కథల గనిలో మెరిసిన మిడ్కో

ఆ మిణుగురు పువ్వు ఎన్నటికీ వాడిపోదు. ఆ కాంతులు తెలుగు విప్లవ కథా చరిత్రలో దేదీప్యమానంగా నిలిచిపోతాయి.

Update: 2025-04-02 01:15 GMT

 ఆ మిణుగురు పువ్వు ఎన్నటికీ వాడిపోదు. ఆ కాంతులు తెలుగు విప్లవ కథా చరిత్రలో దేదీప్యమానంగా నిలిచిపోతాయి. మిడ్కో అనే గోండీ పదం తెలుగు విప్లవ సాహితోద్యమానికి అత్యంత సన్నిహితమై, దేశీయ గుబాళింపులను అద్దుతూనే ఉంటుంది. గుమ్మడవెల్లి రేణుక 'మిడ్కో' అనే పేరుతో కథలు రాయడం వెనుక అత్యద్భుతమైన రాజకీయ సాంస్కృతిక పరిణామం ఉన్నది.

 తెలుగు కథకు దండకారణ్యం ఒక కాల్పనిక గనిగా మారడం వల్ల ఆమె అలాంటి కథలు రాసింది. విప్లవంలో మానవ వ్యక్తిత్వ వికాసాలను కథలుగా చెప్పగల సాంస్కృతిక స్థాయికి రేణుక చేరుకోవడమే దీనికి గీటురాయి.

విప్లవ కాల్పనికతకు కేంద్రం

జి. రేణుకాదేవి అనే పేరుతో ఆమె మొదట్లో కథలు రాసేది. ‘భావుకత’ అనే తొలి కథ 1994 జూలై సంచికలో 'ఆహ్వానం' మాస పత్రికలో అచ్చయింది. ఆ తర్వాతి కథ ‘మార్పు ఎవరిలో’ 1995 జనవరి-జూన్‌ 'మహిళా మార్గం' పత్రికలో అచ్చయింది. తొలి దశలో రాసిన కథలన్నీ సుమారుగా మహిళా మార్గం పత్రికలో వచ్చాయి. ఆమె స్వతహాగా పట్టణ, మధ్య తరగతికి చెందినది కావడం వల్ల మొదట్లో అలాంటి కథలే రాసింది. నేపథ్యం, పాత్రలు ఆమెకు సుపరిచితమైనవే అయినా అప్పటికే ఆమెకు పట్టుబడుతున్న విప్లవ, ప్రజాస్వామిక చైతన్యంతో ఆ కథలు రాసింది. ఆ తర్వాత కార్యరంగం పట్టణ మహిళా ఉద్యమం నుంచి అజ్ఞాత విప్లవోద్యమం దాకా విస్తరించింది. దీనితో ఆమె కథా వస్తువు కూడా మారిపోయింది. మిడ్కో అనగానే గుర్తుకు వచ్చే ‘మెట్ల మీద’ అనే కథ కూడా ఆమె తొలి దశలోనే రాసింది. అప్పటికే విప్లవాన్ని ఒక సుదీర్ఘమైన విలువల క్రమంగా స్వీకరించింది. అలుపెరుగుని ఆచరణగా అర్థం చేసుకుంది. 2001 సెప్టెంబర్‌- అక్టోబర్‌ అరుణతార సంచికలో ఈ కథ అచ్చయింది. 2005లో విప్లవోద్యమంలోకి వెళ్లాక మిడ్కోగా మారిపోయింది. ఈ రెండో దశ మిడ్కో కథలకు ఒక చారిత్రక ప్రాధాన్యత ఉన్నది. అది తెలుగు కథా చరిత్రకు సంబంధించిందే కాదు. మొత్తంగా విప్లవోద్యమానికి సంబంధించి కూడా. చాలా వేగంగా, సంక్లిష్టంగా మారుతున్న సామాజిక చలనాలను మిడ్కో దండకారణ్య పోరాటాల వెలుగులో చూసి కథలు రాసింది. ఈ దశ ప్రజా పోరాటాలను చాలా భిన్నంగా లోపలి నుంచి రేణుక పరిశీలించింది. వ్యక్తమవుతున్న జీవితం వెనుక అవ్యక్తంగా ఉన్న వాస్తవికతను ఎత్తి చూపడమే సాహిత్యం పని అని గ్రహించింది.

ఆ కథలు ఇలానే అర్థమవుతాయ్

మిడ్కో 2005 నుంచి ఇప్పటి దాకా అంటే సుమారు ఇరవై ఏళ్లలో రాసిన కథలన్నీ సుమారుగా విప్లవోద్యమం లోపలి పరిణామాలను చిత్రించినవే. దేశ ప్రజలందరి మీద అణచివేత తీవ్రమైన ఈ వర్తమాన యుద్ధ వాతావరణంలో 2025 మార్చి 31న ఆమె తన పాఠకులకు, మిత్రులకు దూరమైపోయింది. ఇది ఆధునిక భారతదేశ చరిత్రలో చాలా కీలకమైన మూల మలుపును సూచిస్తోంది. ఈ పరిణామాలన్నీ 2005లోనే మొదలయ్యాయి. సాధారణ మానవ జీవితంలో అంతకు ముందుకంటే తీవ్రమైన విధ్వంస రూపాలు అప్పుడే మొదలయ్యాయి. 2014 నాటికి మరింత తీవ్రమయ్యాయి. ఈ పరిణామాలతో నిమిత్తం లేకుండా రేణుక కథలను అర్థం చేసుకోలేం.

అట్టడుగు వాస్తవికతకు అద్దంపట్టి..

బైటికి స్పష్టాస్పష్టంగా కనిపించే ఈ పరిణామాలను మిడ్కో కథలుగా విడమర్చి చెప్పింది. కేవలం ఒకానొక ఘటనను కాల్పనీకరించి కథ చేసి రేణుక సరిపెట్టుకోదు. ఈ కథ స్థలకాలాల చారిత్రక స్వభావాన్ని గ్రహించి, దాని అంతరార్ధాలను వెలికి తీయడానికి ఆమె ప్రయత్నిస్తుంది. ఈ ఇరవై ఏళ్ల సామాజిక, ఉద్యమ పరిణామాల అట్టడుగు వాస్తవికత చాలా వరకు రేణుక కథల్లో కనిపిస్తాయి. దానిని చెప్పడమే ఆమె కథన వస్తు శిల్ప సమ్మేళనం. దీనితో విడదీయలేని దృక్పథాన్ని ఆమె ప్రజా ఆచరణలోంచి స్వీకరించింది. అందువల్ల పైకి విధ్వంసంగా కనిపించే ఘటనలు, పరిణామాలు రేణుక కథల్లో నిర్మాణంగా కనిపిస్తాయి. బైటికి కనిపించే ‘హింస’ దాపున ఉండే మానవీయత, ప్రేమ, సజ్జన స్వభావం మిడ్కో కథలు వివరిస్తాయి.

తన కాలపు కథా రచయిత్రి

మిడ్కో అనే పదమే దండకారణ్యానికి సంబంధించింది కాబట్టి, ఆ సువిశాల ప్రాంతపు పోరాట వికాసాన్నంతా ఆటుపోట్ల మధ్యనే ఆమె కథల్లో చదువుకోవచ్చు. సల్వాజుడుం, ఆపరేషన్‌ గ్రీన్‌హంట్‌ కాలాల్లో ఆమె మిడ్కోగా మారి, ఆ కాలపు కథలను తెలుగు పాఠకులకు అందించింది. ముఖ్యంగా తీవ్రమైన రాజకీయ, సైనిక సంఘర్షణలను మానవ సంబంధాల వైపు నుంచి రాయడం వల్ల సగటు పాఠకుల దగ్గరికి కూడా ఆమె తాను ఎంచుకున్న ఇతివృత్తాన్ని చేర్చగలిగింది. ఆమె రాసిన 36 కథల్లో సగం మైదాన ప్రాంత, మధ్య తరగతి, శ్రామిక ప్రజల ఇతివృత్తాలు ఉంటే మిగతావన్నీ యుద్ధకాలపు కథలని చెప్పవచ్చు. 2007లో ‘మెట్ల మీద’ అనే పేరుతో కథా సంపుటి వచ్చే నాటికే ఆమె కథకురాలిగా తెలుగు పాఠకుల గుర్తింపు పొందింది. అప్పటికే ఆమె దండకారణ్య విప్లవోద్యమంలో భాగమైంది. ఆ తర్వాత రాసిన కథలు ఇటీ వల విడుదలైన ‘వియుక్క’ ఆరు సంపుటాల్లో భాగమయ్యాయి.

ముగింపు లేని మిణుగురు

1990లలో స్త్రీవాదం గట్టిగా వినిపిస్తున్న రోజుల్లో విప్లవ మహిళా ఉద్యమంలోకి వచ్చిన రేణుక స్త్రీల విముక్తిని మాన వాళి విముక్తిలో భాగం అని గ్రహించింది. దాని కోసం అనేక ఉద్యమాలు చేయడమేగాక రచనలు చేసింది. ఈ క్రమమంతా సాగిన మిడ్కో తన జీవితంతో కూడా ఎన్నో ప్రయోగాలు చేసింది. ఉజ్వలమైన తెలుగు కథా చరిత్రలో మిరమిట్లు గొలిపే ఈ మిణుగురు పువ్వును క్రూరమైన కాలం భరించలేకపోయింది. ఆ వెలుగును చూసి సహించలేకపోయింది. ఇప్పుడు ఆమె ఇక కథలు రాయలేకపోవచ్చు. అద్భుతమైన పోరాట కథలా, ముగింపు లేని గాథగా మిగిలే ఉంటుంది.

(ఛత్తీస్‌గఢ్‌లో సోమవారం జరిగిన ఎన్‌కౌంటర్‌లో మృతి చెందిన మావోయిస్టు నేత రేణుక అలియాస్ మిడ్కో స్మృతిలో...)

- పాణి,

విరసం

98661 29458 

Tags:    

Similar News