Kaleshwaram : అడిగిన ప్రశ్నలకు మాత్రమే సమాధానం చెప్పాలి: కాళేశ్వరం కమిషన్ చైర్మన్ అసహనం
కాళేశ్వరం కమిషన్ విచారణ మళ్లీ ప్రారంభం అయింది. డిజైన్ మార్పులు, నిర్మాణంలో ప్రత్యక్ష సాక్షులైన ఇంజినీర్లతో పాటు.. పలువురు ఐఏఎస్‌లను కమిషన్ విచారించాలని నిర్ణయం తీసుకుంది.
దిశ, డైనమిక్ బ్యూరో: కాళేశ్వరం కమిషన్ విచారణ (Kaleshwaram Project Inquiry) మళ్లీ ప్రారంభం అయింది. డిజైన్ మార్పులు, నిర్మాణంలో ప్రత్యక్ష సాక్షులైన ఇంజినీర్లతో పాటు.. పలువురు ఐఏఎస్‌లను కమిషన్ విచారించాలని నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలోనే విచారణలో భాగంగా ఇవాళ మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల వద్ద పనిచేసిన పలువురు డీఈలు, ఏఈలు కమిషన్ ఎదుట హాజరయ్యారు. నిర్మాణం, పనుల వివరాలపై కమిషన్ ఆరా తీసింది. మేడిగడ్డ (Medigadda) బ్లాక్ -7తో పాటు 3 బ్యారేజీల వర్క్ ప్లేస్ మెంట్ల రిజిస్టర్లను కమిషన్ స్వాధీనం చేసుకుంది.
ఫీల్డ్‌లో జరిగిన పనులకు సంబంధించి రిజిస్టర్లలో ఇంజినీర్ల సంతకాలను కమిషన్ తీసుకుంది. కుంగిన పిల్లర్లకు సంబంధించిన బ్లాక్ -7 రిజిస్టర్లపై సంతకాలు తీసుకుంది. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో క్వాలిటీ కంట్రోల్ రిజిస్టర్లు మిస్ అయినట్లు కమిషన్ గుర్తించింది. తొలి డ్యామేజీ 2020లోనే జరిగినట్లు గుర్తించి లేఖలు రాసినట్లు కమిషన్‌కు ఇంజినీర్లు చెప్పారు.
ముందే అనుకొన వచ్చి.. అసందర్భంగా సమాధానాలు చెప్పొద్దని కమిషన్ తెలిపింది. అడిగిన ప్రశ్నలకు మాత్రమే సమాధానం చెప్పాలని కమిషన్ వెల్లడించింది. ఇంజినీర్లపై కమిషన్ చైర్మన్ జస్టిస్ చంద్రఘోష్ (Justice Chandra Ghosh) అసహనం వ్యక్తం చేశారు. కాళేశ్వరం కమిషన్ చైర్మన్ జస్టిస్ పినాకి చంద్ర ఘోష్ దాదాపు 18 మంది ఇంజినీర్లను ప్రశ్నించారు.