ఇంటర్మీడియట్‌లో.. తెలుగు సబ్జెక్ట్‌ను ఐచ్ఛికంగా కూడా ఉండనివ్వరా?
మనదేశంలో ప్రతి భాష ఒక ప్రత్యేకతను, సంస్కృతిని, వైవిధ్యాన్ని కలిగి ఉంటుంది. తల్లి తన బిడ్డకు ఉగ్గుపాలతో రంగరించి

మనదేశంలో ప్రతి భాష ఒక ప్రత్యేకతను, సంస్కృతిని, వైవిధ్యాన్ని కలిగి ఉంటుంది. తల్లి తన బిడ్డకు ఉగ్గుపాలతో రంగరించి నేర్పించేది మాతృభాష. బాధైనా, సంతోషమైనా తక్షణమే మన భావాన్ని వ్యక్తపరిచే భాష మాతృభాష. వ్యక్తి సంపూర్ణ వికాసానికి దోహద పడేది మాతృభాష ఒక్కటే. అలాంటి మాతృభాష తెలుగును కాదని రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ద్వితీయ భాషగా సంస్కృతాన్ని ప్రవేశ పెట్టాలని పెద్దలు నిర్ణయించడం మాతృభాషకు వెన్నుపోటు పొడవడమే.
సంస్కృతానికి మేం వ్యతిరేకం కాదు, ఆ భాషను కించపరచడం మా ఉద్దేశం కాదు. ఆ భాషను బతికించాలనుకుంటే వాటికోసం ప్రత్యేకంగా వేద పాఠశాలలు నెలకొల్పండి, ప్రత్యేక కార్యక్రమాలు పెట్టి సంస్కృత భాష ఉనికిని కాపాడండి, ఉద్యోగావకాశాలు కల్పించండి. కానీ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో తెలుగు భాషకు పోటీగా సంస్కృత భాషను ప్రవేశపెట్టడం ఏందుకు?
ఇప్పటికే ఐచ్చికంగా ఉన్న సబ్జెక్ట్!
పర భాషల మోజులో పడి మాతృభాషను నిర్లక్ష్యం చేయడమే కాకుండా మాట్లాడటానికి సైతం నేటి తరం నామోషిగా భావిస్తున్నారు. అవసరమైనంత మేరకు ఇతర భాషలు నేర్చుకోవడంలో తప్పు కాదు కానీ మాతృభాషను నిర్లక్ష్యం చేయడం మాత్రం నేరమే. భాష లేకుండా ఏ ఉద్యమం రాలేదు. తెలంగాణ ఉద్యమానికి ఊపిరి పోసింది కూడా మాతృ భాషే! విద్యార్థి దశలో ఒకటవ తరగతి నుంచి పదవ తరగతి వరకు విద్యార్థులకు మాతృభాష తప్పనిసరి అయినప్పటికీ ఇంటర్మీడియట్ కళాశాల స్థాయికి వచ్చేసరికి మాతృభాష ఐచ్చికంగా మారింది.
ప్రభుతం నిర్ణయం అమలవుతే..
ఇప్పుడు ద్వితీయ భాషగా తెలుగు భాషకు పోటీగా సంస్కృతం, హిందీ లాంటి భాషలను నెలకొల్పి మాతృ భాష ఉనికినే ప్రశ్నార్థకంగా మారుస్తున్నారు. ఇప్పటికే ప్రైవేట్ కళాశాలల్లో మాతృ భాష (తెలుగు) అనే సబ్జెక్టే లేదు.. అంతా సంస్కృతమే. పేరుకే సంస్కృతం అయినప్పటికీ విద్యార్థులు పరీక్షల్లో సమాధానాలను ఆంగ్లంలోనో, హిందీలోనో, తెలుగులోనో రాస్తారు. ఏ భాషలో రాసినా 99శాతం మార్కులూ రావడం మాత్రం ఖాయం. పైగా సంస్కృత భాషా పుస్తకం, పరీక్షా విధానం, మూల్యాంకనం చాలా సులభంగా ఉంటుంది. దీంతో ప్రతి విద్యార్థికి 90 నుండి 99 శాతం మార్కులు వేస్తారు. దీంతో విద్యార్థులందరూ సంస్కృత భాష వైపు మొగ్గు చూపుతున్నారు. ఇప్పుడు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం అమలైతే రాను రానూ ఇంటర్మీడియట్ కళాశాలలో తెలుగు భాష కనుమరుగయ్యే అవకాశం చేరువలో ఉన్నట్లే. ఏ విద్యార్థికి అయినా భవిష్యత్‌లో తెలుగు, ఇంగ్లీష్, హిందీ భాష అవసరం వస్తుంది కానీ సంస్కృతం అవసరం అసలు రాదు. కానీ ఆ భాషను ప్రభుత్వం ద్వితీయ భాషగా అమలు పరచాలనుకోవడం హాస్యాస్పదం!
తెలుగు పుస్తకంలో ఈ మార్పులు చేస్తేనే..
ఇక తెలుగు భాషపై విద్యార్థులకు మమకారం, ప్రేమ ఏర్పడాలంటే తెలుగు పాఠ్యపుస్తకాలను సులభతరం చేయాలి. పాఠ్యాంశాలలో ముఖ్యమైన పద్యాలు, ప్రశ్నల సంఖ్యను తగ్గించాలి. గ్రాంథిక పదాలను రాకుండా చూడాలి. విద్యార్థుల మానసిక పరిస్థితికి పరిజ్ఞానానికి తగ్గట్టుగా పాఠ్యాంశాల పుస్తకాలు ప్రచురించాలి. అలాగే పరీక్షా పత్రాలు రూపొందించడంలో కూడా సమూలమైన మార్పులు చేయాలి. పరీక్షా పత్రాల మూల్యాంకనం చేసేటప్పుడు తెలుగులో 99 మార్కులు వేస్తే ఆ జవాబు పత్రాన్ని ఏఈ నుండి సీఈ నుండి సబ్జెక్ట్ ఎక్స్ పర్ట్ వరకు కూడా మూడుసార్లు మూల్యాంకనం చేసి 99 మార్కులు కాస్త చిన్న చిన్న కారణాలతో 90 నుండి 80కి మార్కులను తగ్గించడం వల్ల విద్యార్థులకు మాతృభాషపై అభిమానం చచ్చిపోతుంది, భాష పైన వెగటు పుడుతుంది. ఎంత చదివినా మంచి మార్కులు రానే రావనే ఉద్దేశంతో విద్యార్థులు సంస్కృతాన్ని ద్వితీయ భాషగా ఎంచుకునే అవకాశం ఉంది.
ఆ నిర్ణయాన్ని వ్యతిరేకిద్దాం!
ఏ భాష అయినా కొంతకాలం వాడుకలో లేకపోతే ఆ భాష అంతరించిపోయే అవకాశం ఉంటుంది. అంతరించిపోయే భాషల్లో తెలుగు ముందు వరుసలో ఉందని యునెస్కో గతంలో వెల్లడించింది. ఒక భాష నశిస్తే ఆ భాషలో ఉన్న అపారమైన విలువలు జ్ఞాన సంపద సంస్కృతి అంతా నశించిపోతుంది. కనుక కవులు, కళాకారులు, భాషా సంఘాలు, విద్యావేత్తలు, మేధావులు ఆలోచించి మాతృభాషకు జరుగుతున్న అన్యాయాన్ని చూస్తూ ఊరుకోకుండా ప్రభుత్వ ప్రైవేటు జూనియర్ కళాశాలలో తెలుగును తప్పనిసరి చేస్తూ, ద్వితీయ భాషగా సంస్కృతాన్ని ప్రవేశ పెట్టాలనే ప్రభుత్వ నిర్ణయాన్ని ముక్తకంఠంతో వ్యతిరేకిద్దాం. తెలుగు భాష ఔన్నత్యాన్ని కాపాడాలని ప్రభుత్వ పెద్దలకు విన్నవిద్దాం.
-కొమ్మాల సంధ్య
తెలుగు ఉపన్యాసకులు
91540 68272