టీఆర్ఎస్ మాస్టర్ ప్లాన్.. ‘ఈటల‘పైకి ఆపరేషన్ ‘బీసీ’
దిశ, తెలంగాణ బ్యూరో : హుజురాబాద్ కేంద్రంగా రాజకీయం హీటెక్కుతోంది. అక్కడి నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఈటల రాజేందర్ రాజకీయ పునాదులను పెకిలించేందుకు టీఆర్ఎస్ ‘టార్గెట్ హుజురాబాద్’ చేపట్టింది. నిన్నమొన్నటిదాకా వినోద్ కుమార్‌ను రంగంలోకి దించిన టీఆర్ఎస్ ఇప్పుడు బీసీ వర్గానికి చెందిన గంగుల కమలాకర్‌ను వదిలింది. ఈటల రాజేందర్ ‘ఆత్మగౌరవం‘ నినాదాన్ని తెరపైకి తేవడంతో అదే బీసీకి చెందిన వ్యక్తి ద్వారా తిప్పికొట్టాలనుకుంటోంది. ఇప్పటివరకూ ఆచితూచి వ్యవహరించిన ఈటల మాటల్లో వేడి పెంచారు. మంత్రి గంగులను […]
దిశ, తెలంగాణ బ్యూరో : హుజురాబాద్ కేంద్రంగా రాజకీయం హీటెక్కుతోంది. అక్కడి నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఈటల రాజేందర్ రాజకీయ పునాదులను పెకిలించేందుకు టీఆర్ఎస్ ‘టార్గెట్ హుజురాబాద్’ చేపట్టింది. నిన్నమొన్నటిదాకా వినోద్ కుమార్‌ను రంగంలోకి దించిన టీఆర్ఎస్ ఇప్పుడు బీసీ వర్గానికి చెందిన గంగుల కమలాకర్‌ను వదిలింది. ఈటల రాజేందర్ ‘ఆత్మగౌరవం‘ నినాదాన్ని తెరపైకి తేవడంతో అదే బీసీకి చెందిన వ్యక్తి ద్వారా తిప్పికొట్టాలనుకుంటోంది. ఇప్పటివరకూ ఆచితూచి వ్యవహరించిన ఈటల మాటల్లో వేడి పెంచారు. మంత్రి గంగులను కూడా వ్యక్తిగతంగా టార్గెట్ చేశారు. టీఆర్ఎస్ చీఫ్ ఆదేశాలతో గంగుల హుజురాబాద్ సెంటర్‌గా మకాం వేసి ఈటలను రాజకీయంగా బలహీనపర్చే వ్యూహానికి పదునుపెట్టారు. ఇంతకాలం పార్టీ వర్సెస్ ఈటలగా ఉన్న వ్యవహారం ఇప్పుడు గంగుల వర్సెస్ ఈటలగా మారింది.
టీఆర్ఎస్ మాస్టర్ ప్లాన్..
హుజురాబాద్‌లో ఎప్పుడు ఉప ఎన్నికలు వచ్చినా గెలవాలన్న లక్ష్యంతో ఇప్పటి నుంచే క్షేత్రస్థాయి కార్యాచరణను టీఆర్ఎస్ మొదలుపెట్టింది. దూకుడు పెంచింది. ఇదే నియోజకవర్గం నుంచి వరుసగా ఆరుసార్లు ఓటమి లేకుండా గెలిచిన ఈటలకు రాజకీయ బేస్ లేకుండా చేయాలన్న లక్ష్యంతో టీఆర్ఎస్ పావులు కదుపుతోంది. హుజురాబాద్‌లో మాజీ ఎంపీ వినోద్ లేదా కెప్టెన్ లక్ష్మీకాంతారావును రంగంలోకి దించాలని పార్టీ అధిష్టానం తొలుత భావించినా ఈటల ‘ఆత్మగౌరవం‘ నినాదాన్ని బలంగా వినిపిస్తుండడంతో బీసీ వ్యక్తితోనే దెబ్బకొట్టాలని తాజాగా నిర్ణయించింది.
అందులో భాగమే గంగులను రంగంలోకి దింపడం.. ఈ నియోజకవర్గంలో ఉప ఎన్నికలు వస్తే గెలుపు బాధ్యతలను మంత్రి హరీష్ రావుకు అప్పగించవచ్చని పార్టీ వర్గాలు సూచనప్రాయంగా తెలిపాయి. కానీ సామాజిక సమీకరణాలను బేరీజు వేసుకుని ప్లాన్ మార్చుకుందని సమాచారం. బీసీ నినాదానికి బీసీతోనే దెబ్బ కొట్టాలనుకుంటోంది.
సాగనంపడమా.. స్వచ్ఛందంగా పోవడమా?
భూ వ్యవహారాలకు సంబంధించిన ఆరోపణలపై మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేసినట్లే ఈటలను పార్టీ నుంచి సాగనంపడంపై లోతుగా కసరత్తు జరుగుతోంది. తనంతట తానుగా వెళ్ళిపోయేలా పొమ్మనలేక పొగబెట్టే చర్యలను ఉధృతం చేయడమా? లేక సాగనంపడమా? అనే అంశాలపై పార్టీలో చర్చ జరుగుతోంది. దేని ద్వారా ఈటల ఎక్కువగా బద్నాం అవుతారనే అంచనాను బట్టి నిర్ణయం ఉంటుంది. క్షేత్రస్థాయిలో ఈటల పట్ల ప్రజల్లో ఉండే అభిప్రాయానికి అనుగుణంగా పార్టీ నిర్ణయం తీసుకోనుంది. ఈ బాధ్యతను మంత్రి గంగుల కమలాకర్‌కే అప్పగించినట్టు సమాచారం. ఈటలతోపాటు ఎవరూ వెళ్లకుండా ఒంటరి చేయాలన్నది పార్టీ ప్లాన్.
మాటల తూటాలు..
మంత్రివర్గం నుంచి బర్తరఫ్ అయిన తర్వాత కొన్ని రోజుల పాటు సైలెంట్‌గా ఉండి వ్యూహ రచన చేసిన ఈటల ఈ మధ్య కాస్త స్వరం పెంచారు. తొలుత ఉద్యమ బంధాలు, మానవ సంబంధాలు, కేసీఆర్ వ్యక్తిస్వామ్యం.. లాంటి తాత్విక పదాలకు పరిమితమయ్యారు. ఇప్పుడు గంగులను రంగంలోకి దించినట్లు గ్రహించిన ఈటల ‘బిడ్డా.. గంగులా గుర్తుపెట్టుకో.. ఎవరూ వెయ్యేళ్లు బతకరు.. అధికారం ఎప్పటికీ శాశ్వతం కాదు..” అంటూ హెచ్చరించే స్థాయికి దూకుడు పెంచారు. కరోనా పరిస్థితులను ఉదహరిస్తూ ఇప్పుడే రాజీనామా చేయనని ప్రకటించారు.
రెచ్చగొట్టడం ద్వారా, చక్రబంధంలోకి లాగడం ద్వారా స్వచ్ఛందంగా రాజీనామా చేసే పరిస్థితుల్ని సృష్టిస్తోంది పార్టీ. అందులో భాగమే ‘హుజూరాబాద్ ప్రజలు నిజంగా ఈటల వెంటే ఉంటే ఎందుకు రాజీనామా చేయట్లేదు? ఆయన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ప్రజాక్షేత్రంలో ఉప ఎన్నికలను ఎదుర్కోవాలి‘ అంటూ గంగులతో పాటు టీఆర్ఎస్ నేతలు సవాలు విసురుతున్నారు.
ఇకపైన హుజురాబాద్‌లో ఎక్కువ సమయం!
వరుసగా ఆరుసార్లు గెలిపించిన నియోజకవర్గంలో ఈటలను ఒంటరి చేయాలని పార్టీ ప్లాన్ వేస్తుంటే ఆయన మాత్రం స్థానిక పునాదిని వదులుకోరాదని భావిస్తున్నారు. అందుకే ఇంతకాలం షామీర్‌పేటకు పరిమితమయ్యారు. కానీ ఇకపైన హుజురాబాద్‌లోనే ఎక్కువ సమయం గడపాలనుకుంటున్నారు. కుడి భుజం, ఎడమ భుజం లాగా వెన్నంటి ఉన్న అనుచరులను పార్టీ రకరకాలుగా ప్రలోభపెట్టి లాక్కుంటోందని భావించిన ఈటల ప్రజల బలమే ఎప్పటికైనా శ్రీరామరక్ష అని నియోజకవర్గంలోనే ఉండాలనుకుంటున్నారు. పదవులు, అధికారం శాశ్వతం కాదని, ప్రజల దీవెనలు, ప్రేమాభిమానాలు, ఆత్మగౌరవమే వాటన్నింటికంటే అధికమని పదేపదే ప్రస్తావిస్తున్నందున ఆ ప్రజలకు దూరం కాకుండా ఉండాలనే నిర్ణయం తీసుకున్నారు.
ఒకవైపు గంగుల కమలాకర్ హుజురాబాద్‌లో మకాం వేసి వ్యవహారాలను నడిపిస్తున్నందున దూరంగా ఉంటే లాభం లేదని అభిమానులు చెప్పడంతో నిత్యం ప్రజల మధ్య ఉండడం ద్వారానే రాజకీయ భవిష్యత్తును పదిలపర్చుకోవచ్చునని, ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్‌కు తగిన బుద్ధి చెప్పవచ్చునని ఈటల భావన. అందువల్లనే గంగులపై ఘాటైన విమర్శలు చేయడానికి హుజురాబాద్‌ను వేదికగా ఎంచుకున్నారు.
‘కరీంనగర్ సంపదను విధ్వంసం చేశావ్. బొందల గడ్డగా మార్చినవ్. నీ పదవి.. పైరవీ వల్ల వచ్చిందేగానీ స్వతహాగా రాలేదు. నీ కల్చరేంటో నాకు తెలుసు. నీ బెదిరింపులకు భయపడేవాడిని కాను. నా ప్రజలు నిన్ను పాతర పెడతారు. నన్ను ఒక్కడిని చేసి తోడెళ్ళలా దాడులు చేస్తున్నారు. మంత్రిగా సంస్కారం, సభ్యత ఉండాలి. బిడ్డా గుర్తు పెట్టుకో.. అధికారం శాశ్వతం కాదు. హుజురాబాద్ ప్రజలను వేదిస్తున్నావ్..‘ అంటూ ఘాటుగానే రియాక్ట్ అయ్యారు.
కాంట్రాక్ట్ పనులకు బిల్లులు రావంటూ ప్రజాప్రతినిధులను బెదిరిస్తున్నారని, సర్కారుకు ఎగ్గొట్టిన పన్నుల సంగతి తెలుసని, టైమ్ వచ్చినప్పుడు అన్నీ బయట పడతాయని మంత్రి గంగులను ఈటల హెచ్చరించారు. 2023 తరువాత అధికారం ఉండదని, ఇప్పుడు ఎవరి మీద కుట్రలు, కుతంత్రాలు చేస్తున్నాడో భవిష్యత్తులో వాటినే ఎదుర్కోవాల్సి ఉంటుందని, సీన్ రివర్స్ అవుతుందని హెచ్చరించారు.
పరుష పదాలతో గంగుల వార్నింగ్..
గంగుల పరుష పదాలతో ఈటలపై విరుచుకుపడ్డారు. … కూడా పీకలేవు అంటూ మీడియా సమక్షంలోనే వ్యాఖ్యానించారు. ‘నిజంగా ఆత్మగౌరవం ఉంటే వెంటనే ఆ భూములను ప్రభుత్వానికి అప్పగించాలి. బెదిరిస్తే భయపడేవాళ్ళం కాము. టీఆర్ఎస్‌లో ఉన్నందునే ఇంత కాలం గౌరవించాం. బిడ్డా గిడ్డా అంటే అంతేస్థాయిలో సమాధానం ఇస్తాం‘ అని ఫైర్ అయ్యారు. అసైన్డ్ భూములు అని తేలిన తర్వాత కూడా ఎందుకు పట్టుకు వేలాడుతున్నావంటూ ప్రశ్నించారు. “నేను ఫుల్ బీసీని. నువ్వు హాఫ్ హాఫ్ బీసీవీ. హుజూరాబాద్‌లో బీసీ.. హైదరాబాద్‌లో ఓసీ..’’ అంటూ వ్యక్తిగత విమర్శలు చేశారు.