డీలిమిటేషన్‌కి మధ్యే మార్గమే పరిష్కారం..!

తమిళనాడు సీఎం స్టాలిన్ డిలిమిటేషన్ వల్ల ఎంపీ సీట్లు తగ్గి దక్షిణాది రాష్ట్రాలకు తీవ్ర అన్యాయం జరుగుతున్న వాదనపై

Update: 2025-03-28 01:00 GMT
డీలిమిటేషన్‌కి మధ్యే మార్గమే పరిష్కారం..!
  • whatsapp icon

తమిళనాడు సీఎం స్టాలిన్ డిలిమిటేషన్ వల్ల ఎంపీ సీట్లు తగ్గి దక్షిణాది రాష్ట్రాలకు తీవ్ర అన్యాయం జరుగుతున్న వాదనపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పందిస్తూ దక్షిణాది రాష్ట్రాలకు ఇప్పుడున్న సీట్లకు ఒక్క సీటు కూడా తగ్గదని చెప్పారు. కానీ జనాభా నియంత్రణ సరిగ్గా చేయని ఉత్తరాది రాష్ట్రాలలో సీట్లు పెంచం అని కూడా చెప్పలేదు. అయితే, జనాభా దామాషా ప్రకారం నియోజకవర్గాల సంఖ్య పెంచితే దక్షిణాది రాష్ట్రాలకు తీవ్రమైన అన్యాయం జరుతుందనేది వాస్తవం. 

స్వాతంత్య్రానంతరం జరిగిన మొదటి జనగణన 1951 ప్రకారం భారతదేశ జనాభా దాదాపు 36 కోట్లు.. 2011 జనాభా లెక్కల ప్రకారం దేశ జనాభా 121 కోట్లు.. దాదాపు 3 - 4 రెట్ల జనాభా పెరిగింది. మొదటి సార్వత్రిక ఎన్నికల్లో 489 లోక్‌సభ స్థానాలుంటే 18వ లోక్‌సభ (2024) సార్వత్రిక ఎన్నికల వరకు 543 స్థానాలకి పరిమితమైంది. 1976 లో డీలిమిటేషన్ జరిగినప్పటికీ నియోజకవర్గాల సంఖ్యలో మార్పు లేకుండా మరో 25 ఏండ్ల వరకు నాటి కాంగ్రెస్ ప్రభుత్వం చట్టం చేసింది.

నియోజకవర్గాల పెంపు..

అసలు సమస్య ఈ నియోజకవర్గాల పెంపు వద్దే మొదలైంది. ఉత్తర భారతంలోని రాష్ట్రాలు పేదరికం, నిరక్ష రాస్యత వల్ల కుటుంబ నియంత్రణ సమర్థవంతంగా పాటించకపోవడం వల్ల అధిక జనాభాను కలిగివున్నాయని జనాభా నియంత్రణలో ముందున్న దక్షిణాది రాష్ట్రాల జనాభా, ఉత్తరాది రాష్ట్రాల జనాభాతో పోల్చితే తక్కువ కాబట్టి నియోజకవర్గాల పెంపు జనాభా దామాషా ప్రకారం జరిగితే దక్షణాది రాష్ట్రాలకు ఎంపీ సీట్లు తగ్గి పార్లమెంటులో ప్రాతినిధ్యం తగ్గుతుందనే అనుమానాల్ని దక్షిణాది పార్టీలు, నాయకులు వ్యక్తం చేస్తున్నారు.

ప్రతి రాష్ట్రానికి సమ ప్రాతినిధ్యం

పార్లమెంట్‌లో ప్రతి రాష్ట్రానికి, కేంద్ర పాలిత ప్రాంతానికి సముచిత ప్రాతినిధ్యం ఉన్నపుడే తమ రాష్ట్రాల/ప్రాంతాల హక్కుల్ని తాము కాపాడుకోగలవు. తమకు కావాల్సిన నిధుల్ని కేంద్రం నుండి రాబట్టుకోగలవు.1991 నుండి 2001 వరకు, 2001 నుంచి 2011 వరకు జన గణన ప్రకారం భారతదేశ వృద్ధి రేటును గమనిస్తే సగటున 12.5 దశాబ్ద వృద్ధి రేటుతో 2011 నుండి 2026 వరకు దేశ జనాభా 121 కోట్ల నుండి 145 కోట్ల వరకు చేరే అవకాశం ఉంటుంది. సగటున 15-20 లక్షల ఓటర్లకు ఒక లోక్‌సభ నియోజక వర్గాన్ని తీసుకున్నా దాదాపు 815 వరకు పెరుగుతాయి.

కేంద్రం, దక్షిణాది రాష్ట్రాలు సమన్వయం, ఏకాభిప్రాయంతో మధ్యే మార్గంగా ఇపుడున్న నియోజకవర్గాలు దేశవ్యాప్తంగా 25% పెంచితే 680 సీట్లు, 50% పెంచితే 815 లోక్‌సభ సీట్లు అవుతాయి.. దక్షిణాది రాష్ట్రాలకు ఇప్పుడున్న 130 స్థానాలకు అదనంగా మరో 65 పెరిగి 195 సీట్లు అవుతాయి.. ఉత్తరాది రాష్ట్రాలకు 413 స్థానాలకు మరో 207 పెరిగి 620 సీట్లు అవుతాయి.. 543 స్థానాలున్న లోక్ సభలో అధికారాన్ని చేపట్టేందుకు మేజిక్ ఫిగర్ సంఖ్య 272 అయినపుడు 815 సీట్లకు 408 సీట్లు అవుతాయి..

ఎంపీ సీట్ల పెంపులో హేతుబద్ధత

జనాభా దామాషా ప్రకారం కాకుండా ఒక నిర్దిష్ట శాతం ప్రాతిపదికన ఎంపీ సీట్ల పెంపు జరిగినప్పుడు, ఇప్పుడు దక్షిణాది రాష్ట్రాలు ఏ విధంగానైతే లోక్ సభలో ప్రాతినిధ్యం కలిగివున్నాయో అదే 24% శాతంతో డీలిమేటేషన్ జరిగిన తర్వాత కూడా ప్రాతినిధ్యం వహించే అవకాశం ఉంటుంది. ఇక్కడ సంఖ్య మారినా/పెరిగినా ప్రాతినిధ్యం వహించే శాతం మారకుంటే ఉత్తర, దక్షిణ భారత రాష్ట్రాల మధ్య ఉన్న భేదాభిప్రాయాలు కొంత వరకు తగ్గే అవకాశం ఉంటుంది. కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు సమాఖ్య స్ఫూర్తిని కొనసాగిస్తూ రాజ్యాంగ బద్దంగా వ్యవహరించి దేశ ప్రజల మధ్య ఉత్తర, దక్షిణ భారతమన్న భేద భావాలు లేకుండా ఈ సమస్య త్వరితగతిన పరిష్కరించాలని ఉంది.

డా. అశోక్ మంద

99590 46499

Tags:    

Similar News