బెట్టింగ్‌ను నియంత్రించాలి!

దేశంలో బెట్టింగ్ సర్వాంతర్యామిగా మారింది. జిల్లా కేంద్రాలతో పాటు మండల, గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఈ అక్రమ దందా

Update: 2025-03-25 00:45 GMT

 దేశంలో బెట్టింగ్ సర్వాంతర్యామిగా మారింది. జిల్లా కేంద్రాలతో పాటు మండల, గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఈ అక్రమ దందా ఊపందుకుంది. డబ్బు సులభంగా సంపాదించాలని కోరికతో ఉన్నవారు ఎక్కువగా బెట్టింగ్ బారిన పడుతున్నారు. అందులో ఇక ఐపీఎల్ వంటి ఫ్రొఫెషనల్ క్రికెట్ ఆటతో ఇది మరింత పెరిగిపోయింది. ఈ దేశంలోని చాలా రాష్ట్రాల్లో బెట్టింగ్ చట్టవిరుద్ధం. కానీ గుట్టు చప్పుడు కాకుండా చాలామంది యువకులు ఈ బెట్టింగ్ యాప్‌లను అనధికారికంగా వాడుతున్నారు.

పోలీసులు హెచ్చరిస్తున్నా..

దేశంలో గత పది పదిహేనేళ్ల క్రితం మొదలైన ఈ క్రికెట్ బెట్టింగ్ వ్యసనం, మొదట్లో కేవలం ఇండియా టీమ్ ఆడే మ్యాచ్‌లకు మాత్రమే ఉండేది. రాను రానూ ఇది మరింత ముదిరి పాకాన పడింది. ముఖ్యంగా టీ-20 మ్యాచ్‌లు ప్రారంభమైనప్పటి నుంచి బెట్టింగ్ జాఢ్యం ఊపందుకుంది. దీనికి తోడు అగ్నికి ఆజ్యం పోసినట్లు ఐపీఎల్ యువతను మరింత కట్టి పడేసింది. దీంతో బెట్టింగ్‌ల జోరుకు అడ్డుకట్ట అనేది లేకుండా పోయింది. ఇక బెట్టింగ్‌లకు బానిసలుగా మారిన చాలా మంది అమాయకులు ఆర్థికంగా నష్టపోవడమే కాకుండా, తమ కుటుంబాలు చిన్నాభిన్నం చేసుకుంటున్నారు. తల్లిదండ్రులు ఇచ్చే పాకెట్‌ మనీతో క్రికెట్‌లో గెలుపోటములపై వారు పందాలు కాస్తున్నారు. అలాగే దేశంలో సైబర్ నేరాలకు పాల్పడుతున్న ముఠాల్లో ఎక్కువగా బెట్టింగ్, మాదకద్రవ్యాలు, ఆర్థిక నేరగాళ్లే అధికం. బెట్టింగ్‌లకు పాల్పడితే చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరికలు జారీ చేస్తున్నా కొంత మంది మాత్రం బెట్టింగ్‌లనే వృత్తిగా సాగిస్తున్నారు. ఇప్పటికైనా పోలీసులు నిఘా పెట్టి క్రికెట్ బెట్టింగ్‌లకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి.

నిషేధించే చట్టం లేదు..

స్పోర్ట్స్ బెట్టింగ్ చట్టం అనేది సంక్లిష్టమైన అంశం. ఎందుకంటే ప్రతి దేశానికి స్పోర్ట్స్ బెట్టింగ్‌కు సంబంధించి దాని సొంత చట్టాలు ఉన్నాయి. కానీ మన దేశంలోనే చట్టాలలోనే ఎక్కువ భాగం ఖచ్చితంగా ఏది చట్టబద్ధమైనది, ఏది కాదో స్పష్టం చేయడంలో విఫలమైంది. గుర్రపు పందాలపై బెట్టింగ్‌లు మినహా భారతదేశంలో క్రీడలు బెట్టింగ్‌లు ప్రధానంగా చట్టవిరుద్ధం. భారతదేశంలో ఎక్కువ భాగం పబ్లిక్ గ్యాంబ్లింగ్ యాక్ట్ 1867, టెక్నాలజీ యాక్ట్ 2000కి లోబడి ఉంది. ఆ చట్టాల ప్రకారం స్పోర్ట్స్ బెట్టింగ్ అనుమతించబడదు. కానీ ఒక్కో రాష్ట్రానికి వారి స్వంత చట్టాలు రూపొందించుకునే హక్కు ఉంటుంది. మన రాష్ట్రంలనూ తెలంగాణ గేమింగ్ యాక్ట్, 2017 చట్టప్రకారం ఇక్కడ ఆన్‌లైన్ గేమింగ్ నిషేధం. ఇక దేశంలో పబ్లిక్ గ్యాంబ్లింగ్ యాక్ట్ (1867) ప్రకారం, భారతదేశంలో అన్ని రకాల జూదాలు చట్టవిరుద్ధం. భారతీయ వ్యవస్థలో ఆన్‌లైన్ జూదాన్ని నిషేధించే నిర్దిష్ట చట్టం ఏదీ లేకపోవడంతో బెట్టింగ్ కంపెనీలు భారతీయులను ప్రతి దానిపై పందెం వేయడానికి ఈ లొసుగులను ఉపయోగించుకుంటున్నారు. పట్టుకున్నా దోషులు తప్పించుకుంటున్నారు. అందుకే దేశంలో ఎక్కువగా బెట్టింగ్‌లకు కారణమైన ఐపీఎల్‌ను ప్రభుత్వాలు సత్వరమే నిషేధించాలి. తద్వారా యువతను చెడుమార్గం నుండి బయటకు రప్పించవచ్చు.

డా. యం. సురేష్ బాబు,

99899 88912

Tags:    

Similar News