సొంత ఏఐ రూపొందించలేరా..?
మన ఐఐటీలలో, ఎన్ఐటీలలో చదువుకున్న యువత పాశ్చాత్య పెట్టుబడిదారీ దేశాలలో ఉద్యోగాలు పొందేందుకు
మన ఐఐటీలలో, ఎన్ఐటీలలో చదువుకున్న యువత పాశ్చాత్య పెట్టుబడిదారీ దేశాలలో ఉద్యోగాలు పొందేందుకు వలస పోయి వీరంతా ఆ దేశాలలో ఆర్థిక అభివృద్ధికి గణనీయమైన కృషి చేస్తున్నారు. వీరంతో ప్రపంచ అగ్రగామి కంపెనీలైన గూగుల్, మైక్రోసాఫ్ట్, ట్విట్టర్ వంటి వాటి సీఈవోలుగా మనవారు ఉండటం సంతోషించదగ్గ విషయమే. అయితే ఇక్కడ చదువుకొని ఈ దేశ పెట్టుబడులతో ఐటీ నైపుణ్యాలను సంపాదించి ఎక్కడికో వెళ్లి తమ నైపుణ్యాలతో ఆ దేశ ఆదాయాలను పెంచడం విచారకరం. మన ప్రభుత్వాలు వారిని ఉపయోగించుకొని ఉంటే మన దేశం ఇంకా అభివృద్ధి చెంది ఉండేది. గూగుల్ నుంచి ట్విట్టర్ వరకు మనవాళ్లే వలస వెళ్లి ఉండే వాళ్లలో కాదు.
మన పెట్టుబడిదారులు మన బడా కంపెనీలు వలస పోయే వాళ్లని ఎందుకు ఆకర్షించలేకపోతున్నాయి? అలా అభివృద్ధి చెందిన ఐటీ రంగానికి ఇప్పటికైనా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగానికి అనుసంధానం చేసి ప్రపంచ స్థాయిలో మళ్లీ మనకు ఉన్న ఐటీ రంగం యొక్క పూర్వ వైభవాన్ని ఏఐ రంగానికి కూడా ప్రపంచ స్థాయిలో నిలబెట్టేందుకు ప్రభుత్వాలు తక్షణం పూనుకోవాలి. ఎందుకంటే సాఫ్ట్‌వేర్ రంగంలో ప్రోగ్రామర్ల నుంచి పెద్ద కంపెనీల సీఈఓ ల వరకు మన వాళ్ళదే ఆధిపత్యం. ప్రతి ప్రఖ్యాత సంస్థ మన దేశంలో బ్రాంచీలు పెట్టగలదు. వారందరికీ ప్రభుత్వం కావలసిన సౌకర్యాలు కల్పించగలిగితే కృత్రిమ మేధను మనమే అభివృద్ధి చేయగలం.
సొంత ఏఐ ప్లాట్‌ఫామ్‌లు ఎక్కడ?
కృత్రిమ మేధస్సు( ఏఐ) ప్రపంచ సాంకేతిక దృశ్యాన్ని మార్చుతున్న యుగంలో భారతదేశం ఒక కీలకమైన మలుపు దగ్గర ఉన్నది. ఐటీ శక్తిగా మన దేశానికి ఎంతో ఖ్యాతి విశాలమైన సాంకేతిక ప్రతిభ ఉన్నప్పటికీ ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం ఇంకా సొంతంగా ఏఐ ప్లాట్‌పామ్‌లను అభివృద్ధి చేయలేదు. టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రో వంటి ఐటీ దిగ్గజాలను ప్రపంచానికి అందించిన దేశం మనది. కానీ OPENAL నుంచి విడుదలైన చాట్ జీపీటీకి, లేదా చైనాకు చెందిన డీప్‌సీక్‌కు సమానమైన సొంత ఏఐ ఉత్పత్తులను మనం ఇంకా తయారు చేయలేదు. ఈ లోటు ఇప్పుడు మన ముందు ఒక పెద్ద సవాల్ నిలబెట్టింది. అది సేవా ప్రదాత స్థాయి నుంచి ఉత్పత్తి సృష్టికర్త స్థాయికి ఎదగాల్సిన సవాలు.. ఈ దిశగా పెట్టుబడి పరిశోధనలతో పాటు ప్రభుత్వ ప్రైవేటు సంస్థల మధ్య మరింత సమగ్ర సహకారం అవసరం. సరియైన మౌలిక సదుపాయాలు, నిధులు లేకుండా స్వదేశీ ఏఐ అభివృద్ధి అసాధ్యం.
ఆ వ్యూహమే లేదు..
రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్‌పై మన దేశం స్థూల జాతీయోత్పత్తిలో ఒక శాతం కన్నా తక్కువగానే ప్రభుత్వం ఖర్చు చేస్తున్నది. అంటే ఇక ఏఐ ఎలా అభివృద్ధి చెందుతుంది? ఈ రంగంపై విదేశీయులపై ఆధారపడలేం కదా. చైనా అయితే తన స్థూల జాతీయోత్పత్తిలో 2.43% కృత్రిమ మేధ పైన ఖర్చు చేస్తున్నది. చైనా కృత్రిమ మేధా రంగంలో అమెరికాతో దాదాపు సమాన స్థాయిని పొందడానికి రెండు అంశాలను కారణాలుగా చెప్పవచ్చు. మొదటిది వాణిజ్య సైనిక అనువర్తనాల అప్లికేషన్లలో, సెమీ కండక్టర్లను ఉత్పత్తి చేయడానికి అవసరమైన ప్రత్యేక యంత్రాలు పరికరాలు, ప్రాసెసర్ల నుంచి హార్డ్‌వేర్ ఉత్పత్తులు ఏఐ మోడల్స్ వరకు మొత్తం డిజిటల్ టెక్నాలజీతో రంగంలో అవసరమైన అన్నిటి విషయంలో స్వయం సమృద్ధిని, సాంకేతిక ఆధిపత్యాన్ని చేరుకోవడానికి చైనా చురుకైన స్థిరమైన జాతీయ విధానం కలిగి ఉన్నది. కానీ మన దేశంలో కృత్రిమ మేధా అభివృద్ధికి చేపట్టాల్సిన వ్యూహం ఇంతవరకు లేకపోవడం శోచనీయం.
సాంకేతికతపై ఆసక్తికి మార్గం
భారతదేశ విద్యా వ్యవస్థ సంవత్సరానికి 1.5 మిలియన్లకు పైగా ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లను ఉత్పత్తి చేస్తున్నది. ఈ దేశం గొప్ప ఏఐ కార్య బలాన్ని నిర్మించడానికి విశాల సామర్ధ్యాన్ని అందిస్తున్నది. అయితే ఈ ప్రతిభను పూర్తిగా వినియోగించుకోవడానికి పాఠశాల నుండి ఉన్నత విద్య వరకు విద్యా వ్యవస్థను మరింత బలోపేతం చేయాలి. సాంకేతికతపై ఆసక్తిని పెంపొందించడానికి పాఠశాల స్థాయిలో ఏఐ అక్షరాస్యత, కోడింగ్, సమస్య పరిష్కార నైపుణ్యాలను పరిచయం చేయాలి. కళాశాల స్థాయిలో ప్రాక్టికల్ ఏఐ ప్రాజెక్టులు, అంతర్ విభాగ అభ్యాసాలు, ఏఐ నైతికతపై అవగాహన చర్చలు అమలు జరపాలి. ఏఐ విషయంలో సమగ్ర వ్యూహం అవసరం. ఇటీవల భారత ప్రభుత్వం ప్రకటించిన పదివేల కోట్ల రూపాయల కేటాయింపు ఈ దిశగా తీసుకున్న సరైన చర్య. అయితే మనదేశంలో ఏఐ అభివృద్ధి ప్రపంచ స్థాయిలో పోటీకి నిలబడడానికి ఈ పెట్టుబడి సరిపోదు.
స్వదేశీ ఏఐ అభివృద్ధి అవశ్యం!
ప్రపంచ శక్తి సమీకరణలో ఏఐ నేడు ప్రధాన పాత్ర పోషించే దశలో ఉన్నది. ఈ దశలో భారతదేశం సరైన ప్రణాళికలను రూపొందించి విద్యా విధానానికి అనుసంధానం చేసి అంతర్జాతీయ స్థాయిలో ఏఐ అభివృద్ధి జరగాలి. విదేశీ సాంకేతికతపై ఆధారపడకుండా భారతదేశం తన సొంత ఏఐ సామర్థ్యాలను అభివృద్ధి చేసుకోవడం అత్యవసరం. భారతదేశం ఐటీ, సేవా రంగంలో సాధించిన ఖ్యాతిని ఏఐలోనూ సాధించేందుకు సరైన పెట్టుబడి, దూరదృష్టి, సమర్థవంతమైన ప్రణాళికలు రూపొందించుకోగలిగితే మన దేశం కూడా ఏఐలోను గ్లోబల్ శక్తిగా ఎదగగలదు. అమెరికా, చైనా, ఏఐ మోడల్స్‌కి ప్రత్యామ్నాయాలను అందించే దేశంగా విజయం సాధించగలరు. ఈ రంగంలో భారీగా పెట్టుబడులు పెట్టి, ఏఐ అభివృద్ధికి స్వదేశీ ఆవిష్కరణలు జరగాలి. విద్యావ్యవస్థను ఆధునీకరించాలి. ప్రభుత్వంతో పాటు ప్రైవేట్ పెట్టుబడిదారులు కూడా ఏఐ అభివృద్ధిలో భాగస్వాములు కావాలి. తద్వారా స్వదేశీ ఏఐ అభివృద్ధి జరిగి ఇంతకు మునుపు ఐటీ రంగంలో లాగా మరలా మనం మునుముందు ఏఐ అభివృద్ధిలోనూ అగ్రగామి దేశంలాగా అభివృద్ధి చెందగలదు.
డాక్టర్ ఎనుగొండ నాగరాజనాయుడు
రిటైర్డ్ ప్రిన్సిపాల్
98663 22172