Raghunandan Rao: కేటీఆర్ బావమరిది విషయంలో సీఎం రేవంత్ రెడ్డిపై రఘునందన్ రావు ఫైర్
కేటీఆర్ బావమరిది విషయంలో సీఎం రేవంత్ రెడ్డిపై రఘునందన్ రావు ఫైర్ అయ్యారు.
దిశ, డైనమిక్ బ్యూరో: కాంగ్రెస్, బీఆర్ఎస్ రెండూ ఒకే తాను ముక్కలు అని ఎంపీ రఘునందన్ రావు (Raghunandan Rao) విమర్శించారు. లగచర్ల (Lagacharla incident), మల్లన్నసాగర్ (Mallanna Sagar) లలో భూసేకరణ, దళితులు, గిరిజనుల పట్ల ఈ రెండు పార్టీల విధానం ఒకే రకమన్నారు. ఒకరు అధికారంలో ఉంటే మరొకరు ప్రతిపక్షంలో ఉంటూ ఒకే రకమైన వైఖరితో నాటాకాలు చేస్తున్నారని దుయ్యబట్టారు. సోమవారం ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన ఆయన.. కేసీఆర్ కు రేవంత్ రెడ్డికి తేడా లేదన్నారు. లగచర్ల బాధితులకు న్యాయపరంగా సహకారం అందించడంతో పాటు 2013 భూసేకరణ చట్ట ప్రకారం వారికి పరిహారం అందే విధంగా బీజేపీ కృషి చేస్తుందని చెప్పారు.
2013 భూసేకరణ చట్టప్రకారం మల్లన్నసాగర్ నిర్వాసితులకు పరిహారం ఇవ్వాలని 48 గంటలు నిద్రచేసిన రేవంత్ రెడ్డి లగచర్లలో మాత్రం ఆ చట్టాన్ని ఎందుకు అమలు చేయలేకపోతున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. అధికారంలో ఉండగా 2013 చట్టం పనికిరాదంటూ బీఆర్ఎస్ ప్రభుత్వం అర్థరాత్రుల్లో అడ్డగోలు దాడులు చేసి మల్లన్న సాగర్ రైతులను ఖాళీ చేయిస్తే ఇప్పుడు లగచర్లలో రేవంత్ రెడ్డి కూడా లగచర్లలో అదే రకంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. రైతులను ఆధుకునేది తామేనని, 2013 చట్టాన్ని తామే తీసుకువచ్చామని ప్రచారం చేసుకునే కాంగ్రెస్ పార్టీ లగచర్ల ప్రజలపై దాడులు ఏరకంగా సమంజసమో ఆలోచన చేయాలన్నారు. లగచర్లలో రైతులపై దాడి, రాష్ట్ర ప్రభుత్వం భూసేకరణ విషయంలో అవలంభిస్తున్న విధానంపై రూల్ రూల్ 377 కింద పార్లమెంట్ లో నోటీసు ఇచ్చానన్నారు. పార్లమెంట్ వాయిదా పడటంతో రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని ఎండగట్టే అవకాశం సభలో దొరకలేదన్నారు. రాహుల్ గాంధీని ఢిల్లీలో భేటీ కాబోతున్న నేపథ్యంలో రేవంత్ రెడ్డి లగచర్ల ఘటనపై వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు.
మానుకోటలో డ్రామ:
అధికారంలో ఉన్న పదేళ్లు అడ్డగోలుగా భూసేకరణ చేసిన కేటీఆర్, బీఆర్ఎస్ ప్రభుత్వం ఇప్పుడు మానుకోటలో వెళ్లి డ్రామాలు చేస్తున్నాడని విమర్శించారు. మల్లన్నసాగర్ భూసేకరణ విషయంలో కుకునూరు పల్లి పోలీస్ట్ స్టేషన్ లో మహిళను గొంతుపిసికి నిర్భందించారని గుర్తు చేశారు. వంద ఎలుకలు తిన్న ఎలుక కాశీకి పోయిందన్న చందంగా కేటీఆర్ పరిస్థితి ఉందని ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ హాయంలో మల్లన్నసాగర్, రంగనాయకసాగర్, కొండపోచమ్మ ప్రాజెక్టుల కోసం దళితులు, బడుగు బలహీన వర్గాల భూములు లాకుంటుంటే ఈ కేటీఆర్ కంప్యూటర్ డబ్బాలు పట్టుకుని దావోస్ చుట్టూ తిరిగాడే తప్ప ఏ ఒక్క గ్రామానికి రాలేదన్నారు. ఇప్పుడొచ్చి మొసలికన్నీరు కారుస్తున్నాడని విమర్శించాడు. కాంగ్రెస్, బీఆర్ఎస్ లు అధికారంలో ఒక నీతి ప్రతిపక్షంలో మరొక నీతి అవలంభిస్తున్నారని దుయ్యబట్టారు.
రాజ్ పాకాలకు టెస్టు ఎందుకు చేయలేదో చెప్పు రేవంత్ రెడ్డి:
కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య ఎలాంటి స్నేహం లేకపోతే ఏ జన్వాడ ఫామ్ హౌస్ పార్టీ వ్యవహారంలో కేటీఆర్ బావమరిది రాజ్ పాకాలకు (Raj Pakala) ఎందుకు డ్రగ్స్ టెస్టు చేయడం లేదో సీఎం చెప్పాలని డిమాండ్ చేశారు. రేవంత్ రెడ్డి, కేటీఆర్ కు మధ్య అవినాభావ సంబంధం వల్లే డ్రగ్ టెస్టు చేయలేదన్నారు. ఇప్పటి వరకు డ్రగ్ టెస్టు చేయకపోవడం వెనుక తెలంగాణ పోలీసులు అంతర్యం ఏంటి ఈ రాష్ట్ర ప్రభుత్వ అంతర్యం ఏంటి అని నిలదీశారు. కొడంగల్ లో ఏర్పాటు చేయబోయే ఫార్మా కారిడార్ అని ఓ సారి పారిశ్రామిక కారిడార్ అని మరోసారి చెబుతున్నారని విమర్శించారు. రేవంత్ రెడ్డి ఏడాది పాలనలో ఒక నెల పాటు ఆయన ఢిల్లీకి తిరగడానికే సరిపోయిందని విమర్శించారు. తెలంగాణ ప్రజల సొమ్ముతో యూపీ నుంచి మహారాష్ట్ర వరకు హోర్డింగ్ లు ఫుల్ పేజీ ప్రకటనలను బీఆర్ఎస్ ఎలా ఇచ్చుకుందో ఇప్పుడు కాంగ్రెస్ కూడా అదే తరహాలో వెళ్తుందని ఆరోపించారు.