Shailaja: వాంకిడి పాఠశాల విద్యార్థిని శైలజ మృతి.. 22 రోజులుగా నిమ్స్‌లో ప్రాణాలతో పోరాటం
వాంకిడి పాఠశాల విద్యార్థిని శైలజ మృత్యువుతో పోరాడి ఓడింది.
దిశ, డైనమిక్ బ్యూరో: కలుషిత ఆహారం తిని అస్వస్థతకు గురై నిమ్స్‌లో చికిత్స పొందుతున్న విద్యార్థిని శైలజ(16) ప్రాణాలు విడిచింది. కొన్ని రోజులుగా నిమ్స్‌లో ప్రాణాలతో పోరాడుతున్న ఆమె ఇవాళ మృతి చెందింది. కొమురం భీం జిల్లా వాంకిడి గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలలో (Vankidi Ashram School) ఈ నెల 3న ఫుడ్ పాయిజన్ అయింది. స్కూల్లో భోజనం చేసిన విద్యార్థినులు అస్వస్థతగు గురయ్యారు. వీరిలో మహాలక్ష్మి, జ్యోతి, శైలజను హైదరాబాద్ నిమ్స్‌కు (Shailaja) తరలించారు. వీరిలో మహాలక్ష్మి, జ్యోతి కోలుకోగా శైలజ ఆరోగ్య పరిస్థితి విషమించింది. ఆమెకు ఉపిరితిత్తుల సమస్యతో పాటు మూత్రపిండాలపై ప్రభావం పడింది. దీంతో పలుసార్లు వైద్యులు డయాలసిస్ చేశారు. ఈ నెల 11 నుంచి శైలజను వెంటిలేటర్‌పై ఉంచి చికిత్స అందించారు. పరిస్థితి విషమించడంతో శైలజ ఇవాళ మృతి చెందినట్లు డాక్టర్లు చెప్పారు. కాగా బీఆర్ఎస్ (BRS) నేతలు స్పందిస్తూ శైలజ మృతి ప్రభుత్వం చేసిన హత్య అని ఆరోపించారు. ఇది రేవంత్ రెడ్డి సర్కార్ నిర్లక్ష్యం అని మండిపడ్డారు. బాధిత కుటుంబానికి రూ. 50లక్షల ఆర్థిక సహాయం, ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేస్తోంది.