కారుణ్య నియామకం.. పరిష్కారం కారాదు..
ఒక ప్రభుత్వ ఉద్యోగి మరణించిన తర్వాత అతని కుటుంబ సభ్యులకు కారుణ్య నియామకం

ఒక ప్రభుత్వ ఉద్యోగి మరణించిన తర్వాత అతని కుటుంబ సభ్యులకు కారుణ్య నియామకం(Compassionate Appointment) కింద ఇచ్చే ఉద్యోగం అనేక చర్చలకు తావిస్తోంది. దీనిలో కొన్ని ప్రయోజనాలున్నా.. దీనివల్ల తలెత్తుతున్న సమస్యలు, అన్యాయాలు, సామా జిక అసమతుల్యతలు పెద్ద చర్చనీయాంశమయ్యాయి. ఈ విధానం పట్ల కొంతమంది మద్దతు తెలుపుతుండగా, మరికొందరు దీని అమలులో ఉండే అనేక లోపాలను, అన్యాయాలను ఎత్తి చూపుతున్నారు. ఈ విధానం ప్రభుత్వ ఉద్యోగం సంపాదించడానికి పోటీపడే వేలాది నిరుద్యోగ యువత ఆశలపై నీళ్ళు చల్లినట్టు మారిందని విమర్శలు వస్తున్నాయి.
ఈ నియామకాల కారణంగా..
ప్రభుత్వ ఉద్యోగాలకు సాధారణంగా కఠినమైన పోటీ పరీక్షలు, మెరిట్ ఆధారంగా నియామకాలు ఉంటాయి. అయితే, కారుణ్య నియామక విధానంలో పోటీ లేకుం డానే ఉద్యోగం లభిస్తుంది. ఇది నైపుణ్యం ఉన్న యువతకు నష్టం కలిగించవచ్చు. కొన్ని ప్రభుత్వ శాఖల్లో నాలుగవ, మూడవ తరగతి సిబ్బంది చాలవరకు కారుణ్య నియామకాలతో నిండివుండి నైపుణ్య లేమి వల్ల పనుల్లో జాప్యం జరుగుతుంది అనేది వివిధ శాఖల్లో ఉన్న అభిప్రాయం. ప్రభుత్వ ఉద్యోగాల సంఖ్య తక్కువగా ఉండటంతో, నిరుద్యోగుల సంఖ్య పెరుగుతోంది. కారుణ్య నియామకాల కారణంగా, మెరిట్ ఆధారంగా ఉద్యోగం పొందే అవకాశాలు తగ్గిపోతాయి. ఒకే విధమైన కష్టాలను అనుభవిస్తున్న నిరుపేద నిరుద్యోగులకు ప్రభుత్వ ఉద్యోగం దక్కడం చాలా కష్టంగా మారింది. దీనికి ఉదాహరణ ఈ మధ్య చాలా సంవత్సరాల తరువాత అరకొర ఖాళీలతో పడిన గ్రూప్ -3, గ్రూప్ 4 ఉద్యోగ నోటిఫికేషన్.
అర్హత లేకున్నా..
ప్రభుత్వ ఉద్యోగి ఎలాంటి పరిస్థితుల్లో ఎలాంటి కారణాలతో మరణించారో సమగ్ర విచారణ జరగాలి. అనైతిక పనులు చేసి, దురలవాట్లతో చనిపోయిన వారి వారసులకు ప్రభుత్వ ఉద్యోగం కట్టబెట్టడం ఆక్షేపణీయం. ఒకసారి ప్రభుత్వ ఉద్యోగం వస్తే తరతరాల పాటు ఆ కుటుంబం బతుకొచ్చు అనే భావన బలపడుతుంది. ఈ విమర్శకు ఎన్నో ఉదాహరణలు సమాజంలో చూడొచ్చు. కారుణ్య నియామకాలకు సంబంధించి అర్హత లేకున్నా తప్పుడు ధ్రువపత్రాలతో ఉద్యోగం పొందుతున్నారు.
ఉద్యోగం ఇచ్చేందుకు బదులుగా..
కారుణ్య నియామకం కింద ఉద్యోగం పొందడం అనేది హక్కు కాదని సుప్రీంకోర్టు 1997లో మరణించిన కానిస్టేబుల్ విషయంలో, అతని కుమారుడు వేసిన పిటిషన్ కొట్టేస్తూ స్పష్టం చేసింది. వారసులకు ఉద్యోగం ఇవ్వడం కంటే మరణించిన ఉద్యోగి కుటుంబానికి ఒక నిర్ణీత కాలం ఆర్థిక సహాయాన్ని అందించడం సరైన పరిష్కారం. ఉద్యోగం ఇచ్చేందుకు బదులుగా, ఆ కుటుంబ సభ్యులకు శిక్షణ ఇచ్చి, పోటీ పరీక్షల్లో మెరుగైన అవకాశాలు కల్పించాలి. ఒకే కుటుంబంలో ఒకరికి ఉద్యోగం వచ్చిన తర్వాత మరో సభ్యుడికి కారుణ్య ఉద్యోగం ఇచ్చేందుకు నిరాకరించాలి. ప్రభుత్వ ఉద్యోగి కుటుంబాన్ని ఆదుకోవాలన్న లక్ష్యం మంచిదే కానీ, అందుకు ఉద్యోగాన్ని పరిష్కారంగా చూడటం అనేక సమస్యలకు దారితీస్తుంది. సమానత్వాన్ని కాపాడే విధంగా మెరిట్ ఆధారంగా ఉద్యోగాలు కల్పించడం సమాజానికి మేలు కలిగించే మార్గం. కాబట్టి, కారుణ్య నియామక విధానాన్ని పూర్తిగా రద్దు చేయకూడదు కానీ, దాన్ని పరిమితంగా, పారదర్శకంగా, సమర్థవంతంగా నిరుద్యోగులకు ఇబ్బంది లేకుండా అమలు చేసే మార్గాన్ని అన్వేషించాలి.
కమల హాసన్ తుమ్మ
95056 18252