తెలుగు కథకు దక్కిన గౌరవం..

తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వ రిజిస్ట్రేషన్ డిపార్టుమెంటులో అధికారిగా పనిచేస్తూ, నేను రాసిన ఆనందం

Update: 2025-03-31 01:00 GMT
తెలుగు కథకు దక్కిన గౌరవం..
  • whatsapp icon

తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వ రిజిస్ట్రేషన్ డిపార్టుమెంటులో అధికారిగా పనిచేస్తూ, నేను రాసిన ‘ఆనందం’ అనే కథల పుస్తకానికి 2014లో కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు అందుకున్నాను. ‘ఆనందం’ కథల సంపుటిని షోలాపూర్‌కు చెందిన బుధారం రేణుక ‘ఆనంద’ పేరున మరాఠీ లోనికి అనువాదం చేశారు. ఆ పుస్తకంలోని ‘ఆనంద’ అనే మొదటి కథను మహారాష్ట్రలోని సోలాపూర్ యూనివర్సిటీలో BA డిగ్రీ మొదటి సంవత్సరం విద్యార్థులకు పాఠ్యాంశంగా తీసుకున్నారు.

'ఆనందం' కథా పరిచయం

సులక్షణుడు అనే వ్యక్తి పల్లెటూళ్ళో మగ్గం నేస్తూ, తన భార్యా బిడ్డలతో ఆనందంగా, ప్రశాంతంగా జీవిస్తుంటాడు. అతని మామ ధనంజయుడు తనతో వచ్చి, నగరంలో ఏదైనా వ్యాపారం చేసుకోమంటాడు. దానికి సులక్షణుడు ‘మనిషికి ధన సంపాదన కాదు ఆనందంగా జీవించడమే ముఖ్యం’ అంటాడు. దానికి అతని మామ, డబ్బు సంపాదించడం చేతకాని ప్రతివాడూ ఇలాగే మాట్లాడతాడు అనడంతో సులక్షణుడు పౌరుషంగా నగరం చేరి, తన తెలివి తేటలతో మామను మించి సంపాదించి, అదంతా తృణప్రాయంగా మామ పరం చేసి, తాను తిరిగి పల్లెటూరు చేరుతాడు. ఆచరణీయం కానీ ఆదర్శాలు ఆకర్షించవు. మనిషికి ధనం పట్ల మోజు, ఆశ అనేవి చాలా సహజం. ఆ రెండూ శృతి మించినప్పుడు మనిషిని ఆనందానికి దూరం చేస్తాయి. జీవితంలో నిజమైన సుఖం అంటే ఏమిటి? ఆనందం అంటే ఏమిటి? అని ఈ కథ చర్చిస్తుంది.

24 భారతీయ భాషల్లోకి అనువాదం

ఈ ‘ఆనందం’ పుస్తకాన్ని కేంద్ర సాహిత్య అకాడమీ ఈ మధ్యనే 24 భారతీయ భాషల లోనికి అనువాదం చేయడానికి నిర్ణయించి, తొలుత పారనంది నిర్మల గారిచే హిందీ అనువాదం పూర్తి చేయించి ప్రచురించింది. గతంలో కూడా మహారాష్ట్ర ప్రభుత్వ పాఠ్యపుస్తక నిర్మాణం, పాఠ్య ప్రణాళిక పరిశోధనా సంస్థ డా.దాసరి వెంకటరమణ రాసిన ‘వేగుచుక్క’ అనే కథను యువభారతి పన్నెండో తరగతి పుస్తకంలోనూ, ‘పల్లెకు పోదాం’ అనే కథను బాలభారతి ఎనిమిదో తరగతి పుస్తకంలోనూ, చేర్చారు.

చందమామ కథలపై పీహెచ్‌డీ

ఈ మధ్యే ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ‘చందమామ కథలు వ్యక్తిత్వ వికాసం’ అంశంపై పీ.హెచ్.డీ చేసి, డాక్టరేట్ పట్టా పుచ్చుకున్నాను. నా మరో పుస్తకం ‘అమ్మ మనసు’ తెలుగు యూనివర్సిటీ అవార్డు పొందింది. ఇప్పటి వరకు దాదాపు ఇరవై వేల కాపీలు అమ్ముడు పోయింది. ‘మా కే మన్’ పేరున హిందీ లోనికి అనువాదం అయ్యింది.

స్థిరాస్తి కొనుగోలుపై సంచలన వీడియో

తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వ రిజిస్ట్రేషన్ డిపార్టుమెంటులో పనిచేస్తూనే నేను గతంలో, స్థిరాస్తి కొనుగోలు చేసే ప్రజల ఉపయోగం నిమిత్తం, రచన, దర్శకత్వం వహించిన ‘జాగ్రత్త.....స్థిరాస్తి కొనేముందు’ అనే షార్ట్ ఫిల్మ్ స్థిరాస్తి కొనుగోలు చేసే ముందు ప్రజానీకం తీసుకోవాల్సిన అనేక జాగ్రత్తలను చెబుతుంది. పదిహేను నిముషాల నిడివి ఉండే ఈ షార్ట్ ఫిల్మ్ తెలంగాణా రిజిస్ట్రేషన్ డిపార్టుమెంట్ అధికారిక వెబ్ సైట్ లోనూ, యూ ట్యూబ్ లోనూ చూడవచ్చు. ఒక్క యూట్యూబ్‌లోనే ఈ వీడియోను ఇప్పటి వరకు దాదాపు 17 లక్షల మందికి పైగా వీక్షించారు.

నేను రాసిన ఆనందం పుస్తకానికి కేంద్ర సాహిత్య అవార్డుతో పాటు 24 భారతీయ భాషల్లోకి ఈ పుస్తకం అనువాదం అవుతుండడం నా రచనా జీవితానికి సార్థకత కలిగించిన క్షణంగానే చెప్పాలి. నా కథలను దశాబ్దాలుగా ఆదరించిన పాఠకులకు, అపూర్వ గౌరవంతో సత్కరించిన కేంద్ర సాహిత్య అకాడెమీకి సవినయంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.


డా. దాసరి వెంకట రమణ

చందమామ కథారచయిత,

బాలసాహిత్య పరిషత్ పూర్వ అధ్యక్షుడు

90005 72573

Tags:    

Similar News