
అమ్మకు అన్నీ నిద్ర లేని రాత్రులే
హాయి లేని అమ్మ
నేను అమ్మను కప్పుకుని నిద్రించాను
అమ్మ తన పని స్థలాన్ని
ఇంటిని కొంగున కట్టేసుకుంది
నా చదువుకి తిండికి లోటే లేదు
అమ్మ నాన్నను తన
ఆత్మీయతతో కట్టేసింది
తను మాత్రం విరామం లేని
భూ భ్రమణమైంది
ఎంత కష్టాన్నైనా చిరునవ్వుతో దాటేసింది
మా సేవలో తనను తాను మరిచి పోయింది
తను విసుక్కున్నట్టు లేదు
విచారించినట్టు లేదు
ఇంత సహనం నాకు లేదు
అనుక్షణం తనని చూసి పెరిగినా
తప్పయితే ఎదిరించాలనే
నా వాదన నిలదీసే తత్వం
నెమ్మదిగా అలోచించే అమ్మ
తుఫానుని అరచేతిలో బంధించే తత్వం
తుఫానులో కొట్టుకుపోయిన నేను
ఒంటరి అయిన నా జీవితం
ఒక్కసారి అమ్మని తాకి
నాలోకి ఒంపేసుకోవాలి
చేజారిన జీవితాన్ని నిలుపుకోవాలి
సర్వ మంగళ
89616 26848