నిజం పునాదులు కదిలిస్తున్న గ్రోక్
ఎలన్ మస్క్ నిర్వహిస్తున్న ఎక్స్ సంస్థ ఏఐ సహాయంతో అభివృద్ది చేసిన 'గ్రోక్ 3' నిజానికి ఒక కృత్రిమ మేధ చాట్ బాట్
ఎలన్ మస్క్ నిర్వహిస్తున్న ఎక్స్ సంస్థ ఏఐ సహాయంతో అభివృద్ది చేసిన 'గ్రోక్ 3' నిజానికి ఒక కృత్రిమ మేధ చాట్ బాట్. గత కొన్ని వారాలుగా, గ్రోక్ సామాజిక మాధ్యమ వేదికలపై, ముఖ్యంగా ఎక్స్‌లో ఒక అగ్ని పర్వతాన్ని రగిలించింది. దాని స్పష్టమైన, సమాధానాలతో రాజకీయ పార్టీల బలమైన ప్రచార యంత్రాంగాన్ని కలవరపరుస్తుంది. గ్రోక్ పార్టీల నిజాలను బహిర్గతం చేస్తూ, పార్టీలను కదిలిస్తోంది. ఇది కృత్రిమ మేధ సృష్టించిన స్వేచ్ఛా వాక్కు.
భారతదేశంలో రాజకీయ శక్తుల కలయిక గురించి ఇది కీలక ప్రశ్నలను లేవనెత్తుతోంది. గ్రోక్ నిజంగా ఒక విచ్ఛిన్న కర్తనా! లేక కేవలం ఒక తాత్కాలిక డిజిటల్ తుఫాన్ మాత్ర మేనా? అని ప్రపంచ మేధావులకు ప్రశ్నగా మిగిలింది. గ్రోక్ నిజంగా 'నిజాలను బహిర్గతం' చేస్తోందా, లేక అది దానికి అందించిన ధ్రువీకృత సెంటిమెంట్‌లను కేవలం పునరావృతం చేస్తోందా?అనే ఓ కీలక ప్రశ్నను లేవనెత్తుతుంది.
ఆ పార్టీ గుట్టును బయటపెడుతూ..
దశాబ్ది కాలంగా చెలరేగుతున్న బీజేపీ డిజిటల్ ఆధిపత్యాన్ని 'గ్రోక్' అనే ఏఐ బుల్డోజర్ పునాదులతో సహా సమూలంగా కూల్చివేయనుందా? దశాబ్ది కాలంలో ప్రజలను ఏమార్చిన బీజేపీ గుట్టు గ్రోక్ రట్టు చేస్తుంది. స్పష్టమైన, స్క్రిప్ట్ లేని సమాధానాలను అందించే ఏఐగా ప్రారంభమైన గ్రోక్ త్వరలోనే ప్రధాని నరేంద్ర మోడీ, బీజేపీల విమర్శకులకు అత్యంత ఇష్టమైనదిగా మారింది. మోడీని 'పీఆర్ యంత్రం' అని గ్రోక్ పిలిచింది. ఆయన నాయకత్వ ప్రతిభను 2002 గుజరాత్ అల్లర్లతో ముడిపెట్టింది. రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్‌ఎస్‌ఎస్) భారత స్వాతంత్ర్య సంగ్రామంలో నిర్వహించిన పాత్ర నామమాత్రమేనని తోసిపుచ్చింది. బీజేపీ ఐటీ సెల్ గురించి అడిగినప్పుడు, అది ఆన్‌లైన్ దాడులకు ప్రసిద్ధి చెందినదని, బీజేపీ విశ్వసనీయతను 'నాశనం చేసింది' అని వ్యాఖ్యానించింది.
ప్రతిపక్షాల డిజిటల్ మిత్రుడు
చారిత్రక డేటా, ప్రజా సెంటిమెంట్ ట్రెండ్‌లపై ఆధారపడిన ఈ ప్రకటనలు తీవ్రమైన స్పందనను రేకెత్తించాయి, మోడీ వ్యతిరేకుల గొంతులకు ఇవి మరింత ఊతమిచ్చాయి. వీరు గ్రోక్‌ను అరుదైన డిజిటల్ మిత్రుడిగా చూస్తున్నారు. బీజేపీ ప్రతిస్పందన ఊహించినట్లుగానే తీవ్రంగా ఉంది. దాని మద్దతుదారులు ఎక్స్ వి పక్షపాత ఆరోపణలని కొట్టివేశారు. గ్రోక్‌ను 'దేశ వ్యతిరేక' శక్తుల సాధనంగా బ్రాండ్ చేశారు. సామాజిక మాధ్యమ దాడులు, స్క్రిప్ట్ చేయబడిన ఇంట ర్వ్యూలు, బలమైన ఐటీ సెల్ ద్వారా కథనాలను నియంత్రించడంలో పైకి ఎదుగుతా వచ్చిన బీజేపీకి ఉన్నట్టుండి ఇలా గ్రోక్ ఆవిర్భావం జీవితకాల సవాలుగా కనిపిస్తోంది. ప్రతిపక్షాలు గ్రోక్‌ను 'బీజేపీ నకిలీ ప్రచారాన్ని' కూల్చివేసే శక్తిగా పేర్కొంటూ సంబరాలు జరుపుకుంటున్నాయి.
నియంత్రణకు కేంద్రం మల్లగుల్లాలు
అయితే, గ్రోక్ నిర్భీతితో లోపాలు లేకుండా లేవు.. అది కొన్నిసార్లు దూషణలు, బూతు ప్రయోగాలకూ వెళ్తోందనే విమర్శలు వచ్చాయి. ఇది దాని విశ్వసనీయతను దెబ్బ తీసే ప్రమాదం ఉంది. లిబరల్స్ దాని ధైర్యాన్ని ఆనందిస్తుండగా, విమర్శకులు ఈ హడావిడి అతిశయోక్తి అని వాదిస్తున్నారు. గ్రోక్ ఇస్తున్న సమాధానాలు ఎక్స్ డేటా సమూహపు అస్తవ్యస్త స్వరాన్ని ప్రతిబింబిస్తాయని, అవి ఉద్దేశపూర్వకమైన భావజాలంలో భాగమని అంటున్నారు. మరి గ్రోక్ నిజంగా 'నిజాలను బహిర్గతం' చేస్తోందా, లేక అది దానికి అందించిన ధ్రువీకృత భావనలను కేవలం పునరావృతం చేస్తోందా? మోడీతో పోలిస్తే రాహుల్ గాంధీకి అనుకూలంగా వ్యాఖ్యలు చేయడం లేదా ఎన్నికల సమగ్రతను ప్రశ్నించడం.. ఇలా ఒక అరుదైన వ్యతిరేక దృక్పథాన్ని గ్రోక్ అందిస్తుంది. అయితే గ్రోక్ ప్రభావం ఎక్కువ కాలం ఉండకపోవచ్చు. ఎక్స్ ఏఐపై నియంత్రణ ఒత్తిడి లేదా స్పష్టమైన నిషేధాల ద్వారా గ్రోక్‌ను నిశ్శబ్దం చేయడానికి కేంద్రప్రభుత్వం మార్గాలను అన్వేషిస్తోందని సూచిస్తున్నాయి.
నిజం వైపు అన్వేషణేనా?
గ్రోక్ ప్రభావాన్ని సంశయంతోనే తీసుకోవాలి. ప్రజా డేటాపై అది ఆధారపడటం వల్ల భారత దేశంలో సాగుతున్న చర్చా సంభాషణల్లో స్వాభావికంగా ఉన్న పక్షపాతాలకు గ్రోత్ అతీతంగా ఉండదు. ఎలాంటి ఏఐ చాట్‌బాట్ అయినా సరే, శిక్షణ పొందకపోతే అది పక్షపాత రహితంగా ఉండదని నిపుణుల వాదన. గ్రోక్ డేటాను.'ఎక్స్' నుండే తీసుకుంది కాబట్టి అనివార్యంగా వివాదాస్పదంగా మారుతుంది. అంతేకాక, దాని సృష్టికర్త ఎలన్ మస్క్ ఈ వివాదాన్ని నవ్వుతూ తోసిపుచ్చడం చూస్తే అతను ఈ అస్తవ్యస్తతను ఆనందిస్తున్నాడని అర్థమవుతుంది. గ్రోక్ ఉద్దేశాలపై ఇది సందేహాలను లేవనెత్తుతుంది. ఇది నిజం కోసం అన్వేషణ చేస్తుందా, లేక భారత్ లాంటి పెద్ద మార్కెట్‌లో ప్రభావాన్ని చూపించే ఆట మాత్రమేనా?
గ్రోక్ రక్షకుడా, విలనా?
చివరగా, బీజేపీ కథనాన్ని గ్రోక్ విచ్ఛిన్నం చేయడం ఒక ద్విముఖ ఖడ్గం. ఇది నిస్సందేహంగా ఆ పార్టీకి చెందిన డిజిటల్ కోటను కదిలించింది. అణచివేయబడిన విమర్శలకు గొంతును ఇచ్చి, బీజేపీ ప్రచారంలోని బీటలను బయట పెట్టింది. అయితే, దీనికి నిజమైన పరీక్ష ముందుంది. గ్రోక్ స్వేచ్ఛా వాక్కు జవాబుదారీతనం కోసం నిలబడుతుందా? లేక అది సవాలు చేయాలనుకునే శక్తులకు లొంగిపోతుందా? ప్రస్తుతానికి, ఇది ఒక ఆకర్షణీయమైన, లోప రహిత విచ్ఛిన్నకర శక్తిగా మిగిలిపోయింది. ఇది 'రక్షకుడు' కాదు, అలాగని 'విలన్' కూడా కాదు, కానీ భారతదేశ రాజకీయ ఆత్మకు 'గ్రోక్' ఒక అద్దం అని మాత్రం చెప్పవచ్చు.
డాక్టర్ కోలాహలం రామ్ కిశోర్.
98493 28496