ఐపీఎల్‌లో ఈ సూచనలు అమలవుతాయా?
ఐపీఎల్‌లో పొగాకు, ఆల్కాహాల్‌కు సంబంధించి సరోగేట్ అడ్వర్టైజ్‌మెంట్స్‌ను నిషేధించాలని ఇటీవల బీసీసీఐ, ఐపీఎల్‌కు కేంద్ర

ఐపీఎల్‌లో పొగాకు, ఆల్కాహాల్‌కు సంబంధించి సరోగేట్ అడ్వర్టైజ్‌మెంట్స్‌ను నిషేధించాలని ఇటీవల బీసీసీఐ, ఐపీఎల్‌కు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ లేఖ రాసింది. మ్యాచ్‌లు జరిగే వేదికలు, ఐపీఎల్ ఈవెంట్స్, జాతీయ మీడియాలో కూడా ఇలాంటి ప్రకటనలను నిషేధించాలని బీసీసీఐ ప్రెసిడెంట్ రోజర్ బిన్నీ, ఐపీఎల్ చైర్మన్ అరుణ్ ధమాల్‌కు సూచించింది. ఆటగాళ్లు, కామెంటేటర్లు వాటితో సంబంధమున్న ప్రమోషన్లు చేయొద్దని కోరింది. పొగాకు మరణాల్లో ప్రపంచంలోనే భారత్ రెండో స్థానంలో ఉందని, అందుకోసం ఇలాంటి వాటికి దూరంగా ఉండాలని సూచించింది.
ఐపీఎల్‌లో ఓ జట్టు ఓ మద్యం కంపెనీ పేరుతోనే ఆడుతున్నది. ఆ జట్టుతో సోడా లేదా మంచినీళ్ల సీసాను ప్రమోట్ చేసేలా యాడ్స్‌ను రూపొందించారు. ఇలాంటి వాటి ద్వారానే అత్యధిక ఆదాయం పొందుతున్న బీసీసీఐ, ఐపీఎల్.. ఆరోగ్య మంత్రిత్వ శాఖ సూచనలు పాటిస్తాయా? అనే అనుమానం వ్యక్తమవుతున్నది.
సరోగేట్ అడ్వర్టైజింగ్..
భారతదేశంలో కేబుల్ టెలివిజన్ నెట్‌వర్క్స్ (రెగ్యులేషన్) చట్టం ప్రకారం ఆల్కహాల్, సిగరెట్లు, ఇతర పొగాకు ఆధారిత ఉత్పత్తుల ప్రకటనలపై నిషేధం విధించారు. దీంతో చట్టాలకు చిక్కకుండా, సరోగేట్ అడ్వర్టైజింగ్ ద్వారా ఆయా కంపెనీలు తమ ఉత్పత్తులకు ప్రచారం నిర్వహిస్తున్నాయి. గుట్కా ఉత్పత్తులను ప్రచారం చేయడం భారతదేశంలో చట్టరీత్యా నేరం. దీంతో విమల్, కమలా పసంద్ లాంటి కంపెనీలు పాన్ మసాలా, ఇలైచీ ముసుగులో మార్కెట్లోకి వచ్చి ప్రమోషన్ చేసుకుంటున్నాయి. నీళ్లు, సోడా ముసుగులో మద్యం కంపెనీలు తమ ప్రచారాన్ని నిర్వహించుకుంటున్నాయి. ఐపీఎల్, ఇతర క్రికెట్ మ్యాచ్‌ల మధ్యలో ఇలాంటి ప్రకటనలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. హీరో, హీరోయిన్లుగా చెప్పుకునే నటులు, స్పోర్ట్స్ స్టార్స్‌గా కీర్తించబడే చాలా మంది క్రీడాకారులు తమ సామాజిక బాధ్యతను మరిచి కేవలం డబ్బు సంపాదనే లక్ష్యంగా సరోగేట్ అడ్వర్టయిజింగ్‌లో పాలుపంచుకుంటున్నారనే విమర్శలు ఉన్నాయి. దీంతో సమాజానికి మేలు చేసే బదులు పరోక్షంగా కీడుకు కారణమవుతున్నారు.
దూరంగా ఉండాలని విజ్ఞప్తులు..
గుట్కా, మద్యం వంటి బ్రాండ్‌లకు సంబంధించి సరోగేట్ అడ్వర్టయిజింగ్‌కు దూరంగా ఉండాలని చాలామంది సినీ నటులు, క్రీడాకారులు, ప్రముఖులకు అనేక సంస్థల నుంచి విజ్ఞప్తులు వెళ్తున్నాయి. అయితే దీనిపై కొందరు స్పందిస్తుండగా.. మరికొందరు వినీ విననట్టు వ్యవహరిస్తున్నారు. పాన్ మసాలా ప్రకటనల్లో నటించవద్దని నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ టొబాకో ఎరాడికేషన్ (ఎన్ఓటీఈ) కోరడంతో అమితాబ్ బచ్చన్ పాన్ మసాలా బ్రాండ్ నుంచి తప్పుకున్నారు.
బెట్టింగ్స్ యాప్స్ సైతం..
ఐపీఎల్, ఇతర టోర్నీల్లో చాలా ఇన్ డైరెక్ట్ బెట్టింగ్ యాప్స్ సైతం ప్రమోట్ అవుతున్నాయి. ఈ ఆట వ్యసనంగా మారవచ్చు లేదా ఆర్థిక ప్రమాదం కూడా సంభవించవచ్చు. జాగ్రత్తగా ఆడండి..’ అంటూ ఓ వైపు హెచ్చరిస్తూనే.. ఫాంటసీ స్పోర్ట్స్ ప్లాట్ ఫామ్ డ్రీమ్ 11, మైసర్కిల్ 11, పోకర్ బాజీ వంటి సంస్థలు అనేక ప్రకటనలు ఇస్తున్నాయి. ఓ వైపు జూదంతో అప్పుల ఊబిలో కూరుకుపోయి యువత ఆత్మహత్యలు చేసుకుంటున్న వేళ.. ఇలాంటి యాడ్స్‌కు కూడా ఐపీఎల్, క్రికెట్ టోర్నీల్లో అవకాశమివ్వొద్దనే డిమాండ్ వినిపిస్తున్నది.
సచిన్ టెండూల్కరే ఆదర్శం
సమాజానికి నష్టం చేకూర్చే ప్రకటనల్లో నటించకుండా మిగతా క్రీడాకారులకు సచిన్ టెండూల్కర్ ఆదర్శం. ఆయన 90 దశకంలో పోగాకు, ఆల్కహాల్ కంపెనీలు ప్రమోట్ చేయాల్సి వస్తుందని రెండేళ్ల పాటు ఎలాంటి బ్యాట్ కాంట్రాక్ట్ లేకుండానే క్రికెట్ ఆడారు. ఇక ‘పాన్ మసాలా ప్రకటనలో నటించాలని ఆయనకు రూ. 20-30 కోట్లు ఆఫర్ చేసిన ఆయన ఒప్పుకోలేదు. నేటి తరం ఆయనను స్ఫూర్తి తీసుకోవాలి.
మహమ్మద్ ఆరిఫ్,
సీనియర్ జర్నలిస్ట్,
96184 00190