ఈ విద్యా సంస్థల దందా ఎన్నాళ్లు?

తెలంగాణ రాష్ట్రంలో ప్రైవేటు కార్పొరేట్ విద్యా సంస్థల దందా మూడు పువ్వులు ఆరు కాయలు అన్నట్టుగా సాగుతుంది.

Update: 2025-03-28 00:45 GMT
ఈ విద్యా సంస్థల దందా ఎన్నాళ్లు?
  • whatsapp icon

తెలంగాణ రాష్ట్రంలో ప్రైవేటు కార్పొరేట్ విద్యా సంస్థల దందా మూడు పువ్వులు ఆరు కాయలు అన్నట్టుగా సాగుతుంది. పర్మిషన్ లేకుండా గల్లీకొక కార్పొరేట్, ప్రైవేటు పాఠశాలలు, కళాశాలలు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్న వాటికి ఇంటర్ బోర్డు అధికారులు వత్తాసు పలుకుతున్నారు. విద్యా సంవ త్సరం ప్రారంభానికి ఆరు నెలల ముందు నుంచే దాదాపు 80 శాతానికి పైగా అడ్మిషన్స్ తీసుకుంటూ 60 శాతానికి పైగా ఫీజులు వసూలు చేస్తూ నియమ నిబంధనలు పాటించకుండా వివిధ కోర్సుల పేరుతో విద్యార్థులను, తల్లిదండ్రులను మభ్యపెడుతున్న పట్టించుకునే నాధుడే లేడు. ర్యాంకుల పేరుతో విద్యార్థులకు గంటలు తరబడి బట్టి చదువులతో మానసికంగా, శారీరకంగా ఒత్తిడిలకు గురిచేస్తూ నాణ్యత లేని విద్య అరకొర వసతులతో అరిగోస అనుభవిస్తున్న విద్యార్థులను పట్టించుకోవడం లేదు.

ఉక్కు పాదం ఎక్కడ?

రాష్ట్రంలో సరస్వతీ నిలయాల్లా విరజిల్లాల్సిన విద్యాసంస్థలు.. స్మశాన వాటికల్లా దర్శనమిస్తున్న దుస్థితి. గత ప్రభుత్వంలో అనేకమంది విద్యార్థులు అధికారులు ప్రభుత్వాన్ని నిర్లక్ష్యం వల్ల పలు కారణాలతో ఆత్మహత్యలు చేసుకుని మరణించిన సంఘటనలు ఎన్నో ఉన్నాయి. ఈ ప్రభుత్వంలోనైనా విద్యార్థుల ఆత్మహత్యలకు అడ్డుకట్ట వేస్తారనుకుంటే విద్యార్థులు ఇప్పుడు కూడా ప్రాణాలు కోల్పోతున్నా విద్యార్థుల ఆత్మహత్యలపైన కనీస న్యాయ విచారణ కానీ, పర్యవేక్షణ కమిటీని కానీ నియమించాలని కనీస సోయి ప్రభుత్వానికి లేదు. విద్యాసంస్థల ప్రారంభంలో కార్పొరేట్ ప్రైవేటు విద్యాసంస్థల అక్రమాలపైన సర్కార్ ఉక్కుపాదం అని అట్టహాసంగా స్టేట్మెంట్స్ ఇచ్చారు కానీ, ప్రైవేట్ కార్పొరేట్ విద్యాసంస్థలలో ఫీజుల దోపిడీతో యాజమాన్యాలు పెడుతున్న ఒత్తిడికి గురై ఆత్మహత్యలు చేసుకుని రోజూ ఒక ప్రాణం పిట్టల్లా రాలిపోతున్నా కనీసం పట్టించుకోకపోవడం శోచనీయం. ఆ మధ్య ఉమెన్ కమిషన్ చైర్మన్... నారాయణ, శ్రీ చైతన్య కళాశాలల్లోకి మీడియాతో వెళ్లి అక్కడ ఉన్న సమస్యల గురించి ప్రెస్ మీట్ పెట్టి హడావిడి చేశారు తప్ప ఏ కళాశాల యాజమాన్యం పైన చర్యలు తీసుకుంది లేదు. సమస్యలు పరిష్కరించింది లేదు.

ఫీజు నియంత్రణ ఊసే లేదు..

గత ప్రభుత్వం ఫీజుల నియంత్రణ కోసం 2017లో ప్రొఫెసర్ తిరుపతిరావు నేతృత్వంలో కమిటీని వేసింది. ఏడాదికి 10% ఫీజు పెంచుకోవాలని ఆ కమిటీ సిఫార్సులు కూడా చేసింది. అయితే ఆ కమిటీ నివేదిక ఇప్పటికే ప్రభుత్వం ఆధీనంలోనే ఉంది కానీ అమలుకు నోచుకోలేదు. ప్రస్తుత ప్రభుత్వం కూడా ఫీజు నియంత్రణ కమిటీ వేస్తామని చెప్పి దానిపైన ఇప్పటికే ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. అలాగే విద్యాహక్కు చట్టం -2009 ప్రకారం పేద విద్యార్థులకు 25% సీట్లు కేటాయించాలి. కానీ ఆ నియమాన్ని పాటించడం లేదు. పైగా డొనేషన్లు అడ్మిషన్స్, బుక్స్ యూనిఫామ్స్ పేరుతో లక్షలు వసూలు చేస్తూ పేద విద్యార్థుల రక్తాన్ని జలగల్లా పీడిస్తున్నారు. ప్రభుత్వాలు చర్యలు తీసుకోకపోతే ఆ కళాశాలల తీరు మారెదెన్నడు? విద్యారంగం బాగుపడేది ఎప్పుడు?

- చింతకాయల ఝాన్సీ,

ఏబీవీపీ

93819 21216

Tags:    

Similar News