విశ్వవిద్యాలయ భూముల అమ్మకం ఆపాలి!

రాష్ట్రంలో ప్రభుత్వాలు మారినా విశ్వవిద్యాలయాల భూము ల దోపిడీ ఆగడం లేదు. గత ప్రభుత్వం నూతన హైకోర్టు నిర్మాణానికి

Update: 2025-03-25 00:30 GMT

 రాష్ట్రంలో ప్రభుత్వాలు మారినా విశ్వవిద్యాలయాల భూము ల దోపిడీ ఆగడం లేదు. గత ప్రభుత్వం నూతన హైకోర్టు నిర్మాణానికి అగ్రికల్చర్ యూనివర్సిటీలోని 100 ఎకరాల భూమిని ప్రతిపాదిస్తే ఈ ప్రభుత్వం సైతం అదే బాటలో నడుస్తూ ఆ యూనివర్సిటీ‌లోనీ 100 ఎకరాల భూమిని హైకోర్టు నిర్మాణానికి ఇచ్చింది. ఇప్పుడు హెచ్‌సీయూ (హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం)కి చెందిన 400 ఎకరాల భూమిని అమ్మడానికి చూస్తున్నారు. ప్రభుత్వాలు.. యూనివర్సిటీలకు వసతులు, సౌకర్యాలు కల్పించాల్సింది పోయి ఉన్న భూమిని లాక్కోవడం హాస్యాస్పదంగా ఉంది. నాడు తెలంగాణ తొలి దశ ఉద్యమ సమయంలో ఇక్కడి ప్రజలని శాంతింపచేయడానికి ఇందిరా గాంధీ హైదరాబాద్‌కి కేంద్రీయ విశ్వవిద్యాలయం మంజూరు చేస్తే.. భూ సేకరణ బాధ్యత తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం గచ్చిబౌలి‌లోని 2300 ఎకరాల భూమిని ఇచ్చింది. మొదటి వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ గురు బాక్స్ సింగ్ 1970 దశకంలోనే దాదాపు కోటి రూపాయలతో ప్రహరీ గోడను నిర్మించాడు. కానీ భూమిని రిజిస్ట్రేషన్ చేయకపోవడంతో ఆ తప్పుని భూచిగా చూపి నేడు ప్రభుత్వం అమ్మకానికి పెడుతుంది. ఇందిరాగాంధీ హయాంలో ఏర్పడిన యూనివర్సిటీ భూమిని నేడు అదే కాంగ్రెస్ పాలనలో లాక్కోవడం విస్మయానికి గురిచేస్తోంది. సమాజ ఉద్ధరణ లక్ష్యంగా ఏర్పడిన యూనివర్సిటీల భూములు లాక్కోవడం చూస్తుంటే విద్యావ్యవస్థ పట్ల ఎంత చిత్తశుద్ధి ఉందో అర్థం చేసుకోవచ్చు. గతంలో ఈ స్థలంలో ఊర్దూ యూనివర్సిటీ పెట్టాలని అప్పటి విద్యాశాఖ మంత్రి అప్పటి వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ గోవర్ధన్‌కు కోరితే హైదరాబాద్‌లో పర్యావరణం క్షీణించిందని, ఈ యూనివర్సిటీ భూమి హైదరాబాద్‌కి ఊపిరితిత్తుల వంటిదని, దీన్ని అన్యా క్రాంతం చేస్తే హైదరాబాద్ వాసులు ఇబ్బందులు ఎదుర్కొంటారని చెప్పడంతో నాటి విద్యాశాఖ మంత్రి ఏకీభవించారు. అటువంటి భూమిని అమ్మడానికి చూస్తున్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పునరాలోచించాలి. ప్రస్తుతం యూనివర్సిటీల భూముల పరిరక్షణకు విద్యార్థులే ముందుకు వచ్చి పోరాడాల్సిన పరిస్థితి వచ్చింది. రాష్ట్రంలోని యూనివర్సిటీ భూముల పరిరక్షణకు జీవో తీసుకొచ్చి భూములు అన్యక్రాంతం కాకుండా చూడాలని ఏబీవీపీ డిమాండ్ చేస్తుంది.

- పృథ్వి తేజ

ఏబీవీపీ

96403 14475

Tags:    

Similar News