ప్రమాదంలో ఇంజనీరింగ్ కోర్సులు..
దేశంలోని ఇంజనీరింగ్ విద్యా వ్యవస్థ గణనీయమైన మార్పులను ఎదుర్కొంటోంది. గత రెండు దశాబ్దాల్లో, కంప్యూటర్ సైన్స్
దేశంలోని ఇంజనీరింగ్ విద్యా వ్యవస్థ గణనీయమైన మార్పులను ఎదుర్కొంటోంది. గత రెండు దశాబ్దాల్లో, కంప్యూటర్ సైన్స్ , ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ వంటి శాఖలు భారీ డిమాండ్‌ను పొందాయి. అయితే, మెకానికల్, సివిల్, ఎలక్ట్రికల్, కెమికల్ వంటి కోర్ ఇంజనీరింగ్ శాఖల డిమాండ్ తగ్గిపోతున్నది.
ఈ మార్పు భారతదేశ పరిశ్రమలు, విద్యా వ్యవస్థ, ఉపాధి అవకాశాలు, భవిష్యత్ ఆవిష్కరణలపై తీవ్ర ప్రభావాన్ని చూపుతోంది. కోర్ ఇంజనీరింగ్ శాఖల మేధావులు లేకపోతే, దేశంలోని తయారీ రంగం, నిర్మాణ రంగం, రిసెర్చ్ & డెవలప్‌మెంట్, విద్యుత్ ఉత్పత్తి, మెటలర్జీ వంటి రంగాల్లో నైపుణ్యం కలిగిన నిపుణుల కొరత ఏర్పడడం వలన వెనుకబడే అవకాశం ఉంది.
కోర్ శాఖలపై అనాసక్తి
ఇందుకు ప్రధానంగా సాఫ్ట్‌వేర్ రంగంలో పెరుగుతున్న అవకాశాలు చెప్పుకోవచ్చు. ప్రస్తుతం మల్టీనేషనల్ కంపెనీలు అధిక సంఖ్యలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లను నియమించుకుంటున్నాయి. AI, డేటా సైన్స్, క్లౌడ్ కంప్యూటింగ్ వంటి నూతన టెక్నాలజీలకు డిమాండ్ పెరుగుతుండడంతో విద్యార్థులు, తల్లిదండ్రులు, కాలేజీలు ఈ కోర్సులపైనే దృష్టి పెట్టారు. కోర్ ఇంజనీరింగ్ రంగాలలో ఉద్యోగాలు పొందాలంటే ప్రాక్టికల్ నాలెడ్జ్, ప్రాజెక్ట్ అనుభవం అవసరం. అయితే, వీటి వేతనాలు తక్కువగా ఉండటంతో విద్యార్థులు సాఫ్ట్‌వేర్ రంగానికి మళ్లుతున్నారు. మెకానికల్, సివిల్, ఎలక్ట్రికల్ రంగాల్లో ఉద్యోగాల్లో ఎక్కువ శారీరక శ్రమ, ప్రాక్టికల్ అనుభవం అవసరం. అంతేకాక, వీటిలో క్యాంపస్ ప్లేస్‌మెంట్స్ తక్కువగా ఉండటంతో విద్యార్థులు ఈ శాఖలను ఎంపిక చేసుకోవడం తగ్గిస్తున్నారు. ప్రభుత్వ రంగ సంస్థల్లో ( పబ్లిక్ సర్వీస్ అండర్ టేకింగ్ ) ఉద్యోగ అవకాశాలు తగ్గిపోవడం, ప్రైవేటీకరణ పెరగడం వల్ల కోర్ ఇంజనీరింగ్ విద్యార్థులకు సరైన అవకాశాలు లభించడం లేదు.
భవిష్యత్తుపై ప్రభావం
భారతదేశం వంటి అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ అభివృద్ధి మందగిస్తుంది. దేశంలో ఇప్పటికే తయారీ రంగం తగ్గిపోతోంది. దీని ప్రభావంగా, అధునాతన పరిశ్రమలు విదేశాల నుండి అధిక ఉత్పత్తులను దిగుమతి చేసుకోవాల్సి వస్తుంది. ఇంజనీరింగ్ అనేది ఆవిష్కరణలకు పునాది. మెకానికల్, సివిల్, ఎలక్ట్రికల్ రంగాల్లో శాస్త్రీయ పరిశోధనలు లేకపోతే, కొత్త పరికరాలు, నిర్మాణ పద్ధతులు అభివృద్ధి కాబోవు. దీని వల్ల దేశీయ ఆవిష్కరణలు తగ్గిపోయి, ఇతర దేశాలపై ఆధారపడే పరిస్థితి ఏర్పడుతుంది. అన్ని విద్యార్థులు ఒకే రంగాన్ని ఎంచుకుంటే, భవిష్యత్‌లో ఉద్యోగ అసమతుల్యత పెరిగే అవకాశం ఉంది.
పరిష్కార మార్గాలు..
కోర్ ఇంజనీరింగ్‌కు ప్రాముఖ్యత ఇవ్వడం. విద్యార్థులు కోర్ ఇంజనీరింగ్ శాఖల విలువను అర్థం చేసుకోవాలి. ప్రభుత్వ ప్రోత్సాహకాలు, స్కాలర్‌షిప్‌లు పెంచాలి. పరిశ్రమలు-కళాశాలలు కలిసి ఇంటర్న్‌షిప్, పరిశోధన అవకాశాలు కల్పించాలి. ప్రాముఖ్యత ఉన్న టెక్నాలజీలతో కోర్ ఇంజనీరింగ్‌ను కలిపే ప్రయత్నం చెయ్యాలి. AI, IoT(Internet of Things), Data Science, Automation లను కోర్ రంగాల్లో వినియోగించడం ద్వారా కొత్త అవకాశాలు సృష్టించవచ్చు. మెకానికల్-రోబోటిక్స్, సివిల్-స్మార్ట్ సిటీస్, ఎలక్ట్రికల్-రెన్యువబుల్ ఎనర్జీ, కెమికల్-బయో టెక్నాలజీ వంటి కొత్త కోర్సులు రూపొందించాలి. భారతదేశంలో తయారీ రంగాన్ని అభివృద్ధి చేసి, స్థానిక ఇంజనీరింగ్ ఉపాధికి మార్గం సుగమం చేయాలి. ప్రభుత్వ రంగ సంస్థలు (పబ్లిక్ సర్వీస్ అండర్ టేకింగ్ - PSUs) కొత్త ప్రాజెక్టులను ప్రోత్సహించి, కోర్ ఇంజనీరింగ్ విద్యార్థులకు అవకాశాలు కల్పించాలి.
ఈ కోర్సులను విస్మరిస్తే..
కేవలం కంప్యూటర్ సైన్స్, AI & ML, VLSI లాంటి రంగాలకు మాత్రమే ప్రాధాన్యత ఇస్తూ కోర్ ఇంజనీరింగ్‌ను విస్మరిస్తే, దీని ప్రభావం పరిశ్రమల నుంచి దేశ ఆర్థిక వ్యవస్థ వరకు అనేక కోణాల్లో కనిపిస్తుంది. దేశ అభివృద్ధికి మూల స్తంభాలలో ముఖ్యమైన మెకానికల్, సివిల్, ఎలక్ట్రికల్, కెమికల్ ఇంజనీరింగ్ లాంటి కోర్ శాఖలను కాపాడాల్సిన అవసరం ఉంది. లేకుంటే భవిష్యత్ తరాలు ఆధునిక సాంకేతికతలో ముందుండినా, మౌలిక రంగాల్లో వెనుక బడిపోయే ప్రమాదం తప్పదు.
మహేశ్వరం భాగ్యలక్ష్మి
95056 18252