Delimitation: న్యాయమైన ప్రాతినిధ్యం సాధ్యమేనా?

వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో గేమ్ చేంజర్‌గా భావిస్తున్న డీలిమిటేషన్ ప్రక్రియ దక్షిణాది రాష్ట్రాలలో రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోంది.

Update: 2025-03-23 01:15 GMT
Delimitation: న్యాయమైన ప్రాతినిధ్యం సాధ్యమేనా?
  • whatsapp icon

వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో గేమ్ చేంజర్‌గా భావిస్తున్న డీలిమిటేషన్ ప్రక్రియ దక్షిణాది రాష్ట్రాలలో రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోంది. 2026లో చేసే నియోజకవర్గాల పునర్విభజన ద్వారా తనకు పట్టున్న ఉత్తర, మధ్య భారత రాష్ట్రాల సీట్లను పెంచి మళ్లీ అధికారంలోకి రావాలని బీజేపీ వ్యూహరచన చేస్తోందని ప్రతిపక్షాలు వాదిస్తుండగా, డీలిమిటేషన్‌తో దక్షిణాది రాష్ట్రాల సీట్లు తగ్గవని అమిత్ షా అంటున్నారు. అయితే, రాజ్యాంగం ప్రకారం జనాభా లెక్కల తర్వాత సహజంగా జరగాల్సిన ఈ ప్రక్రియ ఈసారి సజావుగా జరుగుతుందా? లేదా దేశ సమగ్రతకు విఘాతం కలిగించే ఉద్యమానికి ఊపిరి పోస్తుందా? 

దేశంలో ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి జనాభా లెక్కల సేకరణ చేసి జనాభాలో వచ్చే మార్పులకు అనుగుణంగా అన్ని స్థానాల జనాభా ఒకేలా ఉండే విధంగా లోక్‌సభ, రాష్ట్ర అసెంబ్లీ స్థానాల సరిహద్దులను మార్చే డీలిమిటేషన్ ప్రక్రియను చేపట్టాలని రాజ్యాంగం నిర్దేశించింది. 82వ నిబంధన ప్రకారం డీలిమిటేషన్ చట్టం ఆధారంగా డీలిమిటేషన్ కమిషన్‌ను ఏర్పాటు చేస్తారు. విశ్రాంత సుప్రీంకోర్టు న్యాయమూర్తి చైర్మన్ గాను, కేంద్ర ఎన్నికల సంఘం ప్రధానాధికారి, ఆయా రాష్ట్రాల ఎన్నికల సంఘం అధికారులు సభ్యు లుగా ఉంటారు. ఈ కమిషన్ చేసిన ముసాయిదా ప్రతిపాదనలపై అభ్యంతరాలు సూచనలు స్వీకరించి తగు మార్పులు చేసి రాష్ట్రపతి ఆమోదంతో అమలు చేస్తారు. అయితే డీలిమిటేషన్ కమిషన్ చేసిన నియోజకవర్గాల ఏర్పాటు, మార్పులపై న్యాయ సమీక్షకు అవకాశం లేదు.

ఎన్ని సీట్లు పెరుగుతాయంటే..

దేశంలో1971 నాటికి పెరుగుతున్న జనాభాను నియంత్రించాలనే ఉద్దేశంతో 1976లో 42వ రాజ్యాంగ సవరణ ద్వారా 543 సీట్లకు పరిమితి విధించారు. దీనిని 2001లో 84వ రాజ్యాంగ సవరణ ద్వారా 2026 నాటికి పొడిగించారు. తాజాగా 2001 జనాభా లెక్కలు 2025 లేదా 26లో చేయనున్నందున జనాభా సంఖ్య ప్రాతిపదికన డీలిమిటేషన్ చేస్తారని, అధిక జనాభా గల ఉత్తర, మధ్య భారత రాష్ట్రాలలో లోక్‌సభ సీట్లు పెరిగి, కేంద్రంలో వారి పెత్తనం, అధికారం పెరుగుతుందని తక్కువ జనాభా గల దక్షిణ భారత రాష్ట్రాల వారు అధికారానికి దూరమవుతారని ఆందోళన ఇక్కడ ప్రజల్లో సహజంగా ఉంది. జనాభా ఆధారంగా చూస్తే ఉత్తర‌ప్రదేశ్ సీట్లు 80 నుండి 143కు, బిహార్ సీట్లు 42 నుండి 79కి, రాజస్థాన్ సీట్లు 25 నుండి 50కి, మధ్యప్రదేశ్ సీట్లు 29 నుండి 52కు అలా ఈ నాలుగు రాష్ట్రాల సీట్ల సంఖ్య ప్రస్తుత 174 నుండి 324కు మొత్తంగా 148 సీట్లు పెరుగుతాయి. అదే దక్షిణాది రాష్ట్రాలలో కేరళలో 0, తెలంగాణలో 17 నుండి 23, కర్ణాటకలో 28 నుండి 41, తమిళనాడులో 39 నుండి 49కి, ఆంధ్రప్రదేశ్లో 25 నుండి 31. అంటే 5 దక్షణాది రాష్ట్రాలలో కేవలం 35 సీట్లు మాత్రమే పెరిగే అవకాశం ఉంది. ఈశాన్య రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలలో ఎలాంటి మార్పు ఉండే అవకాశం లేదు.

తలెత్తే పరిణామాలు..

దేశాభివృద్ధికి అధిక జనాభా శాపం అన్న భావనతో కేంద్రం అనుసరించిన నియంత్రణ పద్ధతులను ఉత్తర దక్షిణ భారత రాష్ట్రాలు ఒకే స్ఫూర్తితో అమలు చేయకపోవడం వల్ల జనాభా అసమానత ఏర్పడింది. ఉత్తరప్రదేశ్‌లో జనాభా పెరుగుదల రేటు 16.5 శాతం, మహారాష్ట్రలో 9.28%, బిహార్లో 8.6%, పశ్చిమ బెంగాల్‌లో 7.54% అధిక పెరుగుదల ఉండగా, అదే దక్షిణాది రాష్ట్రాలైన కేరళలో 2.67%, తెలంగాణలో 2.8%, ఆంధ్రప్రదేశ్‌లో 4.1%, ఇలా అత్యల్ప జనాభా పెరుగుదల రేటు నమోదయింది. అందువల్ల డీలిమిటేషన్‌కు జనాభాను పరిగణనలోకి తీసుకుంటే జనాభా నియంత్రించినందుకు గాను సీట్లు కోల్పోవాల్సి వస్తుందని, ఇది లోక్‌సభలో రాష్ట్రాలకు "న్యాయమైన ప్రాతినిధ్యం"అన్న భావన దక్షిణాది ప్రాంతాల నాయకుల్లో వ్యక్తమవుతున్న అభిప్రాయం. కేంద్రం అధికారం ఉత్తర భారతదేశానికి మారే అవకాశం, అక్కడ పట్టుగల రాజకీయ పార్టీలు దేశ రాజకీయాల్లో చక్రం తిప్పే అవకాశం ఉంది. ఇప్పటికే కాషాయ ఉప్పెనను అడ్డుకుంటున్న దక్షిణాది రాష్ట్రాలకు శిక్షగాను, 2029 లోక్‌సభ ఎన్నికల అస్త్రంగా ఈ డీలిమిటేషన్ ప్రక్రియను మోడీ ప్రభుత్వం ఎంచుకునే అవకాశం ఉందని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. ఈ ప్రక్రియ దేశ సమగ్రతకు ముప్పుగా మారే అవకాశం ఉండటం వల్ల మరో 30 సంవత్సరాల వరకు ప్రస్తుత 543 స్థానాలు అనే కొనసాగించాలని మరికొందరు వాదిస్తున్నారు. దీనికి ఉదాహరణగా 1913 నుండి అమెరికా 435 స్థానాలని కొనసాగిస్తున్నదని, యూరోపియన్ పార్లమెంట్లలో 27 దేశాలకు 720 సీట్లే ఉన్న విషయం గమనించాలని చెబుతున్నారు. లేకపోతే ఫేయిర్ డీలిమిటేషన్ చేయాలని కోరుకుంటున్నారు.

ప్రజాస్వామ్య స్ఫూర్తిని గౌరవించి..

అయితే డీలిమిటేషన్ కొత్తది ఏమి కాదనే వాదన సైతం ఉంది. దేశంలో ఎంపీల సంఖ్య పెరిగితే పాలన నాణ్యత పెరుగుతుంది. దేశంలో కనీసం ఒక వెయ్యి మంది ఎంపీలు ఉంటేనే 143 కోట్ల మందికి సరైన పాలన అందుతుందని, లోక్‌సభలో మహిళలకు 33 శాతం సీట్లు కేటాయించడం కుదరు తుందనే వాదనలు వినిపిస్తున్నాయి. ఈ సమస్యపై దక్షిణ భారత రాష్ట్రాలు ఏకమై ఉద్యమానికి సిద్ధమవుతున్న దశలో కేంద్రం ఏ ప్రాతిపాదికన డీలిమిటేషన్ చేస్తుందో స్పష్టమైన హామీ ఇవ్వాలి. దక్షిణాది రాష్ట్రాల సందేహాలన్ని నివృత్తి చేయాలి. కేంద్రం దక్షిణాదిపై రాజకీయ ఆధిపత్యం సాధించాలనే భావనకు స్వస్తి పలికి ప్రజాస్వామ్య స్ఫూర్తిని భిన్నత్వాన్ని గౌరవించాలి. డీలిమిటేషన్ ప్రస్తుతానికి మరో మారు వాయిదా వేస్తూ పొడిగించాలి. అలా వీలుకాని పక్షంలో "ప్రో రాటా పద్ధతి"(అనుపాతంలో) కానీ లేదా సరికొత్త విభజన సూత్రాన్ని గాని మేధావులతో రూపొందించి అఖిలపక్ష సమావేశంలో ఆమోదం తీసుకోవాలి. కేంద్రం విస్తృత సంప్రదింపుల ద్వారా రాష్ట్రాల ఆమోదం ద్వారా ఈ ప్రక్రియను పూర్తి చేస్తేనే దేశ సుస్థిరత సాధ్యమవుతుంది.

తండ ప్రభాకర్ గౌడ్

94918 22383

Tags:    

Similar News