Love & Market లవ్.. లైఫ్.. డేటింగ్.. రిలేషన్‌షిప్.. మార్కెట్ మాయలో అన్నీ బంధీలే..
Love & Market లవ్.. లైఫ్.. డేటింగ్.. రిలేషన్‌షిప్.. మార్కెట్ మాయలో అన్నీ బంధీలే..

దిశ, ఫీచర్స్ : లవ్.. లైఫ్.. డేటింగ్.. రిలేషన్‌షిప్ మానవ సంబంధాల్లో గొప్పవే కావచ్చు. కానీ.. నేటి ఆధునిక వినిమయ సంస్కృతిలో అవి కొట్టుకుపోతున్నాయని, మార్కెట్ మాయాజాలంలో అనుబంధాలు సైతం బంధీలైపోతున్నాయని నిపుణులు అంటున్నారు. ఎందుకంటే నేడు మనిషిలోని ప్రతీ ఎమోషన్‌ను తనకు అనుకూలంగా మార్చుకుంటోంది ప్రపంచ మార్కెట్. ఉదాహరణకు లవర్స్ డే, మదర్స్ డే, ఫ్రెండ్ షిప్‌డే, ఇలా ఏ ప్రత్యేక సందర్భాలైనా గిఫ్టుల పేరుతో, ఫ్లవర్ బొకేల పేరుతో, సోషల్ మీడియా వేదికల్లో స్పెషల్ విషెస్ పేరుతో తెరవెనుక పెద్ద మార్కెట్టే నడుస్తుందని మీకు తెలుసా? అంటే మనుషుల సెంటిమెంట్లు, ప్రేమలు, భావోద్వేగాలు సైతం కొందరికి కాసులు కురిపిస్తాయి. దీనినే వినిమయ సంస్కృతి, మార్కెట్ మాయ అని ముద్దుగా పిలుస్తారు నిపుణులు.
అనుబంధాలు ఏవైతేనేం.. కొన్ని కొన్నిసార్లు అవి ఆధునిక వినిమయ వస్తు ప్రపంచంలో వస్తువులుగానే మారిపోతుంటాయి. మనకు తెలియకుండానే వాటికి బానిసలై పోతుంటాం. అంటే ఇక్కడ మార్కెట్ వ్యవస్థ ఏదో ఒక రూపంలో తన లాభాలకోసం మానవులను వినియోగించుకుంటుంది. ఉదాహరణకు వెకేషన్స్‌కు తగిన ప్లాన్ చేస్తూ రకరకాల వస్తువులతో, ఫ్యాషన్ దుస్తులతో, ఆభరణాలతో ఆకట్టుకుంటుంది. లవ్ సెంటిమెంట్స్‌ను ఖరీదైన వస్తువుల్లో చూసుకునేలా.. ప్రసార, సామాజిక మాధ్యమాలు, సోషల్ మీడియా వేదికలుగా రకరకాల కంటెంట్‌తో యువతరం మైండ్‌సెట్‌ను మార్చేస్తుంది. ఈ ప్రభావమే నేడు చాలామంది తమ లవ్.. లైప్.. డేటింగ్.. చివరికి ఫస్ట్ డేట్, ఫస్ట్ నైట్ వంటివి కూడా పలువురితో పంచుకునే సెలబ్రేషన్స్ అయిపోయాయి. రిలేషన్‌షిప్ కొనసాగించడంలోనూ వస్తు వ్యామోహ ధోరణి.. అంటే బంధాన్ని నిలబెట్టుకోవడానికి ఖర్చు పెట్టడం అనేది కనిపిస్తోంది. పైగా కొందరు తమ సంబంధాన్ని ఖరీదైన సోషల్ స్టేటస్‌గా భావిస్తున్నారు. ఈ పరిస్థితివల్లే జెన్ జెర్స్ అండ్ మిలీనియల్స్ అప్పులపాలవుతున్నారు. ముఖ్యంగా డేటింగ్ డెబ్ట్ కల్చర్ పెరిగిపోతోంది.
డేటింగ్ కోసం అప్పులు
వెస్ట్రన్ కంట్రీస్‌కి చెందిన ప్రతీ వ్యక్తి సగటున తన జీవితకాలంలో లవ్ కోసం రూ. ఒక కోటి 8 లక్షల వరకు ఇన్వెస్ట్ చేయడం లేదా ఖర్చు చేస్తున్నట్లు గత సర్వేలు పేర్కొంటున్నాయి. ప్రస్తుతం మరింత పెరిగి ఉంటుంది. అయితే ఇది ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా వ్యాపిస్తోందని నిపుణులు అంటున్నారు. ఇండియాలోనూ ప్రేమించిన వ్యక్తికోసం జేబులు ఖాళీ చేసుకొని ఆగమైతున్న యువత పెరుగుతోంది. రొమాంటిక్ డిన్నర్స్, మూవీ మీటింగ్స్ అండ్ థాట్ ఫుల్ గిఫ్ట్స్, పర్సనల్ డ్రెస్సింగ్, కాస్మెటిక్ ప్రొడక్ట్స్ గురించి ఇక స్పెషల్‌గా చెప్పనవసరం లేదు. లెండింగ్ ట్రీ సర్వే ప్రకారం.. 22 శాతం మిలీనియల్స్ అండ్ 19 శాతం Gen Z గొప్పలకు పోయి ‘డేటింగ్ రుణం’’ తీసుకుంటున్నారు. అంటే లవ్ అండ్ డేట్స్‌ను గొప్పగా చెప్పుకోవడానికి అధికంగా ఖర్చు చేసి, అప్పులపాలై తిప్పలు పడుతున్నారు. క్రెడిట్ కర్మ సంస్థ అధ్యయనం ప్రకారం.. 18 నుంచి 34 సంవత్సరాల వయస్సు గల వ్యక్తులలో 29 శాతం మంది కేవలం ఒకే ఒక డేట్ కోసం కూడా అప్పు చేస్తున్నారు. 21 శాతం మంది ఒక సంవత్సర కాలంలో 500 డాలర్లకంటే ఎక్కువగా డేటింగ్ రుణాన్ని కలిగి ఉంటున్నారు. 29 శాతం మంది డేటింగ్ కోసం అధికంగా ఖర్చు చేయడంవల్ల, 28 శాతం మంది తమ డేటర్స్‌ను ఇంప్రెస్ చేసేందుకు, 19 శాతం మంది మరింత సాన్నిహిత్యాన్ని కోరుకునే క్రమంలో ఖర్చు పెట్టి అప్పులపాలవుతున్నారు. అయితే 44 శాతం జెన్ జెర్స్ తమ భాగస్వామిని పరిగణనలోకి తీసుకునేటప్పుడు రుణాన్ని రొమాంటిక్ డీల్ -బ్రేకర్‌గా పరిగణిస్తున్నారని ఫైండర్ చేసిన మరో సర్వేలో వెల్లడైంది. ఇదే డేటింగ్ రిలేటెడ్ రుణాల పెరుగుదలకు కారణం అవుతోంది. ప్రజెంట్ యువతరానికి సమస్యగా మారుతోంది.
ప్రేమ.. సంబంధాలు
యువతలో లవ్ అండ్ కనెక్షన్‌కు సంబంధించిన అన్వేషణ మానసిక పరమైందిగానే మొదట ప్రారంభం అవుతుంది. కానీ పెట్టుబడి దారి సమాజంలో అది విలాసవంతమైన కోరికతో ముడిపడి ఉంటున్న పరిస్థితులు నేడు వరల్డ్ వైడ్‌గా ఉన్నాయి. తమ ప్రేమ లేదా రొమాంటిక్ రిలేషన్‌షిప్ ఎంత గొప్పదో ప్రదర్శించుకోవడానికి చాలామంది ఖరీదైన గిఫ్టులు, దుస్తులు, ఇతర వస్తువులకోసం ఖర్చు పెడుతున్నారు. ఈ పరిస్థితి చివరికి అప్పులు పేరుకుపోవడానికి దారి తీస్తోంది. క్రమంగా ఆర్థిక స్థిరత్వం, భావోద్వేగ శ్రేయస్సు, ఆధునిక సంబంధాలపై నెగెటివ్ ఎఫెక్ట్ పడుతోందని పలువురు నిపుణులు పేర్కొ్ంటున్నారు. నిజానికి కొన్ని సమస్యలు దీనికి ఆజ్యం పోస్తున్నాయి. ఇతరులకు తమ స్టేటస్ ఏంటో చూపించాలనే కోరిక నేడు ప్రేమకు పర్యాయపదంగా మారింది. ‘లగ్జరీ లైఫ్ స్టేటస్’ ఫీలింగ్స్‌ను రిటైల్ మార్కెటింగ్ సిస్టమ్ ఏదో విధంగా క్రియేట్ చేయడంలో సక్సెస్ అవుతోంది. అది చివరికి లవ్ అండ్ లగ్జరీని అనుబంధిస్తోంది.
స్టేటస్ కోసం పడరాని పాట్లు
రొమాంటిక్ ఎంగేజ్‌మెంట్స్ కోసం అప్పులు పేరుకుపోవడం అనేది ఒక సహజమైన మానవ కోరికగా భావిస్తున్నారు పలువురు. ముఖ్యంగా తమ స్టేటస్‌ను సూచించాలనే ఆలోచనే ఇక్కడ కనిపిస్తుంది. సోషల్ మీడియా, ఆన్‌లైన్ డేటింగ్ ప్లాట్‌ఫారమ్స్ ప్రమాణంగా, ప్రధాన పాత్ర పోషిస్తున్న నేటి డిజిటల్ యుగంలో ప్రజలు ఖర్చు చేయడం, నలుగురిలో తమ స్టేటస్ నిరూపించుకోవడం పెద్ద సవాలుగా ఉండట్లేదు. కానీ కొందరి విషయంలో ఇబ్బందిగానూ ఉంటుంది. కాస్ట్‌లీ సిగ్నలింగ్ అంటే గొప్పలకు పోవడం అనే భావనతో ప్రేమను, డేటింగ్‌ను అంచనా వేస్తూ మార్కెట్ మాయాజాలంలో చిక్కుకుపోవడం. ఇది ఈజీగానే జరిగిపోతోంది. రిలేషన్ షిప్స్ లేదా సోషల్ సర్కిల్స్‌లలో ఈ సిగ్నలింగ్ స్టేటస్ అసాధారణం కాదు. కానీ ఇది యువ తరాలలో కూడా ఎకానమికల్ ఎక్స్‌ప్రెషన్ సింబల్‌గా మారుతోంది.
అప్పులు.. ఆఫర్లు
మిలీనియల్స్ అండ్ జెన్ జీలు తమ విలాసవంతమైన అనుభవాలను గొప్పగా, వస్తువులను పర్సనల్ ఎక్స్ ప్రెషన్‌గా భావిస్తు్న్నారు. ఉదాహరణకు హై ఎండ్ రెస్టారెంట్‌లో విలాసవంతమైన విందు ఏర్పాటు మధ్య లవ్ ప్రపోజ్ చేయడం, నచ్చిన వ్యక్తికి డిజైనర్ హ్యాండ్ బ్యాగ్ గిఫ్టుగా ఇవ్వడం ఇలా ఏం చేసినా స్పెషల్ స్టేటస్ కోరుకోవడం కొంపలు ముంచుతోంది. అందుకోసం అవసరమైన సరుకులు లేదా వస్తువులు ఉత్పత్తి చేసే సంస్థలే అప్పులు, ఆఫర్‌లు ఇస్తూ యువతను ఆకట్టుకుంటున్నాయి. ఫస్ట్ లుక్, ఫస్ట్ మీట్, ఫస్ట్ డేట్, ఫస్ట్ ప్రపోజ్ వంటి సెంటిమెంట్లతో కూడా యువత అప్పులు చేస్తోంది. ఇక మధ్య మధ్యలో అనేక అకేషన్లు, వెకేషన్లు అన్నింటిలో లవ్ అండ్ లగ్జరీని ముడిపెట్టడంలో మార్కెట్ సక్సెస్ అవుతోంది. తమ ప్రేమ, అసలు రూపం ప్రైస్ ఆఫ్ లవ్‌తో కూడిన ఖరీదైన వ్యవహారమని అర్థం చేసుకునే సరికి డేటింగ్ డెబ్ట్స్ అప్పటికే పేరుకుపోయి ఉంటాయి. కాబట్టి యువత మేల్కొనాలి. లవ్, డేటింగ్, రిలేషన్ షిప్స్‌ను అప్పులు చేసి వ్యక్తీకరించే మార్కెట్ ధోరణికి దూరంగా ఉంటేనే భవిష్యత్ బాగుంటుందని నిపుణులు సూచిస్తున్నారు.