కర్నూల్ టు కరీంనగర్..నకిలీ విత్తనాలు తరలిస్తున్న వ్యక్తి అరెస్టు

దిశ, కరీంనగర్ : వర్షాకాలం సాగు దగ్గర పడుతున్న కొంతమంది అక్రమార్కులు తమ దుర్బుద్దిని బయటపెట్టారు. కాసులకు కక్కుర్తి పడి నకిలీ విత్తనాల సరఫరాతో రైతులను నిండా ముంచాలని ప్లాన్ చేశారు. కానీ, దీనిని కరీంనగర్ టాస్క్‌‌ఫోర్స్ పోలీసులు భగ్నం చేశారు.గురువారం కర్నూలు నుంచి వయా హైదరాబాద్ కరీంనగర్‌కు వెళ్తున్న బొలేరో లోడ్ నకిలీ పత్తి విత్తనాలను పట్టుకున్నారు. వివరాల్లోకి వెలితే..కరీంనగర్‌కు నకిలీ పత్తి విత్తనాలతో కూడిన వాహనం వస్తోందని విశ్వసనీయ సమాచారం అందుకున్న పోలీసులు తిమ్మాపూర్ […]

Update: 2020-05-28 08:03 GMT

దిశ, కరీంనగర్ :
వర్షాకాలం సాగు దగ్గర పడుతున్న కొంతమంది అక్రమార్కులు తమ దుర్బుద్దిని బయటపెట్టారు. కాసులకు కక్కుర్తి పడి నకిలీ విత్తనాల సరఫరాతో రైతులను నిండా ముంచాలని ప్లాన్ చేశారు. కానీ, దీనిని కరీంనగర్ టాస్క్‌‌ఫోర్స్ పోలీసులు భగ్నం చేశారు.గురువారం కర్నూలు నుంచి వయా హైదరాబాద్ కరీంనగర్‌కు వెళ్తున్న బొలేరో లోడ్ నకిలీ పత్తి విత్తనాలను పట్టుకున్నారు. వివరాల్లోకి వెలితే..కరీంనగర్‌కు నకిలీ పత్తి విత్తనాలతో కూడిన వాహనం వస్తోందని విశ్వసనీయ సమాచారం అందుకున్న పోలీసులు తిమ్మాపూర్ మండలం కొత్తపల్లి వద్ద టీఎస్ 07యూఈ, 4850 అనే నెంబరు గల వాహనాన్నిఅడ్డుకున్నారు. ఆపై తనిఖీలు చేయగా రూ.25 లక్షల విలువ చేసే 18 క్వింటాళ్ల పత్తి విత్తనాలు బయటపడగా వాటిని స్వాధీనం చేసుకున్నారు.రంగారెడ్డి జిల్లాకు చెందిన బొలేరో డ్రైవర్ నూనె రమేష్ (24)ను అదుపులోకి తీసుకుని విచారించగా, మహబూబ్ నగర్‌కు చెందిన లక్ష్మీనారాయణ అనే వ్యాపారి తమను పంపిస్తున్నాడని, ఉప్పల్‌లో విత్తనాల బస్తాలు లోడ్ చేసినట్టు చెప్పారు.దీంతో నకిలీ విత్తనాల సంచులు, వాహనం, డ్రైవర్‌ను తిమ్మాపూర్ పోలీసులకు టాస్క్‌ఫోర్స్ వారు అప్పగించారు.ఈ దాడుల్లో సీఐలు రత్నాపురం ప్రకాష్, శశిధర్ రెడ్డి, ఎస్ఐ కర్ణాకర్, ఏఎస్ఐ నర్సయ్యలు పాల్గొన్నారు.

గుట్టుచప్పుడు కాకుండా కర్నూలు నుంచి..

టాస్క్‌ఫోర్స్ పోలీసుల విచారణలో మరికొన్ని విషయాలు వెలుగుచూశాయి. మహబూబ్ నగర్‌కు చెందిన లక్ష్మీనారాయణ అనే వ్యాపారి వనస్థలిపురం కేంద్రంగా నకిలీ పత్తి విత్తనాలు అమ్ముతున్నాడని తేలింది. ఏపీలోని కర్నూలు జిల్లా నుంచి గుట్టుగా హైదరాబాద్ నగరానికి నకిలీ పత్తి విత్తనాలను తరలిస్తున్నట్టు రమేష్ విచారణలో వెల్లడించాడు.ఆర్డర్ వచ్చినప్పుడు లక్ష్మీనారాయణ కేవలం తమకు రూట్ చెప్తారని, ఆ ప్రాంతం మీదుగా వెళ్లాక జిల్లాల సరిహద్దుల్లోకి చేరుకోగానే కాన్ఫరెన్స్ ద్వారా ఏ రూట్‌లో వెళ్లాలో గైడ్ చేస్తాడని చెప్పుకొచ్చాడు.

సీపీ అభినందనలు..

రైతులను ముంచుతూ కొందరు వ్యాపారులు అక్రమంగా చేస్తున్న నకిలీ విత్తనాల సరఫరాను ఆదిలోనే అరికట్టిన టాస్క్‌ఫోర్స్ సిబ్బందిని కరీంనగర్ సీపీ కమలాసన్ రెడ్డి అభినందించి రివార్డులు ప్రకటించారు.ఇలాంటి చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే వారిపై ఉక్కుపాదం మోపుతామని ఆయన స్పష్టం చేశారు.

Tags:    

Similar News