణ యూనివర్సిటీలో డా. లక్ష్మణ చక్రవర్తి పర్యవేక్షణలో పీహెచ్‌డీ పూర్తి చేసింది. 2020 మార్చి 14 న తెలంగాణ యూనివర్శిటీ నుంచి అన్నందాస్ జ్యోతి డాక్టరేట్ అందకున్నది. డాక్టర్ అన్నందాస్ జ్యోతిగా వృత్తి పట్ల ఎంతో నిబద్ధతతో పని చేస్తూ ఎన్నో ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులను ఆమె సొంతం చేసుకున్నది.