టీచర్ బెత్తం చదువు చెబుతుందా?
ఇటీవల టీచర్లకు సంబంధించి రెండు వీడియోలు బాగా ట్రెండింగ్ అవుతున్నాయి. ఒక టీచర్ తల్లిదండ్రుల కాళ్ళుమొక్కుతున్నట్టు

ఇటీవల టీచర్లకు సంబంధించి రెండు వీడియోలు బాగా ట్రెండింగ్ అవుతున్నాయి. ఒక టీచర్ తల్లిదండ్రుల కాళ్ళుమొక్కుతున్నట్టు, పిల్లల కాళ్ళు మొక్కుతున్నట్టు... తన చేతిలో బెత్తం లేదు. పిల్లలను కొట్టలేను కాబట్టి తల్లిదండ్రులే పిల్లల్ని సరిచేయాలన్నట్టు అనడం. రెండోది టీచర్ పిల్లలను కొట్టలేడు కాబట్టి తనను తానే శిక్షించుకున్నట్టు బెత్తంతో కొట్టుకోవడం. ఇవి చూస్తుంటే టీచర్ల మీద చాలా మందికి జాలి కలుగుతుంది. టీచర్లు తరతరాలుగా తమ మేధస్సును కాకుండా బెత్తాన్ని, తిట్లను నమ్ముకున్నట్టు అనిపిస్తుంది. ఇప్పుడు బెత్తం వద్దు అనగానే టీచర్లు ఫ్రస్టేషన్ గురైనట్టు అనిపిస్తుంది.
మన విద్యా విధానం తరతరాలుగా కొట్టడం శిక్షించడమే విద్య అన్నట్టుగా రూపొందించబడింది. కొడవటిగంటి కుటుంబరావు "చదువు", చిలకమర్తి లక్ష్మీనరసింహం "గణపతి", చలం "బిడ్డల శిక్షణ" వంటి వాటితో పాటు విద్యారంగంలో అనేక ప్రయోగాలు చేసిన గిజుబాయ్ "పగటి కల", "తల్లిదండ్రులకు తలనొప్పి" ఇలాంటి గ్రంథాలు అత్యధిక టీచర్లు చదవకపోవడం శోచనీయం. "అల్లరి పిల్లల్లో అద్భుత మార్పులు" "రైలు బడి", "పిల్లలు నేర్చుకోవడంలో ఎలా వెనుక బడతారు?" వంటి అంతర్జాతీయ గ్రంథాలు అత్యధిక మంది అసలు చూసి కూడా ఉండరు.
కొట్టడం కాదు.. కోప్పడటమూ నేరమే!
ప్రపంచంలో విద్యా రంగంలో నంబర్ వన్ స్థాయిలో ఫిన్లాండ్ ఉంది. యూరప్ దేశాలు విద్యారంగంలో, ఆరోగ్య రంగంలో ముందు ఉండడమే కాకుండా ఆనందమయ జీవితాల్లో ముందు భాగాన ఉన్నాయి. అక్కడ టీచర్లే కాదు, తల్లిదండ్రులు కూడా తమ పిల్లల్ని కొట్టడం, కోప్పడడం కూడా నేరమే. గతంలో మన భారతీయ దంపతులు నెదర్లాండ్స్‌లో తమ పిల్లల్ని కోప్పడ్డందుకు జైలు పాలైన సంగతి తెలిసిందే. బాలల హక్కులు, మానవ హక్కుల గురించి ఆధునిక ఆలోచనలు ఉన్నతంగా ఎదుగుతున్న క్రమంలో ఎవరూ ఎవరినీ కోప్పడడం, దండించడం చేయకూడదు.
ఐన్‌స్టీన్ ఏం చేశాడంటే..!
మరి టీచర్లు ఏం చేయాలి? టీచర్లు బెత్తం చదువు చెప్పదు అని గుర్తు పెట్టుకోవాలి. చదువు చెప్పాల్సింది తమ మేధస్సు అని గుర్తించి దానికి పదును పెట్టాలి. టీచర్లు తాము ఫెసిలిటేటర్లు మాత్రమే అని గుర్తుంచుకోవాలి. గ్రాడ్యుయేషన్‌లో పదికి 4.9 మార్కులు మాత్రమే వచ్చి తన తోటి వారందరికీ యూనివర్సిటీ పీహెచ్‌డీలో సీటు ఇచ్చి తన ఒక్కడికే రిజెక్ట్ చేస్తే, పోయి పేటెంట్ ఆఫీసులో ఎంప్లాయ్‌గా చేరిన ఐన్‌స్టీన్ ఏ యూనివర్సిటీలో పీహెచ్‌డీ స్టూడెంట్ కాకపోయినా తనే సొంతంగా ఫోటో ఎలక్ట్రిసిటీ గురించి తన పరిశోధనా రీసెర్చ్ పేపర్ పబ్లిష్ చేసి ఆ పేపర్‌కి యూనివర్సిటీ పీహెచ్‌డీ ఇచ్చేలా తన ప్రతిభను చాటాడు. మరి తాను ఏ కొలమానాలకు అందుతాడు?
ఈ దురభిప్రాయంలో ఉండకుండా..
ఇలాంటి ఉదాహరణలు ఎడిషన్ వంటి అనేక మంది జీవితాల్లో చూస్తాం. కాబట్టి టీచర్లు, తల్లిదండ్రులు కోప్పడడం, దండించడం వల్ల పిల్లలను క్రమశిక్షణలో పెడతామనే దురభిప్రాయంలో ఉండకుండా వారితో ఫెసిలిటేటర్‌గా మసులుకుంటూ తమ ఆచరణ నుండి పిల్లలు నేర్చుకునేలా చూడాలి. టీచింగ్, పేరెంటింగ్ అనేది ఒక శాస్త్రం, ఒక కళ అనే అంశాన్ని నిరంతరం గుర్తు పెట్టుకోవాలి. అవసరమైతే సైకాలజిస్ట్ దగ్గర కౌన్సిలింగ్ తీసుకోవడం మరీ మంచిది. తక్షణ అవశ్యకం.
-రమేష్,
విజ్ఞానదర్శిని