సమాజం గురించి పట్టించుకోరా..?
మానవ సమాజంలో జీవిస్తూ ఇక్కడి మనుషులతో సంబంధాలు కలిగి లేని సినిమా మనుషులకు మానవ చరిత్ర అంటే

మానవ సమాజంలో జీవిస్తూ ఇక్కడి మనుషులతో సంబంధాలు కలిగి లేని సినిమా మనుషులకు మానవ చరిత్ర అంటే శ్రమ సంబంధాల ద్వారా ఏర్పడ్డ సామాజిక జీవితమని ఎలా తెలుస్తుంది.! సినిమాల ద్వారా కోట్ల రూపాయలు కూడబెట్డుకొని అలా వచ్చిన డబ్బులతో సామాజిక గౌరవం సంపాదించుకొని అమాయక యువతను వారి వ్యాపార ప్రకటనల ద్వారా మత్తు పదార్థాలకు అలవాటు చేస్తూ, వారి వ్యాపార ప్రకటనల ద్వారా "బెట్టింగ్ యాప్"లకు అలవాటు చేస్తున్న సినిమా రంగం మనుషులను ఏమనాలి?
ప్రజలు ఏమైపోయినా పట్టించుకోరు..
ఇల్లు తగలబడి ఒకడుంటే బొగ్గులమ్మమని బేరగాడొచ్చినట్టు, తెలంగాణ సమాజంలో వ్యాపారస్తులను ఎంత నీచంగా పోల్చుతారని ఈ సామెత చెబుతుంది. వ్యాపారస్తులకు ఈ సమాజం కాలి బూడిదయినా పర్వాలేదు. వారికి కావల్సింది వారి వ్యాపారాలకు లాభాలు మాత్రమే. సినిమా వ్యాపారస్తులు కూడా అంతే.! సమాజం ఏమైనా కానీ దేశ ప్రజల జీవన విధానంతో, దేశ ప్రజల సెంటిమెంట్లతో వారికి సంబంధం కనబడదు. సమాజంలో జరిగే ప్రజా పోరాటాలతో, సమాజంలో జరిగే ఆత్మ గౌరవ సమస్యలతో, సమాజంలో హటాత్తుగా సంభవించే విపత్తులతో వారికి సంబంధం లేదు.
సినిమాలు తీసి డబ్బులు పోగేసుకొని..
భారత ప్రజలు స్వాతంత్య్రం కొరకు పోరాటాలు చేస్తూ ఉరికంబాలు ఎక్కుతుంటే సినిమా ప్రపంచపు చిత్రలోకపు చిత్రమైన మనుషులు సమాజంలో జరిగే ప్రతి సామాజిక ఉద్యమాన్ని పక్కకి పెట్టిన మానవత్వం లేని సినిమాలు తీసి డబ్బులు ఎలా సంపాదించాలని ఆలోచన చేస్తున్నారు. భూస్వామ్య భావజాల అగ్రకులాలతో సామ్రాజ్యవాద దేశాల సాంకేతికత మిలాఖతై పుట్టుకొచ్చిన రకరకాల రంగాలలో సినిమా రంగం ఒకటి. మనం ఇప్పుడు చర్చించుకోబోయేది ఈ అగ్రకుల భూస్వామ్య భావజాలం కల్గిన సినిమా రంగం గురించే.. సినిమా మనుషులు ఒక వింత ప్రపంచ మనుషులు. 1931 సంవత్సరమంటే ప్రపంచంలో చాలా దేశాలలో ప్రజాస్వామ్యం కోసం ప్రజలు పోరాటాలు చేస్తున్న రోజులు.. స్వాతంత్ర్య పోరాటంలొకి రాని ప్రజ సమూహాలు ఏవి లేవు. భారతదేశ ప్రజల్లో స్వాతంత్య్ర కాంక్ష బలంగా ఉండి చావుకు సిద్ధమై పోరాటాలు నిర్వహిస్తుంటే సినిమా మనుషులు ఇక్కడ సినిమాలు తీసి డబ్బులు పోగు చేసుకుని ప్రజలందరికి దూరంగా ఒక వింత ప్రపంచంలో ఎలా బతకాలని ఆలోచిస్తున్నారు.
సినీ జీవుల జాతే వేరు..
అగ్రకుల సినిమా మనుషులు అగ్రకులాలతో మాత్రమే సంబంధాలు కలిగి ఉన్నారు కానీ సమాజంలో మరే ఇతర కింది కులాలతో వీరికి ఎలాంటి సామాజిక పరమైన మానవీయ సంబంధాలు లేవు..! సినిమా మనుషులు సమాజంలో ఉండే ఇతర కులాల వారితో సామాజిక సంబంధాలు కొనసాగించడానికి అస్సలు ఇష్టపడరు. వీరు మద్రాసులో ఉన్నా, హైద్రాబాద్‌లో ఉన్నా ఒక ప్రత్యేకమైన ప్రదేశాలను ప్రత్యేకమైన స్థలాలను కేటాయించుకుని అక్కడ మాత్రమే స్థిర నివాసాలు ఏర్పాటు చేసుకున్నారు. వారి దృష్టిలో వారు ఉండేది భూలోకంలో కాదు ఇంద్రలోకంలో.. ఇంద్ర లోకంలో మానవులకు స్థానం లేనట్లే సినిమా వారు నివసించే ప్రాంతాల్లో సామాన్యులకు చోటు లేదు. మానవ ప్రపంచంలో నివసిస్తూ సమాజంలోని తోటి మానవులతో సామజిక సంబంధాలు కలిగి ఉండని మనుషులే ఈ సినిమా మనుషులు..! మానవులకు సమాజం గురించి నేర్చుకోవడానికి మించిన జ్ఞానం ఏముంటుందని సినిమా మనుషులకు ఎలా చెప్పగలం?
గుండమల సత్యనారాయణ
89199 98619