తొలి పాన్ ఇండియా కథానాయకుడు
సినిమా వ్యాపారాత్మమయిన కళ అయినప్ప టికీ అది అనేక కళల్ని తనలో ఇముడ్చుకుని ఎదిగింది. ఆధునిక GEN ‘Z’ యుగంలో

సినిమా వ్యాపారాత్మమయిన కళ అయినప్ప టికీ అది అనేక కళల్ని తనలో ఇముడ్చుకుని ఎదిగింది. ఆధునిక GEN ‘Z’ యుగంలో దాని రూపురేఖలు సమూలంగా మారిపోతున్నాయి. ఏది ఎంతగా మారినా కథ కథనాల్ని వీడి గాలిలో ఎగరలేదు. అలాంటి సినీరంగంలోని వారికి అవార్డులు ఇచ్చి ప్రోత్సహించడం ప్రభుత్వాల బాధ్యత. గత ప్రభుత్వం పైడి జైరాజ్ పేర జాతీయ అవార్డును ఇవ్వదలచి ప్రకటనలు కూడా చేసింది. అమితాబ్‌కు ఇవ్వబోతున్నట్టు వార్తలు కూడా వచ్చాయి. ఇంతలో అమితాబ్‌కు కరోనా రావడంతో అది మూలన బడింది.
ఇక నంది అవార్డుల స్థితి అగమ్యగోచరం. మాయల ఫకీరు ప్రాణం లాగా కారణం ఎక్కడుందో ఎవరికీ అర్థం కాలేదు. ఇప్పటి ప్రభుత్వం నందిని మార్చి గద్దర్ పేర ఇస్తున్నారు. గద్దర్ అవార్డుల కమిటీ ఏమి సూచన చేసిందో కాని జైరాజ్ అవార్డును గద్దర్ అవార్డుల్లో కలిపేసారు. జాతీయ స్థాయిలో జాతీయ స్థాయి ఫిలిం అవార్డులతో సంబంధం లేకుండా ప్రతిష్టాత్మకంగా ‘దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు’ను ఇస్తున్నారు. అదే రీతిలో మన ప్రభుత్వం జైరాజ్ అవార్డు ఇస్తే బాగుండేది. ఏదీలేని చోట ఈ మేరకయినా మంచిదే కదా.
స్మరించుకోని తెలంగాణ సినీ తేజం
తెలుగు సినిమా రంగం ఇవాళ పాన్ ఇండియన్ సినిమాగా ఎదిగింది అని చెప్పుకుంటున్నది. వ్యాపార పరంగా కొన్ని చిత్రాలు ఆ స్థాయికి చేరాయి. అయితే కేవలం ఆర్థికమయిన విజయాల్ని మాత్రమే పరిగణనలోనికి తీసుకునే ఆ రంగం.. సినిమాల్లో కళాత్మకతను అర్థవంతమయిన ధోరణిని ఎప్పుడో మర్చిపోయింది. దానితో పాటు ఒక ప్రాంతం నుండి ఎదిగి వచ్చిన వారిని నిర్లక్ష్యం చేయడం విస్మరించడం కూడా సినిమాకు పరిపాటిగా మారింది. అలా దశాబ్దాల పాటు కనీసం స్మరించుకోని తెలంగాణా సినీ తేజం పైడి జైరాజ్. ఆయన హిందీ సినిమా రంగం భూమికగా ఎదిగి దేశవ్యాప్తంగా పేరు గడించి 70ఏళ్ల పాటు సినిమా రంగంలో వెలుగొందారు. 1931 ‘ఆలం ఆరా’తో భారతీయ సినిమా మాటలు నేర్వకముందే మూకీ యుగంలోనే తన ముద్రను నిలిపిన పైడి జైరాజ్ తెలంగాణ వాడు కావడంతో తెలుగు సినిమా ఆయనను అంగీకరించడానికి ఆమోదించడానికీ సిద్దంగా కాలేకపోయింది. అత్యంత ప్రతిష్టాకరమయిన దాదా సాహెబ్ ఫాల్కే అవార్డును 1980లోనే అందుకొని టవరింగ్ పర్సనాలిటీగా నిలిచిన జైరాజ్ నటుడిగానే కాదు దర్శకుడిగా, నిర్మాతగా కూడా సినిమా రంగంలో కృషి చేసాడు.
తెలుగు సినిమా పుట్టకముందే..
తెలుగులో సుప్రసిద్ధ నటుడు చిత్తూరు నాగయ్యతో కలిసి ఒక తెలుగు సినిమాను నిర్మించడానికి ప్రణాళికలు వేసుకున్న పైడి జైరాజ్ నాగయ్య మరణంతో ఆ ప్రాజెక్ట్‌ను చేయలేక పోయానని చెపుకున్నారు. ఏడు దశాబ్దాలపాటు సినీ రంగంలో వుండి మూడు తరాల నటీ నటులతోనూ మూకీ, టాకీ సినిమాలతో పాటు టీవీల్లో కూడా నటించి దేశ వ్యాప్తంగా పేరు ప్రఖ్యాతులు గడించిన తెలంగాణ బిడ్డ జైరాజ్‌ను తెలంగాణా సమాజం గుర్తించలేదు. సినిమా వాళ్లేమో తెలుగులో నటించలేదు కదా, బాంబే వెళ్లిపోయాడు కదా అన్నారు. కానీ పైడి జైరాజ్ బాంబే వెళ్లడానికి గల నేపథ్యాన్ని తెలుగు ప్రభుత్వాలు కానీ, సినిమా రంగం కానీ ఎప్పుడూ అర్థం చేసుకునే ప్రయత్నం చేయలేదు. తాను పుట్టిన కరీంనగర్, పెరిగిన హైదరాబాద్ నిజాం రాజ్యం కావడం ఫలితంగా హిందీ, ఉర్దూల్లో జైరాజ్‌కు మంచి ప్రావీణ్యం, ప్రతిభ వుండేది. అందుకే ఆయన బాంబే వెళ్ళాడు. 1928లోనే తన 19వ ఏట జైరాజ్ బాంబే చేరుకున్నాడు. అప్పటికి తెలుగు సినిమా ఊపిరి తీసుకోలేదు. మూకీ సినిమాల కాలంలో మొదట తమిళ్, తెలుగు, మలయాళం భాషల్లో దాదాపు సమాంతరంగా సినిమాలు వెలువడ్డాయి. కానీ పైడి జైరాజ్‌కు అప్పటికే 1929లో మావరెర్కర్ అనే నిర్మాత తన సినిమాలో అవకాశం కలిగించాడు. అలా మొదలయిన జైరాజ్ ప్రస్థానం అప్రతిహతంగా సాగింది. గంభీరమయిన మాట సరళితో తొలి రోజుల్లోనే గుర్తింపు తెచ్చుకున్నాడు. భారతీయ సినిమా రంగంలో మొట్టమొదటిసారి గుర్రంపై స్వారీ చేసి నటించిన నటుడిగా పేరు తెచ్చుకున్నాడు. అప్పటికి బాంబేలో పృథ్వీరాజ్ కపూర్ లాంటి నటుల హవా వున్నప్పటికీ తెలంగాణ నుంచి వెళ్ళి తన స్థానాన్ని పదిల పర్చుకోవడమే గొప్ప విషయం.
తెలంగాణకు గుర్తింపును తెచ్చి..
1931లో టాకీలు మొదలయిన కాలంలో నటీనటులు తమ పాటల్ని తామే పాడుకునే పద్ధతి వుండేది కానీ జైరాజ్ స్వయంగా పాట పాడుకోలేకపోవడంతో చాలా మంది మూకీ కాలపు నటులతో పాటు తొలుత కొంత ఇబ్బందుల్ని ఎదుర్కొన్నాడు కానీ క్రమంగా నిలదొక్కుకున్నాడు. ఆయన హీరో పాత్రలతో పాటు అనేక వైవిధ్యమైన పాత్రలు పోషించిన జైరాజ్ తనకు మాత్రం దేశ నాయకుల పాత్రలు, చారిత్రక పాత్రలు ఎంతో ఉత్సాహాన్నీ సంతృప్తిని కలిగించాయని చెప్పుకున్నారు. జైరాజ్ పోషించిన టిప్పు సుల్తాన్, పృథ్వీరాజ్ చౌహాన్, రాణా ప్రతాప్ మొదలైన చారిత్రక సంబంధ పాత్రలు విశిష్టమైనవి. ‘షాహిద్ ఏ ఆజమ్’లో ఆయన పోషించిన చంద్రశేఖర్ ఆజాద్ పాత్ర విలక్షణమయింది. అలా భారతీయ సినీ రంగంలో కరీంనగర్‌కు తెలంగాణకు విశిష్టమయిన స్థానాన్ని గుర్తింపును తెచ్చిన పైడి జైరాజ్ భార్య సావిత్రి పంజాబీ. వారి పెళ్లిని పృథ్వీ రాజ్ కపూర్ తండ్రి జరిపించాడని చెబుతారు. ఆయనకు ఒక కుమారుడు, ముగ్గురు కూతుళ్ళు. 2000 సంవత్సరం ఆగస్ట్ 11న ఆయన పరమపదించారు.
వారాల ఆనంద్
94405 01281