Ponnam Prabhakar: వాళ్లందరినీ ఏకతాటి మీదకు తీసుకొచ్చిన గొప్ప వ్యక్తి మ‌న్మోహ‌న్ సింగ్

భారతదేశం గొప్ప ఆర్థిక వేత్తను, మహోన్నత వ్యక్తిని కోల్పోయిందని, భారత మాజీ ప్రధాన మంత్రి మ‌న్మోహ‌న్ సింగ్ మరణం దేశానికి తీరని లోటని మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు.

Update: 2024-12-27 15:53 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: భారతదేశం గొప్ప ఆర్థిక వేత్తను, మహోన్నత వ్యక్తిని కోల్పోయిందని, భారత మాజీ ప్రధాన మంత్రి మ‌న్మోహ‌న్ సింగ్ మరణం దేశానికి తీరని లోటని మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. శుక్రవారం ఢిల్లీలోని మన్మోహన్ సింగ్ పార్థివదేహానికి మంత్రి పొన్నం ప్రభాకర్ నివాళులర్పించారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ఈ సంద‌ర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. దేశ రూపురేఖలే మార్చేసిన ఆర్థిక సంస్కరణల రూపశిల్పి మన్మోహన్ సింగ్ అని వారి సేవలను కొనియాడారు. ద‌శాబ్ద పాలనలో విప్లవాత్మక నిర్ణయాలతో దేశాన్ని తిరుగులేని శక్తిగా మార్చారన్నారు.

ఉపాధి హామీ చట్టం, ఆహార భద్రత, సమాచార హక్కు చట్టం ఇలా ఎన్నో సంస్కరణలు చేసి దేశ రూపురేఖలు మార్చారని మంత్రి పొన్నం ప్రభాకర్ కొనియాడారు. మన్మోహన్ సింగ్ ప్రధానిగా ఉన్న సమయంలోనే 15వ లోకసభలో తాను పార్లమెంట్ సభ్యుడిని అని ఎన్నో సమావేశాల్లో ప్రధాని మన్మోహన్ సింగ్‌తో కలిసి పాల్గొన్నానని ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నారు. పార్లమెంట్‌లో ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర బిల్లు ప్రవేశపెట్టే సమయంలో నేతలందరినీ ఒక్కతాటి పైకి తీసుకురావడానికి సమావేశం ఏర్పాటు చేసి తెలంగాణపై తనకు ఉన్న అభిమానాన్ని చాటుకున్నారని గుర్తుచేశారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటులో కీలకపాత్ర వహించిన మన్మోహన్ సింగ్ ఇకలేరు అనే వార్త తీవ్రంగా కలిచి వేస్తుందని, తెలంగాణ ప్రజల గుండెల్లో మన్మోహన్ సింగ్ చిరస్థాయిగా నిలుస్తారని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు.


Read More..

గెహిస్ ఇమ్మిగ్రేషన్, ఇంటర్నేషనల్ లీగల్ సర్వీసెస్ కార్యాలయం ప్రారంభం 

Tags:    

Similar News