ఈ వివాదం ఎక్కడి వరకు వెళ్తుందో!?

జాతీయ విద్యా విధానంలో భాగమైన త్రిభాషా సూత్రంలో దేశవ్యాప్తంగా విద్యార్థులు హిందీ, ఇంగ్లిష్‌తో పాటు ఒక స్థానిక భాషను

Update: 2025-03-20 18:45 GMT
ఈ వివాదం ఎక్కడి వరకు వెళ్తుందో!?
  • whatsapp icon

జాతీయ విద్యా విధానంలో భాగమైన త్రిభాషా సూత్రంలో దేశవ్యాప్తంగా విద్యార్థులు హిందీ, ఇంగ్లిష్‌తో పాటు ఒక స్థానిక భాషను నేర్చుకోవాలని కేంద్ర ప్రభుత్వం పేర్కొన్నది. అయితే దీనిపై దక్షిణాది రాష్ట్రాల్లో.. ముఖ్యంగా తమిళనాడులో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. తమిళనాడు సీఎం స్టాలిన్ ఒక ముందడుగు వేసి రాష్ట్ర అధికారిక పత్రాల్లో హిందీలో ఉన్న రుపీ సింబల్‌ను తొలగించి తమిళ రుపీ సింబల్‌ను చేర్చడం చర్చనీయాంశంగా మారింది. 

త్రిభాషా సూత్రంలో దక్షిణాది రాష్ట్రాల్లో హిందీ భాషను బోధిస్తే.. మరి ఉత్తరాది రాష్ట్రాల్లో మూడో భాషగా ఏ లాంగ్వేజ్‌ను నేర్పిస్తారని అడగడం సైతం డిస్కషన్‌కు దారి తీసింది. హిందీ వల్ల ఉత్తర భారతంలో ఇప్పటికే 25 భాషలు కనుమరుగయ్యాయని స్టాలిన్ విమర్శించడం చాలా మందిని ఆలోచింపజేసింది. మరో భాషా పోరాటానికైనా తమిళనాడు ప్రజలు సిద్ధంగా ఉన్నారని స్టాలిన్ ప్రకటించడంతో.. ఇప్పుడు ఈ వివాదం ఎంతవరకు వెళ్తుందోననే ఆందోళన చాలా మందిలో కనిపిస్తున్నది.

ఎనిమిదో షెడ్యూల్‌లో...

భారతదేశానికి జాతీయ భాష లేదు. కేంద్ర స్థాయిలో హిందీ, ఇంగ్లిష్‌ అధికార భాషలుగా ఉన్నాయి. రాష్ట్రాల్లో ప్రాంతీయ భాషలను అధికార భాషలుగా ఉపయోగిస్తున్నారు. 1960 ప్రాంతంలో హిందీ భాషను ‘రుద్దడాన్ని’ తీవ్రంగా వ్యతిరేకిస్తూ దక్షిణాది రాష్ట్రాల్లో, మరీ ముఖ్యంగా తమిళ నాడులో పెద్దఎత్తున ఆందోళనలు పెల్లుబికాయి. ఆ తర్వాత 1963లో అధికార భాషల చట్టం వచ్చింది. అధికార లావాదేవీలన్నింటా హిందీతో పాటు ఇంగ్లిష్‌ను కూడా వినియోగించడం తప్పనిసరి చేస్తూ ఆ చట్టం తీసుకు వచ్చారు. తెలుగు, కన్నడం, తమిళం, మలయాళం, ఒడియా, గుజరాతీ, పంజాబీ, బెంగాలీ వంటి 22 భాషలను ఆయా ప్రాంతాల్లో అధికార భాషలుగా రాజ్యాంగంలోని ఎనిమిదో షెడ్యూల్‌ గుర్తించింది. హిందీ అధికార భాషగా లేని రాష్ట్రాలతో కేంద్రం ఇంగ్లిష్‌ లో ఉత్తరప్రత్యుత్తరాలు జరపాలని నిర్దేశిస్తూ 1967లో అధికార భాషల చట్టాన్ని సవరించారు.

మాతృభాషతోనే లాభం ..

పాకిస్తాన్ రెండు ముక్కలు కావడానికి, బంగ్లాదేశ్ దేశంగా ఆవిర్భవించడానికి ప్రధాన కారణం భాషేనన్న వాస్తవాన్ని దేశ పాలకులు మరిచిపోకుంటే బాగుంటుంది. భాష ప్రజల సంస్కృతిని ప్రతిబింబిస్తుంది. భారతదేశం బహుభాషా, బహుళ-మత గుణములు కలిగిన ఒక విశ్వ విఖ్యాత మైన దేశం. అంతేకాదు ఎవరికైనా మాతృ భాష అంటే మమకారం ఉంటుంది. భాష అనేది కేవలం భావాలు వ్యక్తం చేయడమే కాదు.. ఒక జాతి ఉనికిని, సంస్కృతిని, జీవన విధానాన్ని పరిచయం చేస్తుంది. మాతృభాష ఎంత గట్టిగా నేర్చుకుంటే దాని ద్వారా ఇతర భాషల్ని అంత గట్టిగా నేర్చుకోగలరని మెకంజి, వాకర్ లాంటి భాషా శాస్తవ్రేత్తలు ఎప్పుడో చెప్పారు. ఇతర భాషల కన్నా మాతృభాషలో నేర్చుకోగల సామర్థ్యం ఎక్కువగా ఉంటుందని సాథియాసీలన్, కీసర్ ఎట్ ఆల్ లాంటి పరిశోధకులు తేల్చి చెప్పారు.

దేశం విచ్ఛిన్నం కాకుండా..

స్వాతంత్ర్యానికి పూర్వం సైతం హిందీ భాషను బలవంతంగా రుద్దే ప్రయత్నాలు జరిగితే, దక్షిణాది రాష్ట్రాలన్నీ కలిపి ప్రత్యేక ద్రవిడనాడు ఏర్పాటు చేయాలనే డిమాండ్ కూడా వచ్చింది. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత కూడా దేశవ్యాప్తంగా అన్ని పాఠశాలల్లో హిందీని తప్పనిసరి చేసేందుకు ప్రయత్నాలు జరిగాయి. దేశంలో హిందీయేతర భాషలు మాట్లాడేవారు 60 శాతం మంది ఉంటే... హిందీ, దానికి దగ్గరగా ఉండే భాషలు మాట్లాడేవారు 40 శాతం మంది ఉంటారు. వాస్తవాలిలా ఉంటే హిందీ భాష మాత్రమే దేశాన్ని ఏకం చేయగలదనడం అవివేకం అవుతుంది. హిందీ భాషను నేర్చుకోవడం తప్పనిసరి చేసినా, ఉద్యోగావకాశాలను షరతుగా విధించినా మళ్లీ ఆందోళనలు చెలరేగే ప్రమాదముంది. అంతేకాకుండా హిందీ భాషపై తీవ్ర విముఖత పెరుగుతుంది. దేశం మనుగడకు ఒకే ఒక్క అధికార భాష ఉండాల్సిన అవసరం లేదు. ఏడున్నర దశాబ్దాలుగా భారతదేశం ఒకే ఒక్క అధికార భాషను అమలు చేయకుండా సైతం మనుగడలో ఉంది.

- ఫిరోజ్ ఖాన్,

ఫ్రీలాన్స్ జర్నలిస్ట్,

9640466464

Tags:    

Similar News